కరోనా ఘంటికలు!

ABN , First Publish Date - 2020-06-27T10:03:20+05:30 IST

కరోనా కంటికి కనిపించని వైరస్‌. సామాజిక వ్యాప్తి చెంది ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎవరి ద్వారా వ్యాపిస్తుందో.. గుర్తించలేని

కరోనా ఘంటికలు!

జిల్లాలో ప్రతాపం చూపుతున్న వైరస్‌

ఒక్కరోజే 129 పాజిటివ్‌ కేసులు

ప్రొద్దుటూరులో 44, కడపలో 21, పులివెందులలో 19

దువ్వూరులో ఒకే ఇంట్లో ఏడుగురికి కరోనా

ఎవరి ద్వారా వస్తుందో..? గుర్తించలేని స్థాయిలో వ్యాప్తి

786కు చేరిన బాధితులు

ఆరు రోజుల్లోనే 258 కేసులు నమోదు


కడప, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): కరోనా కంటికి కనిపించని వైరస్‌. సామాజిక వ్యాప్తి చెంది ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎవరి ద్వారా వ్యాపిస్తుందో.. గుర్తించలేని స్థాయిలో విజృంభిస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపు తరువాత ఈ వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందింది. జనం వణికిపోతున్నారు. అయినా బాధ్యత లేకుండా విచ్చలవిడిగా రోడ్లపైకి వస్తున్నారు. కనీస నిబంధనలు పాటించడం లేదు. శుక్రవారం ఒక్కరోజే 129 కేసులు నమోదు కావడం ప్రమాద తీవ్రతను తెలుపుతోంది. ప్రొద్దుటూరులో 44, కడప నగరంలో 21, పులివెందుల లో 19 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ వివరాలు పరిశీలిస్తే.. 


జిల్లాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ విస్తరిస్తోంది. కొత్త కొత్త ప్రాంతాల్లో వ్యాపించి ప్రజలను ఆసుపత్రుల వైపు నడిపిస్తోంది. మే 14న లాక్‌డౌన్‌ను సడలించారు. ఆ తరువాత ఒక్కొక్కటిగా సడలింపులు ఇస్తూ వచ్చారు. దీంతో పనులు, వ్యాపారులు.. ఉద్యోగ విధులు.. ఇలా వివిధ పనుల కోసం జనం రోడ్లపైకి యథేచ్ఛగా వస్తున్నారు. కాగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలనే కనీస నిబంధనలు కూడా కొందరు పాటించకపోవడంతో కంటికి కనిపించని శత్రువు జనంపై దాడి చేస్తోంది. ఒక్కరోజే 129 కేసులు రావడం ఇందకు నిదర్శనం. ఏప్రిల్‌ 1న కేవలం 15 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ ఆఖరు నాటికి 79 కేసులు నమోదు కాగా, లాక్‌డౌన్‌ సడలింపులు అమల్లోకి వచ్చిన మే 15 నాటికి జిల్లాలో నమోదైన కేసులు కేవలం 102 మాత్రమే. ఆ తరువాత 41 రోజుల్లో 684 కేసులు పెరిగి 786కు చేరాయి. జూలై 1న 136 కేసులు ఉంటే జూలై 11 నాటికి 306కు చేరాయి. జూలై 21 నాటికి 528 కేసులు నమోదైతే.. ఈ ఆరురోజుల్లో 256 కేసులు పెరిగి 786కు చేరాయంటే కరోనా వైరస్‌ ఏ స్థాయిలో విజృంభిస్తుందో ఇట్టే తెలుస్తోంది.


ప్రొద్దుటూరులో కలకలం

ప్రొద్దుటూరు పట్టణంలో కరోనా కలకలంతో జనం గజగజ వణికిపోతున్నారు. ఒక్కరోజే 44 కేసులు నమోదు కావడం ప్రమాదాన్ని సూచిస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి ఆ పట్టణంలో ప్రతిరోజూ కేసులు నమోదవుతూ వచ్చాయి. ఇప్పటి దాకా 15వేలమంది కరోనా పరీక్షలు చేయగా, 202 మందికి పాజిటివ్‌ వచ్చింది. అయితే కరోనాను అదుపులో చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల అమలులో మున్సిపల్‌, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు రాజకీయ స్వలాభంతో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వ్యాపారులు నష్టపోతున్నారని, ఆంక్షలు వద్దని ఓ ప్రజాప్రతినిధి అధికారులకు సూచించడం కొసమెరుపు. రాజకీయ అండతో వ్యాపారులు కూడా కనీస నిబంధనలు పాటించడంలేదని, ఫలితంగా కరోనా ఆ పట్టణంలో కల్లోలం సృష్టిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. కంటైన్మెంటు జోన్‌ పరిధిలో ఉన్న ప్రజలు ఇతర ప్రాంతాల దుకాణాలకు యథేచ్ఛగా వెళుతున్నారు. కాగా అక్కడ లాక్‌డౌన్‌ పక్కాగా అమలు చేద్దామన్న పోలీసు అధికారుల సూచనలు జిల్లా యంత్రాంగం పెడచెవిన పెట్టిందన్న ఆరోపణలు లేకపోలేదు.


