ఆంధ్రా ముంబై అథోగతి

ABN , First Publish Date - 2020-03-15T11:25:42+05:30 IST

ఆంధ్ర ముంబైగా ఆదోనికి ఘనకీర్తి ఉంది. ఒకప్పుడు నూలు, నూనె ఉత్పత్తి మిల్లులు, పత్తి జిన్నింగ్‌ అండ్‌

ఆంధ్రా ముంబై అథోగతి

 ఆదోని పురపాలికకు 155 ఏళ్ల చరిత్ర

 రూ.కోట్ల ఆదాయం.. అభివృద్ధి శూన్యం

 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ

ఆదోని, మార్చి 14: ఆంధ్ర ముంబైగా ఆదోనికి ఘనకీర్తి ఉంది. ఒకప్పుడు నూలు, నూనె ఉత్పత్తి మిల్లులు, పత్తి జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ పరిశ్రమలకు ఈ ప్రాంతం నిలయం. విధులకు వచ్చిపోయే వేలాది మంది కార్మికు లతో పురవీధులు కళకళలాడేవి. ఇదంతా చరిత్ర. నేడు పరిస్థితి భిన్నంగా మారింది. పారిశ్రామిక సంక్షోభం.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా నూనె మిల్లులు మూతబడ్డాయి. నూనె ఉత్పత్తి పరిశ్రమల తలుపులు తెరుచుకోవడం లేదు. కార్మికులకు ఉపాధి కరువైంది.


ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల సమయంలో మూతబడిన పరిశ్రమలు తెరిపిస్తామని నాయకులు హామీ ఇస్తున్నారు గానీ, ఫలితం మాత్రం కనిపించడం లేదు. శివారు కాలనీలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. 155 ఏళ్ల చరిత్ర కలిగిన ఆదోని పురపాలక సంఘం గురించి కథనం. 

బ్రిటీష్‌ వారి కాలంలోనే..

తెల్లదొరల పాలనలో బళ్లారి జిల్లాలో ఉన్న ఆదోని 1865లోనే పురపాలక సంఘంగా ఆవిర్భవించింది. నాటి బళ్లారి కలెక్టర్‌ అధ్యక్షతన తొలి పాలకవర్గం కొలువుదీరింది. ఆ నాటి జనా భా కేవలం 12,500 మాత్రమే. నివాస గృహాలు 450. పట్టణ విస్తీర్ణం 10.5 చదరపు కిలోమీటర్లు. 155 ఏళ్లల్లో పట్టణ జనాభా భారీగా పెరిగింది. నివాసాలు విస్తరించాయి. నేడు నివాస గృహాలు 33,826, జనాభా 1,66,537, విస్తీర్ణం 32.17 చదరపు కిలో మీటర్లు. కానీ దీనికి అనుగుణంగా అభివృద్ధి జరగలేదు. 


తొలి చైర్మన్‌ హజీకే అబ్దుల్‌ రెహమాన్‌

ఆదోని మున్సిపాలిటీకి 1917లో తొలిసారిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. హజీకే అబ్దుల్‌ రెహమాన్‌ తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 1942 వరకు కొనసాగారు. 1945లో జరిగిన ఎన్నికల్లో రాచోటి సుబ్బయ్య చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నాటి నుంచి 1964 వరకు ఆయనే చైర్మన్‌గా కొనసాగారు. 1967లో విట్టా కిష్టప్ప చైర్మన్‌ బాధ్యతలు చేపట్టి 1986 వరకు రెండు పర్యాయాలు కొనసాగారు. 2005 నుంచి 2009 వరకు ప్రత్యేక అధికారి పాలన ఉన్నింది.


2009 నుంచి 2014 వరకు విట్టా కిష్టప్ప, 2014 నుంచి 2019 వరకు కురువ సరో జమ్మ రాముడు కొనసాగారు. మూడు పర్యా యాలు చైర్మన్‌గా విట్టా కిష్టప్ప కొనసాగారు. 1952లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాకా బళ్లారి జిల్లా నుంచి ఆదోని విడిపోయి, కర్నూలు జిల్లాలో చేరింది. నాటి నుంచి జరిగిన పురపాలక ఎన్నికల్లో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారే పట్టణాన్ని పాలించారు. 

