‘15 రోజుల్లో రేషన్‌ పంపిణీ పూర్తికావాలి’

ABN , First Publish Date - 2021-02-27T05:43:22+05:30 IST

రేషన్‌ డీలర్లు, మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ ఆపరేటర్లు సమన్వయంతో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి అన్నారు.

‘15 రోజుల్లో రేషన్‌ పంపిణీ పూర్తికావాలి’

రాజమహేంద్రవరంఅర్బన్‌, ఫిబ్రవరి 26 : రేషన్‌ డీలర్లు, మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ ఆపరేటర్లు సమన్వయంతో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ ఆపరేటర్లు, వీఆర్‌వోలు, డీలర్లుతో సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఇటీవల ఇంటింటికీ రేషన్‌ పంపిణీలో ఎదుర్కొన్న సమస్యలను డిస్పెన్సింగ్‌ ఆపరేటర్లను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే వాటన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆపరేటర్ల సమస్యలను పరిష్కరిస్తామని, ఆకస్మికంగా రేషన్‌ పంపిణీ నిలిపివేయరాదని సూచించారు. ప్రతిరోజూ డీలరు ఉదయం 5.30నుంచి 6 గంటల మధ్యలో రేషన్‌షాపు వద్ద ఉండి డీలర్‌ ఈ-పాస్‌లో లాగిన్‌ కావాలన్నారు. ఎండీయు ఆపరేటర్లు ఉదయం 6 గంటలకు తమకు కేటాయించిన సచివాలయం పరిధిలోని షాపువద్దకు వెళ్లి స్టాకును డీలరు నుంచి సరైన తూ కంతో ఈ-పాస్‌ ద్వారా తీసుకోవాలన్నారు. వాహనాన్ని ఒకేచోట ఉంచి కార్డుదారులను వరుసలో నిలబెట్టి రేషన్‌ పంపిణీ చేయరాదని, వాహనాన్ని నడుపుతూ ఇంటి వద్దనే సరుకులు పంపిణీ చేయాలని సబ్‌ కలెక్టర్‌ స్పష్టం చేశారు. 15 రోజుల్లో రేషన్‌ పంపిణీ కార్యక్రమం పూర్తిచేసే విధంగా వీఆర్‌వోలు, ఆపరేటర్లు, డీలర్లు సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సత్యనారాయణ, ఏఎస్‌వో రాజు, ఎంఎస్‌వో సూర్యప్రభాకర్‌ పాల్గొన్నారు.



Updated Date - 2021-02-27T05:43:22+05:30 IST