101 శాతం

ABN , First Publish Date - 2021-12-23T05:34:27+05:30 IST

కరోనా థర్డ్‌వేవ్‌, ఒమైక్రాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో 18ఏళ్లు పైబడిన వారికి రెండు డోసుల టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.

101 శాతం

 మొదటిడోస్‌ వ్యాక్సినేషన్‌లో లక్ష్య ఛేదన 

రాష్ట్రస్థాయిలో జిల్లాకు ఆరో స్థానం

 మొదటి, రెండో డోసుల్లోనూ వెనుకబడిన నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు

భువనగిరిటౌన్‌, డిసెంబరు 22: కరోనా థర్డ్‌వేవ్‌, ఒమైక్రాన్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో 18ఏళ్లు పైబడిన వారికి రెండు డోసుల టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అన్నిజిల్లాలు మొదటిడోసు 100శాతం పూర్తిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ లక్ష్యం విధించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని యాదాద్రి జిల్లా ముం దంజలో ఉండగా, మిగతా రెండు జిల్లాలు వెనుకబడ్డాయి. ఈ నెల 21వ తేదీ నాటికి యాదాద్రి జిల్లా మొదటి, రెండు డోసు వ్యాక్సినేషన్‌లో రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలవగా, మొదటి డోసు 101శాతం లక్ష్యాన్ని సాధించడం విశేషం. వ్యాక్సినేషన్‌కు పలువురు వివిధ కారణాలతో నేటికీ దూరంగా ఉన్న నేపథ్యంలో యాదాద్రి జిల్లాలో మొదటిడోసు 101శాతం లక్ష్యాన్ని సాధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అందులో ఎలాంటి సందేహాలు లేవని స్పష్టంచేస్తున్నారు. జిల్లాలోని పలువురు హైదరాబాద్‌ తదితర పొరుగు జిల్లాల్లో మొదటి డోసు తీసుకోగా, ఇతర జిల్లాలవాసులు ఇక్కడ టీకా తీసుకున్నారని చెబుతున్నారు. అలాగే రికార్డుల్లో లేని పలువురు అర్హులు సైతం వ్యాక్సిన్‌ తీసుకోవడంతో 101శాతం లక్ష్యాన్ని సాధించామని అంటున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్‌ తదితర జిల్లాలు 110శాతానికిపైగా మొదటి డోసు వ్యాక్సినేషన్‌ను సాధించాయని ఉదహరిస్తున్నారు. ఏదేమైనా మొదటిడోసు 101శాతం నమోదు కావడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలోని 25 పీహెచ్‌సీలు, ఆస్పత్రుల్లో రోజువారీగా టీకాలు ఇవ్వడం, జిల్లా అంతటా ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం ద్వారా వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని సాధించామని అధికారులు పేర్కొంటున్నారు.


ఉమ్మడి జిల్లా వ్యాక్సినేషన్‌ ఇలా..

కరోనా వ్యాక్సినేషన్‌ మొదటి డోసులో యాదాద్రి జిల్లా 101శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచింది. రెండో డోసులో కూడా 71శాతంతో ఆరో స్థానంలో ఉంది. నల్లగొండ జిల్లా మొదటి డోసులో 93శాతంతో 11వ స్థానంలో, రెండో డోసులో 43శాతంతో 22వ స్థానంలో, సూర్యాపేట జిల్లా మొదటి డోసులో 88శాతంతో 14వ స్థానంలో, రెండో డోసులో 54 శాతంతో 14వ స్థానంలో నిలిచింది.


జిల్లా అర్హులు మొదటిడోసు శాతం రెండవ డోసు శాతం

నల్లగొండ 12,07,61 11,18,233 93 5,17,987 43

సూర్యపేట 7,97,475 7,02,648 88 4,32844 54

యాదాద్రి 5,23,068 5,24,248 101 3,71,372 71 


రెండో డోసులోనూ లక్ష్యాన్ని సాధిస్తాం : డాక్టర్‌ జి.సాంబశివరావు, డీఎంహెచ్‌వో యాదాద్రి జిల్లా.

మొదటి డోసులో 100శాతం లక్ష్యాన్ని పూర్తిచేసిన స్ఫూర్తితో త్వరలో రెండో డోసులోనూ శతశాతం లక్ష్యాన్ని చేరుకుంటాం. ఇందుకు అన్నిస్థాయిల వైద్య ఆరోగ్య సిబ్బంది శ్రమిస్తున్నారు. అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా చిత్తశుద్ధితో సహకరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం పనిచేసే చోటే అర్హులకు టీకాలు ఇస్తున్నాం

Updated Date - 2021-12-23T05:34:27+05:30 IST