1983 తర్వాత టీడీపీదే బలం..

టీడీపీ ఆవిర్భవించాక జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులే ఎక్కువమార్లు గెలిచారు. 1987లో టీడీపీ అభ్యర్థి దేవదాసు, 1995లో టీడీపీ అభ్యర్థి, చేనేత వర్గానికి చెందిన మల్లయ్య గెలిచి చైర్మన్‌ అయ్యారు. 2000 ఎన్ని కల్లో టీడీపీ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థి అరుణా దేవి వాసుబాబు గెలిచారు. 2005 పుర ఎన్నికల్లో అధ్యక్ష పీఠాన్ని నాటి అధికార పార్టీ కాంగ్రెస్‌ దక్కించుకుంది. విట్టా కిష్టప్ప చైర్మన్‌ అయ్యారు. ఆ ఎన్నికలకు అప్పటి ఎమ్మెల్యే మీనాక్షినాయుడు దూరంగా ఉన్నారు. 

అభివృద్ధి శూన్యం

ఆదోని పురపాలిక ఆదాయం రూ.25 కోట్లకు చేరింది. ఆస్తిపన్ను రూ.10 కోట్లు, నీటి పన్ను రూ.5 కోట్లు, అద్దె, మార్కెట్‌ వేలం ద్వారా మరో రూ.10 కోట్లు ఆదాయం వస్తోంది. నీటి నిర్వహణకు నెలకు రూ.50 లక్షలు, పారిశుధ్యం, విద్యుత్‌కి ఏడాదికి రూ.8.35 కోట్లు వెచ్చిస్తు న్నారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో రూ. కోట్ల ఆదాయం వస్తున్నా.. అభివృద్ధి అందని ద్రాక్షగా మారింది. శివారు కాలనీలైన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నగర్‌, దివాకర్‌రెడ్డి నగర్‌, రాయనగర్‌, పర్వతాపురం, శంకర్‌నగర్‌, భీమిరెడ్డి నగర్‌, వైఎస్సార్‌ నగర్‌ తదితర ప్రాంతాలలో కనీస సౌకర్యాలు లేవు. కార్మికులు ఉండే రాయనగర్‌లో తాగునీరు, సీసీ రహదారుల సౌకర్యం లేదు. 

రూ.36 కోట్లు వెచ్చించినా..

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ డెవల ప్‌మెంట్‌ (డీఎఫ్‌ఐడీ) పథకం కింద ఆదోని మున్సిపాలిటీని 2000 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. నాటి నుంచి పదేళ్ల వరకు రూ.36 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ నిధులు కాంట్రాక్టర్లకు కాసులు కురిపించాయే తప్ప కాలనీలు మాత్రం బాగుపడలేదు. 

నీదా.. నాదా సై..

తాజా ఎన్నికల్లో పురపాలక చైర్మన్‌ పీఠం కోసం టీడీపీ, వైసీపీ మధ్య పోరు సాగుతోంది. రెండు పార్టీల మద్దతుదారులు దూకుడుగా ఉన్నారు. టీడీపీ బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, వైసీపీ బాధ్యతలను ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి తీసుకున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. 


అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ టీడీపీ ముందుకు సాగుతోంది. 9 నెలల్లో అభివృద్ధి చేసిందేమీ లేదని ఓటర్లకు వివరిస్తోంది. పుర ఎన్నికల్లో విజయం సాధిం చేందుకు కృషి చేస్తోంది. ఓటర్లు కూడా ఏ ప్రభు త్వం ఏ పని చేస్తోందో గమనిస్తున్నారు. పనిచేసే వారికే పట్టంగడతా మని పేర్కొంటున్నారు. 

Updated Date - 2020-03-15T11:25:42+05:30 IST