హైదరాబాద్‌లో మరో 15 కరోనా కేసులు.. లాక్‌డౌన్ నుంచి ఇంట్లోనే ఉన్నా ఆయనకు..

ABN , First Publish Date - 2020-05-21T16:20:54+05:30 IST

గ్రేటర్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో వైర్‌సవ్యాప్తి కొనసాగుతూనే ఉంది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు..

హైదరాబాద్‌లో మరో 15 కరోనా కేసులు.. లాక్‌డౌన్ నుంచి ఇంట్లోనే ఉన్నా ఆయనకు..

గ్రేటర్‌లో 15 మందికి పాజిటివ్‌

కొనసాగుతున్న కరోనా విజృంభణ

ఆందోళన చెందుతున్న ప్రజలు


హైదరాబాద్‌ సిటీ నెట్‌వర్క్‌ (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం 15 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో వైర్‌సవ్యాప్తి కొనసాగుతూనే ఉంది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు.. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పౌరులు ఆందోళన చెందుతున్నారు. కొందరికి వైరస్‌ ఎలా సోకిందన్న దానిపై అధికారులూ స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. లాక్‌డౌన్‌ నుంచి ఇంట్లోనే ఉన్న ఓ వ్యక్తికి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావడంతో ఎలా వైరస్‌ బారిన పడ్డాడని అధికారులు ఆరా తీస్తున్నారు. 


హబీబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరో వ్యక్తికి  పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అఫ్జల్‌సాగర్‌ కోమటికుంట ప్రాంతంలో నివసిస్తున్న 51 ఏళ్ల వ్యక్తి ప్రైవేట్‌ ఉద్యోగి. లాక్‌డౌన్‌ నాటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ నెల 16వ తేదీన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు.  వైద్యులు అతడి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా బుధవారం వచ్చిన రిపోర్ట్స్‌లో కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో ఉన్న 11 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అతడికి కరోనా వైరస్‌ ఎలా సోకిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. 


జియాగూడ మర్పన్‌బస్తీకి చెందిన ఓ వ్యక్తి(65)కి కరోనా పాజిటివ్‌ అని తేలింది. మర్పన్‌బస్తీకి చెందిన(30) వ్యక్తికి మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులు 11మందిని క్వారంటైన్‌ చేశారు. అందరి రక్త నమూనాలను సేకరించి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపించారు. తండ్రికి పాజిటివ్‌ అని బుధవారం తేలింది. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.  


ఓల్డ్‌మలక్‌పేటలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. శంకర్‌నగర్‌ నివాసి(40)కి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లుగా నిర్ధారణ అయింది. అతడు స్థానికంగా ఉన్న మసీదు కమిటీ మౌజం అని వైద్యులు గుర్తించారు. అతడి కుటుంబంలోని దాదాపు 14 మందిని క్వారంటైన్‌ చేస్తూ సరోజినీదేవి ఆస్పత్రికి బుధవారం తరలించారు. ఓల్డ్‌మలక్‌పేటలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య 33కు చేరింది. గత నెల 9న ఓల్డ్‌మలక్‌పేట ఫకీర్‌గల్లీలో ఒకే కుటుంబంలో 11మందికి పాజిటివ్‌ రావడంతో ఇక్కడ కేసుల నమోదు మొదలైంది. కొన్ని రోజులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పాజిటివ్‌ కేసులు ఈ ప్రాంతంలోనే ఎక్కువవుతూ వస్తున్నాయి. 


ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆస్పత్రిలో క్వారంటైన్‌లో ఉన్న ఇద్దరికి పాజిటివ్‌ రావడంతో వారిని బుధవారం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఏడుగురికి నెగెటివ్‌ రావడంతో వారిని డిశ్చార్జి చేశారు. ఓపీకి బుధవారం 15 మంది రాగా వారిలో ఆరుగురికి కరోనా లక్షణాలు ఉండడంతో అడ్మిట్‌ చేసుకుని నమూనాలను సేకరించారు.  ప్రస్తుతం ఆస్పత్రిలో 12 మంది అనుమానిత కేసులకు చికిత్స అందిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ ఖాన్‌ తెలిపారు.


జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఎస్‌ఆర్‌నాయక్‌నగర్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ ఏరియాను అధికారులు కట్టడి ప్రాంతంగా ప్రకటించారు. అతడి కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను హోంక్వారంటైన్‌లో ఉంచారు.


శేరిలింగంపల్లి పాపిరెడ్డికాలనీకి చెందిన సివిల్‌ ఇంజనీర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయనకు చికిత్స చేసిన ఆర్‌ఎంపీ వైద్యుడు,  వైద్యపరీక్షలు చేసిన స్థానిక ల్యాబ్‌ అసిస్టెంట్‌, కాలనీకి చెందిన మెడికల్‌ షాపు నిర్వాహకుడిని ఛాతీ ఆస్పత్రికి తరలించినట్లు లింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ రాంరెడ్డి తెలిపారు. 


ఫీవర్‌ ఆస్పత్రికి తగ్గిన ఓపీ కేసులు

నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి ఓపీ కేసులు తగ్గాయి. గతంలో ఆస్పత్రికి ప్రతిరోజూ వెయ్యి నుంచి రెండున్నర వేల వరకు ఓపీ సేవల కోసం రోగులు వచ్చే వారు. ఆస్పత్రిలో కరోనా వైరస్‌ ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయడంతో ఆస్పత్రికి రావడానికి రోగులు భయపడుతున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉండగా ఎమర్జెన్సీ సేవలు నిరంతరం కొనసాగుతున్నాయి. బుధవారం ఓపీ కేసులు 200వరకు నమోదయ్యాయి. సోమవారం 193, మంగళవారం 215 ఓపీ కేసులు నమోదయ్యాయి.


పెరిగిన రోగులు

లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో మానసిక ఆస్పత్రిలో రోగుల సంఖ్య రెట్టింపయింది. గత బుధవారం 192మంది రోగులు రాగా.. 20వ తేదీన 315 మంది వచ్చారు. ఛాతీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా కొవిడ్‌ వార్డు ఏర్పాటు చేయడంతో ఓపీ రోగుల సంఖ్య తగ్గిపోయింది. కరోనా వైరస్‌ వ్యాప్తి కాకముందు ఆస్పత్రికి 250 నుంచి 300 మంది రోగులు వస్తే... ప్రస్తుతం 80-90 మంది కూడా రావడం లేదు.  గత బుధవారం ఓపీకి 60మంది రాగా 20వ తేదీన 87 మంది మాత్రమే వచ్చారు. ఆయుర్వేద ఆస్పత్రిలో ఉన్న 220 బెడ్‌లను కరోనా రోగుల కోసం కేటాయించడంతో ఓపీ రోగులకు చికిత్స అందించడం లేదు. 


భోలక్‌ఫూర్‌లో ఎస్‌పీవో పర్యటన 

భోలక్‌ఫూర్‌లోని కట్టడి ప్రాంతంలో హెల్త్‌ స్పెషల్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ (ఎస్‌పీవో) డాక్టర్‌ రాజశ్రీ బుధవారం పర్యటించారు.  కరోనా వైరస్‌ బారిన పడిన గర్భిణి కుటుంబ సభ్యులను కలిసి వారి ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారు. 


Updated Date - 2020-05-21T16:20:54+05:30 IST