వెళ్లింది 128 మంది.. వచ్చింది 96 మంది

ABN , First Publish Date - 2022-04-17T05:41:03+05:30 IST

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వైద్యపరంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.

వెళ్లింది 128 మంది.. వచ్చింది  96 మంది
సిబ్బంది లేక ఎండోక్రైనాలజీ విభాగం వెలవెల

  1. సర్వజన ప్రభుత్వాసుపత్రిపై బదిలీల ప్రభావం
  2. మూడు విభాగాలకు హెచవోడీలే లేరు
  3.  వేధిస్తున్న ప్రొఫెసర్ల కొరత
  4. ఉన్న వైద్యులపై పెరుగుతున్న ఒత్తిడి
  5. రోగులపై తీవ్ర ప్రభావం

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వైద్యపరంగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అనంతపురం, కడప, నంద్యాల, ప్రకాశం జిల్లాలతోపాటు తెలంగాణలోని జోగులాంబ గద్వాల, వనపర్తి, కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి, రాయచూరు జిల్లాల నుంచి ప్రజలు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ప్రతిరోజూ 2500 నుంచి 3000 మంది ఓపీ చికిత్స కోసం వస్తుండగా.. 250 నుంచి 300 మంది అడ్మిషన పొందుతున్నారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో బదిలీల వల్ల వైద్యుల కొరత ఏర్పడింది. 


కర్నూలు సర్వజన ఆసుపత్రి అంతా ఖాళీ అయింది. ప్రభుత్వం చేపట్టిన వైద్యుల బదిలీలతో కొన్ని వార్డులకు దిక్కే లేకుండా పోయింది. దీంతో అరకొరగా ఉన్న వైద్యులపై తీవ్ర ఒత్తిడి పెరగడంతోపాటు రోగులకు వైద్యసేవలందించడం కష్టంగా మారింది. మరోవైపు ప్రొఫెసర్ల కొరత కూడా వేధిస్తోంది. మొత్తం 128 మంది బదిలీ కాగా 96 మందినే తిరిగి నియమించడం ఇందుకు కారణమైంది. మూడు విభాగాలకు హెచవోడీలో లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


కర్నూలు (హాస్పిటల్‌), ఏప్రిల్‌ 16: ఏడు జిల్లాల ఆరోగ్య సంజీవిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలంతా ఖాళీ అయింది. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలు వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధానంగా సూపర్‌స్పె షాలిటీ బ్లాక్‌లో న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన, సర్జరీ విభాగాల నుంచి వైద్యులు ఇతర ప్రాంతాలకు బదిలీ కాగా, అంతే స్థాయిలో తిరిగి ఇక్కడ వైద్యులను నియమించలేదు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో 128 మంది వైద్యులు రికార్డు స్థాయిలో బదిలీ కాగా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి 96 మంది మాత్రమే వచ్చారు. వీరిలో 16 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. అసోసియేట్‌ ప్రొఫెసర్లు 25 మంది బదిలీ కాగా, 28 మందిని తిరిగి నియమించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 63 మంది బదిలీ కాగా 52 మంది ఇక్కడ చేరారు. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జనలు 13 మంది బదిలీ అయ్యారు. ముఖ్యంగా మెడిసిన విభాగాల్లో 14 మంది వైద్యులు బదిలీ కాగా, ఏడుగురు మాత్రమే వచ్చారు. ఎండోక్రైనాలజీ విభాగంలో ప్రొఫెసర్‌ అండ్‌ హెచవోడీ డా.పి.శ్రీనివాసులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డా.రాధాలక్ష్మి ఉండగా వీరిద్దరినీ బదిలీ చేవారు. వీరి స్థానంలో అక్కడ మెడిసిన ప్రొఫెసర్లను ఇనచార్జిగా నియమించారు. న్యూరాలజీ విభాగంలో ఉన్న ప్రొఫెసర్‌ అండ్‌ హెచవోడీ డా.సి.శ్రీనివాసులును బదిలీ చేయగా.. ఆ విభాగం దిక్కు లేకుండా పోయింది. ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్‌ అండ్‌ హెచవోడీ డా.మంజులబాయి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.రాజారవి బదిలీ కాగా, ఆ స్థానంలో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. దీంతో ప్లాస్టిక్‌ సర్జరీకి ఇనచార్జిగా సర్జరీ హెచవోడీ డా.హరిచరణ్‌ను నియమించారు. 

- న్యూరాలజీ వైద్యసేవల్లో కర్నూలు జీజీహెచకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నరాలు సంబంధిత సమస్యలు, పక్షవాతం, ఫిట్స్‌, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతూ వందలాది మంది రోగులు ఇక్కడికి వస్తుంటారు. వారంలో ప్రతి సోమ, గురువారాల్లో ఓపీ ఉంటుంది. ఇంత కీలకమైన ఈ విభాగంలో ఒక ప్రొఫెసర్‌, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు సేవలు అందించారు. తాజాగా నిర్వహించిన బదిలీల్లో ప్రొఫెసర్‌ అండ్‌ హెచవోడీ డా.సి.శ్రీనివాసులు అనంతపురం బదిలీ అయ్యారు. ఈ స్థానంలో ఎవరూ ఇక్కడికి రాకపోవడంతో ఈ విభాగం దిక్కులేకుండా పోయింది. న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడే రోగులకు సదరం సర్టిఫికెట్లను ఈ విభాగంలో అందిస్తున్నారు. వారానికి 500 దాకా ఓపీ రోగులు వస్తుండటంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది.

- ప్లాస్టిక్‌ సర్జరీ విభాగానికి రాయలసీమలో మంచి పేరుంది. ఈ విభాగంలో ఒక ప్రొఫెసర్లు ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు విధులు నిర్వహించేవారు. ఈ విభాగంలో ఉన్న ప్రొఫెసర్‌ డా.మంజులబాయి విజయవాడకు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.రాజారవి విశాఖపట్నంకు బదిలీ అయ్యారు. మిగిలిన ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో వార్డును నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరి స్థానంలో కూడా ఎవర్నీ నియమించలేదు. కాలిన గాయాలకు ప్లాస్టిక్‌ సర్జరీ చికిత్సను ఈ విభాగంలో అందిస్తూ వచ్చారు. ఇప్పుడు కీలకమైన వైద్యులు వెళ్లిపోవడంతో ఇక్కడ రోగులకు సేవలు ఎలా అందుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.

- ఎండో క్రైనాలజీ విభాగానికి వారంలో ప్రతి మంగళ, శుక్రవారం (ఓపీ నెంబరు.5) ఓపీ ఉంటుంది. వారానికి 500 మంది ఓపీకి వస్తుండగా.. బాధితులకు అత్యధిక ఉచితంగా మందులు, ఇన్సూలినను పంపిణీ చేస్తూ చికిత్స అందిస్తున్నారు. షుగర్‌, థైరాయిడ్‌ బాధితులకు అవసరమైతే చిన్న విభాగంలోని వార్డులో అడ్మిషన చేసి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ప్రొఫెసర్‌ డా.పి.శ్రీనివాసులు విశాఖకు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.రాధాలక్ష్మి అనంతపురానికి బదిలీ కాగా, ఆ స్థానంలో విశాఖ నుంచి ప్రొఫెసర్‌ను బదిలీ చేశారు. దీంతో ఆ విభాగంలో ఓపీ చూసే వారు లేకపోవడంతో జనరల్‌ మెడిసినకు చెందిన వైద్యులు షిఫ్ట్‌ల వారీగా ఓపీ నిర్వహిస్తున్నారు.





Updated Date - 2022-04-17T05:41:03+05:30 IST