ఆత్మ రక్షణలో బీజేపీ? రిసార్ట్‌ రాజకీయాలకు శ్రీకారం

ABN , First Publish Date - 2020-08-08T19:17:05+05:30 IST

రాష్ట్రంలో రాజకీయం రివర్స్ అయ్యింది. ఇన్ని రోజులూ సచిన్ పైలట్ కారణంగా అధికార కాంగ్రెస్

ఆత్మ రక్షణలో బీజేపీ? రిసార్ట్‌ రాజకీయాలకు శ్రీకారం

రాజస్థాన్ : రాష్ట్రంలో రాజకీయం రివర్స్ అయ్యింది. ఇన్ని రోజులూ సచిన్ పైలట్ కారణంగా అధికార కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలతో రిసార్ట్ రాజకీయాలను నెరపింది. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక, ప్రతిపక్ష బీజేపీ అలర్ట్ అయ్యింది. అలర్ట్ అవడమే కాకుండా రిసార్ట్ రాజకీయాలకు తెరలేపింది. ఉదయపూర్ పార్లమెంట్ పరిధిలోని 12 మంది ఎమ్మెల్యేలను బీజేపీ గుజరాత్‌కు తరలించినట్లు సమాచారం.


అయితే... వారే స్వచ్ఛందంగా సోమనాథ్ ఆలయ దర్శనార్థం వెళ్లినట్లు చెబుతున్నా.... పార్టీయే వీరిని గుజరాత్‌కు పంపినట్లు తెలుస్తోంది. 12 తేదీ వరకూ వీరు గుజరాత్‌లోనే ఉంటారు. మిగితా వారిని కూడా మధ్యప్రదేశ్‌కు తరలించనున్నట్లు సమాచారం. బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు విలీన అంశంపై హైకోర్టు తీర్పు కోసం బీజేపీ ఎదురు చూస్తున్నట్లు సమాచారం.


ఈ తీర్పు గనుక కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వస్తే... బీజేపీ మరింత కఠినంగా ఈ రిసార్టు రాజకీయాలను నెరిపే అవకాశమున్నట్లు రాజస్థాన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే... బీజేపీ ఎమ్మెల్యేలను సీఎం గెహ్లోత్ ఆకర్షిస్తారన్న భయం బీజేపీలో ఏదో మూలన ఉన్నట్లు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా ఢిల్లీకి పయనమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు.


గుజరాత్‌కు తరలించిన బీజేపీ ఎమ్మెల్యేల్లో అధికులు సింధియా వర్గం వారే. ఈ విషయంపైనే వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాజస్థాన్ లో పార్టీ కార్యశైలి ఏమాత్రం బాగోలేదని నడ్డాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాను పార్టీతోనే ఉంటానని, అయితే ఆత్మ గౌరవం విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని వసుంధర నడ్డాతో స్పష్టం చేసినట్లు ఆమె వర్గీయులు పేర్కొన్నారు. ఈ నెల 12 వరకు ఈమె ఢిల్లీలోనే ఉంటారని, 13 న తిరిగి రాజస్థాన్ బయల్దేరుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2020-08-08T19:17:05+05:30 IST