సామాజిక వ్యాప్తి

లాక్‌డౌన్‌ తరువాత ప్రజలు విచ్చలవిడిగా తిరగడం, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో చాలామందికి కరోనా పాజిటివ్‌ రావడం తెలిసిందే. కరోనా సామాజికంగా వ్యాప్తి చెందడంతో ఎవరి నుంచి కరోనా సోకిందో గుర్తించడం పోలీసులు, రెవెన్యూ, ఆరోగ్యశాఖ అధికారులకు కూడా కష్టతరంగా మారింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భౌతికదూరం, మాస్కులు ధరించడం, శానిటైజరు, వ్యక్తిగత పరిశుభత్ర తప్పక పాటించాలని, స్వీయ రక్షణే కరోనా నుంచి రక్షణ అని హెచ్చరిస్తున్నారు. కాగా ప్రజల్లో ఆ భయం కనిపించడం లేదు. దీంతో పల్లె ప్రాంతాలైన గోపవరం, ఒంటిమిట్ట, సంబేపల్లె, కలసపాడు, వేంపల్లె, దువ్వూరు, ముద్దనూరు, చక్రాయపేట తదితర ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది.


9 మంది డిశ్చార్జి

కడప ఫాతిమా మెడికల్‌ కాలేజీ జిల్లా కోవిడ్‌19 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కడప నగరానికి చెందిన ఐదుగురు, విదేశాల నుంచి వచ్చిన మరో నలుగురు కలిపి శుక్రవారం 9 మంది డిశ్చార్జి అయ్యారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 307కు చేరింది. డిశ్చార్జి అయిన వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ.2వేలు ఆర్థికసాయం అందిస్తున్నట్లు కలెక్టరు హరికిరణ్‌ పేర్కొన్నారు. అలాగే రాయచోటి అర్బన్‌ పరిధిలోని కొత్తపల్లె -2, కడప నగరంలోని అరవింద్‌నగర్‌లో 28 రోజులుగా పాజిటివ్‌ కేసులు రాకపోవడంతో ఆ ప్రాంతాలను కంటైన్మెంటు జోన్ల నుంచి తొలగించి శనివారం నుంచి గ్రీన్‌జోన్‌లుగా   అమలు చేస్తున్నట్లు కలెక్టరు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


జిల్లాలో కరోనా వ్యాప్తి ఇలా

తేది కేసులు పెరుగుదల ఎన్ని రోజుల్లో

ఏప్రిల్‌1 15 -- ---

మే 1న 79 64 30

మే 15న 102 23 15

మే 31న 136 34 15

జూన్‌ 11న 306 170 30

జూన్‌ 21 528 222 10

జూన్‌ 26న 786 258 6


కరోనా అప్‌డేట్స్‌

మొత్తం శాంపిల్స్‌ - 64,443

రిజల్ట్‌ వచ్చినవి - 61,394

నెగటివ్‌ - 60,608

పాజిటివ్‌ - 786

పెండింగ్‌ - 3049

26న తీసిన శాంపిల్స్‌ - 856

డిశ్చార్జి - 307


స్వీయరక్షణతో కరోనా నుంచి రక్షణ- కేకేఎన్‌ అన్బురాజన్‌, ఎస్పీ

కరోనా సామాజిక వ్యాప్తి చెందింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించడంలేదు. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదు. బయటికి వచ్చిన వ్యక్తి మాస్కు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. శానిటైజరు, వ్యక్తిగత పరిశుభ్రత బాధ్యతగా నిర్వర్తించాలి. కనీస నిబంధనలు పాటించకపోతే ఫైన్‌లు వేసే అవకాశం లేకపోలేదు, ప్రజల సహకారంతోనే కరోనాను అదుపు చేయడం సాధ్యం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యం పనికి రాదు.

Updated Date - 2020-06-27T10:03:20+05:30 IST