నిధులు ‘తెల్ల’బోయాయి..!

ABN , First Publish Date - 2020-07-01T10:28:43+05:30 IST

ప్రభుత్వ పెద్దల రంగుల పిచ్చి పల్లెప్రగతిపై ప్రభావం చూపనుంది. పల్లెసీమల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులను రంగులకు

నిధులు ‘తెల్ల’బోయాయి..!

సచివాలయాల తెల్లరంగుకు 14వ ఆర్థిక సంఘం నిధులు

రూ.3.16 కోట్లు తాగునీరు, పారిశుధ్య పనులపై ప్రభావం

వార్డు సచివాలయ రంగులకు రూ.1.28 కోట్లు


(కడప-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పెద్దల రంగుల పిచ్చి పల్లెప్రగతిపై ప్రభావం చూపనుంది. పల్లెసీమల అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం నిధులను రంగులకు ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గ్రామ పంచాయతీల్లో పైసా లేక, మౌలిక వసతులు కల్పించలేక చతికిలపడ్డాయి. ఈ నేపధ్యంలో కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు ఊపిరి పోయగా, ఇప్పుడు రంగుల రూపంలో ఆ ఊపిరి ఆపే యత్నం చేయడాన్ని గ్రామీణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల గ్రామ పంచాయతీలకు వచ్చిన ఆర్థిక సంఘం నిధుల నుంచి దాదాపు రూ.3.16 కోట్లు రంగుల కోసం వెచ్చించాల్సిన దుస్థితి దాపురించిందని అంటున్నారు. జగన్‌ సర్కారు గ్రామ సచివాలయాల భవనాలకు వైసీపీ పతాకాన్ని పోలిన రంగులు వేశారు. ఇది అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది. మున్సిపల్‌, కార్పొరేషన్లలోని వార్డుల్లో కూడా అదే రంగు వేశారు. గ్రామ సచివాలయాలకు వైసీపీ కార్యాలయాలుగా తలపించేలా రంగులు వేయడాన్ని ఆక్షేపిస్తూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించడం, ఈ మేరకు రంగులు మార్చాలని న్యాయస్థానం ఆదేశించడం తెలిసిందే.


ఆర్థిక సంఘం నిధులతో..

కేంద్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కోసం ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తుంది. జిల్లాలో 807 గ్రామ పంచాయతీలున్నాయి. మార్చిలో మొదటి విడత రూ.44.13 కోట్లు, రెండో విడత రూ.59.39 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఈ సొమ్ములో పల్లెల్లో మెరుగైన తాగునీటి సరఫరా కోసం 20 శాతం,  మైనర్‌ గ్రామ పంచాయతీలైతే కరెంటు ఛార్జీల కోసం 10 శాతం, మేజర్‌ పంచాయతీలైతే 15 శాతం, పారిశుధ్యం కోసం 15 శాతం కేటాయించాల్సి ఉంది. శానిటేషన్‌లో భాగంగా వర్షాకాలంలో అంటువ్యాఽధులు ప్రబలకుండా ఉండేందుకు రక్షిత మంచినీటి పథకాలు శుభ్రం చేయడం, వ్యాధి ప్రబలకుండా క్లోరినేషన్‌, డ్రైనేజీ తదితర పనులు చేపట్టాల్సి ఉంది. 5 శాతం నిధులను గ్రామ పంచాయతీ ఈ-ఆఫీస్‌ నిర్వహణ కోసం ఖర్చు చేయాల్సి ఉంది. మిగతా 50 శాతం సొమ్ముతో గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి పనులు అంటే డ్రైన్స్‌, రోడ్లు తదితర పనుల కోసం మ్యాచింగ్‌ గ్రాంట్‌గా ఉపయోగించాల్సి ఉంది.


సచివాలయాల రాకతో

జగన్‌ సర్కారు సచివాలయ వ్యవస్ధను తీసుకువచ్చింది. రెండువేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేయడంతో జిల్లాలో మొత్తం 633 గ్రామసచివాలయాలు ఏర్పాటు చేశారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉండాల్సి ఉండగా.. వైసీపీని పోలిన రంగులు వేశారు. కోర్టు తీర్పుతో ఆ రంగులను తుడిపేస్తూ దానిపై తెల్ల రంగు వేస్తున్నారు. తరువాత భవనం కింద ప్రాంతంలో కొంత భాగం ఎర్రమట్టి కలర్‌ వేయనున్నారు. ఒక్కో భవనం వైశాల్యం బట్టి తెల్ల రంగు కోసం దాదాపు రూ.50వేలు ఖర్చవుతుందని పంచాయతీకి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. అటు జిల్లాలో ఒక్కో సచివాలయానికి రూ.50వేల చొప్పున వేసుకున్నా మొత్తం 633 సచివాలయాలకు రూ.3,16,50,000 ఖర్చు కానుంది.


దీని ప్రభావం పల్లెప్రగతిపై చూపుతుంది. ఇక మున్సిపల్‌, కార్పొరేషన్లలో వార్డు సచివాలయాలకు కూడా ఇదే రంగు వేశారు. జిల్లాలో 256 వార్డు సచివాలయాలున్నాయి. ఒక్కో దానికి రూ.50వేలు ఖర్చుచేసినా ఇక్కడ రూ.1.28 కోట్లు ఖర్చు కానుంది. రంగుల వ్యవహారం కోర్టులో ఉన్నప్పటికీ కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇటీవల ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలకు కూడా అదే రంగు వేశారు. 620 కేంద్రాలు ప్రారంభించారు. వాటికీ రంగు మార్చాలంటే మరింత ఖర్చు కానుంది.

Updated Date - 2020-07-01T10:28:43+05:30 IST