Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అందని వేతనం.. ఎలా జీవనం?

twitter-iconwatsapp-iconfb-icon

- 108, 104 సిబ్బందికి జీతాలు అందక ఇబ్బందులు
- ప్రభుత్వానికి సమ్మె నోటీసు
- హామీలు నెరవేర్చాలని డిమాండ్‌
(ఇచ్ఛాపురం రూరల్‌/సోంపేట)

అనారోగ్య సమస్య తలెత్తినా.. ప్రమాదం జరిగినా.. సమాచారం ఇచ్చిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకునే 108 వాహన సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. 104 వాహన సిబ్బందిదీ ఇదే దుస్థితి. ఎన్నికల వేళ.. హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు సరికదా.. వేతనాలు కూడా సక్రమంగా అందజేయకపోవడంపై 108, 104 సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. 14 రోజుల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగాలని నిర్ణయించారు.
 జిల్లాలో 108 వాహనాలు 31 ఉండగా.. 145 ఈఎంపీ, పైలెట్లు ఉన్నారు. అలాగే 104 వాహనాలు 26 ఉండగా.. 62 మంది వరకు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి అరబిందో ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ (ఏఈఎంఎస్‌) సంస్థ జీతాలు చెల్లిస్తుంది. అయితే మార్చి, ఏప్రిల్‌ జీతాలు అందలేదు. ప్రస్తుత మే నెల కూడా పూర్తికావస్తున్నా వేతనాల ఊసే లేదు. దీంతో సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో ఉద్యోగి గ్రాడ్యుటీ రూ.లక్ష వరకు బకాయి ఉంది. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రతి ఏడాది ఇంక్రిమెంట్‌ ఇస్తామని, అందరికీ సమానంగా జీతాలు పెంచుతామని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ తమ ప్రభుత్వమే కడుతుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించారు. ఉద్యోగులకు పది శాతం ఇంక్రిమెంట్‌ అందజేస్తామన్న ప్రకటన అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో జీతాలు సకాలంలో అందజేయడంతో పాటు మరికొన్ని డిమాండ్లను  108, 104 వాహన సిబ్బంది ఏఈఎంఎస్‌, ప్రభుత్వం ముందుంచారు. వాటి పరిష్కారంలో సానుకూలంగా వ్యవహరించాలని సంఘం ప్రతినిధులు కోరుతున్నారు. లేదంటే సమ్మె బాట తప్పదని స్పష్టం చేశారు. ఈ విషయమై 108 వాహన జిల్లా మేనేజర్‌ నజీర్‌ హుస్సేన్‌ను వివరణ కోరగా ఇప్పటికే బిల్లులు సిద్ధం చేశామని, నాలుగు రోజుల్లో వేతనాలు విడుదల చేస్తామని తెలిపారు.

డిమాండ్లు ఇవీ :
- వైద్యరోగ్యశాఖలో ఈఎంటీ కేడర్‌ సృష్టించి 108 అంబులెన్స్‌లో పనిచేస్తున్న ఈఎంటీ, పైలెట్‌లను కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పరిగణించాలి. మినిమం టైం స్కేల్‌ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో కలపాలి.
- ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజి మార్కులు కల్పించాలి.
- గత నిర్వహణ సంస్థలు జీవీకే, యూకేఎస్‌ఏఎస్‌ల నుంచి రావాల్సిన బకాయిలను అందజేయాలి.
- 108 అంబులెన్స్‌ సర్వీసును అత్యవసర వైద్యసేవలకు మాత్రమే ఉపయోగించాలి. ఆసుపత్రి నుంచి ఆసుపత్రికి తరలించేందుకు ఉపయోగించడం వల్ల అత్యవసర సమయాల్లో వాహనాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి.
- ఐదు లేదా పదేళ్లు పూర్తిచేసుకున్న సిబ్బందికి శ్లాబ్‌లు అప్‌గ్రేడ్‌ చేసి వేతనాలు జమ చేయాలి
- 2021 జూలై నుంచి ఎరియర్స్‌ ఇవ్వాలి.
- ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం సొంత జిల్లాకు బదిలీ చేయాలి.

హామీలు అమలు చేయాలి
108లో పని చేస్తున్న సిబ్బందికి ప్రతినెలా సక్రమంగా జీతాలు చెల్లించాలి. 108 సిబ్బందిని కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకుని ఉద్యోగభద్రత కల్పిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలి. హామీలు నెరవేర్చాలని సమ్మె నోటీసు ఇచ్చాం.
- తిర్లంగి విజయమోహన్‌, 108 వాహన యూనియన్‌ జిల్లా అధ్యక్షులు  

సమస్యలు పరిష్కరించాలి
108 వాహనం ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ప్రతినెలా సక్రమంగా జీతాలు చెల్లించాలి.  రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. మా సమస్యలు సంస్థ ప్రతినిధులకు తెలియజేశాం.
- వసంత గోవింద్‌, 108 వాహనం పైలెట్‌  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.