ఒకే గదిలో 11 శవాలు

ABN , First Publish Date - 2020-08-10T06:32:47+05:30 IST

పాకిస్థాన్‌ నుంచి వలస వచ్చిన 11 మంది హిందువులు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు...

ఒకే గదిలో 11 శవాలు

  • పాక్‌ నుంచి వలస వచ్చిన హిందూ కుటుంబం


జోధ్‌పూర్‌, ఆగస్టు 9: పాకిస్థాన్‌ నుంచి వలస వచ్చిన 11 మంది హిందువులు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఒకే గదిలో పడి ఉన్న మృతదేహాలను ఆదివారం ఉదయం గుర్తించారు. ఆ కుటుంబానికి చెందిన కేవల్‌రామ్‌ (35) అనే వ్యక్తి మాత్రం శనివారం రాత్రి భోజనం చేశాక పొలానికి కాపలాకు వెళ్లానని.. పొద్దున వచ్చేసరికి అంతా చనిపోయి ఉన్నారని చెప్పాడు. ఆ పదకొండు మందీ ఎలా చనిపోయిందీ తనకు తెలియదని చెబుతున్నాడు. అయితే, తన భార్య కుటుంబంపై అనుమానం ఉందని అతడు ఫిర్యాదు చేశాడు. ఇది సామూహిక హత్యాకాండ అని ఆరోపించాడు. కాగా.. కేవల్‌రామ్‌ కుటుంబీకులు ఉంటున్న గదిలో రసాయనాల సీసాలు, పురుగుమందు డబ్బాలు గుర్తించామని, ఇది సామూహిక ఆత్మహత్యా లేక మరేదైనా జరిగిందా అనేది ఇప్పుడే చెప్పలేమని జిల్లా ఎస్పీ రాహుల్‌ తెలిపారు. మృతదేహాలను శవపరీక్షకు పంపామని, వారి శరీరాలపై ఎలాంటి గాయాలూ లేవన్నారు. వారి గుడిసెలో ఒక నోట్‌ కూడా దొరికిందన్నారు. కుటుంబసభ్యుల మధ్య ఏదో వివాదం ఉన్నట్టుగా తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు. కేవల్‌రామ్‌ను విచారిస్తే వివరాలన్నీ బయటపడతాయని ఎస్పీ అభిప్రాయపడ్డారు. 


Updated Date - 2020-08-10T06:32:47+05:30 IST