'1 Person, 1 Post' : కాంగ్రెస్ నేత ట్వీట్‌తో కలకలం

ABN , First Publish Date - 2022-06-02T22:42:46+05:30 IST

కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరంపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది

'1 Person, 1 Post' : కాంగ్రెస్ నేత ట్వీట్‌తో కలకలం

 న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరంపై ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. మనీశ్ తివారీ, నగ్మా వంటివారు రాజ్యసభ పదవుల పంపకంపై బాహాటంగానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ నిబంధనను కట్టుదిట్టంగా అమలు చేయనున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ చెప్పడంతో ఆ పార్టీ డేటా అనలిటిక్స్ చైర్మన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 


రాజస్థాన్‌లో ఇటీవల జరిగిన మేధోమథనంలో తీసుకున్న నిర్ణయం ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ (1 Person, 1 Post) ని కచ్చితంగా అమలు చేస్తామని మహారాష్ట్ర (Maharashtra) కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే (Nana Patole) బుధవారం చెప్పారు. ఒకటి కన్నా ఎక్కువ పదవులుగల పార్టీ ఆఫీస్ బేరర్లు తమ అదనపు పదవులను వదులుకుంటారని తెలిపారు. దీనికి సంబంధించిన పత్రికా కథనంపై కాంగ్రెస్ డేటా అనలటిక్స్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి (Praveen Chakravarthy  గురువారం ఓ ట్వీట్ ద్వారా స్పందించారు. ఈ పత్రికలోని శీర్షికలో ‘వర్కర్’ అనే పదం ఉంది. దీనిని ప్రస్తావిస్తూ, ‘‘ఒకటి కన్నా ఎక్కువ పదవులను ఏ వర్కరూ కలిగియుండరు’’ నిబంధన కేవలం ‘వర్కర్స్’కు మాత్రమే వర్తిస్తుంది అని పేర్కొన్నారు. 


జూన్ 10న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఎంపిక చేసిన తీరుపై కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ‘ఒక కుటుంబానికి ఒకే టికెట్’పై కూడా విమర్శలు వస్తున్నాయి. గాంధీ కుటుంబాన్ని మినహాయిస్తూ ఈ రూల్స్‌ను మేధోమథనంలో ఆమోదించడంపై విమర్శలు వస్తున్నాయి.కాంగ్రెస్ ఆదివారం విడుదల చేసిన రాజసభ అభ్యర్థుల జాబితాలో చాలా మంది ప్రముఖుల పేర్లు లేవు. ఇతర రాష్ట్రాలవారిని తమపై రుద్దుతున్నారని స్థానిక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ వస్తుందని  చాలా మంది భావించారు. కానీ ఆయన పేరు ఈ జాబితాలో లేదు. దీంతో ఆయన ఇచ్చిన ట్వీట్‌లో, బహుశా తన తపస్సులో ఏదో లోపం ఉన్నట్లుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌పై నగ్మా (Nagma) స్పందిస్తూ, ఇమ్రాన్ భాయ్ ముందు మా పద్దెనిమిదేళ్ళ తపస్సు కూడా తక్కువ అయిపోయిందని అన్నారు. మహారాష్ట్ర (నగ్మా స్వరాష్ట్రం) నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఇమ్రాన్ ప్రతాప్‌గఢిని ఎంపిక చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 


కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ (Manish Tewari) కూడా రాజ్యసభ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక విధానాన్ని తప్పుబట్టారు. రాజ్యసభ దేనికోసం ఏర్పాటయిందో, ఆ కార్యకలాపాలను అది నిర్వహించడం మానేసిందనేది తన అభిప్రాయమని చెప్పారు. రాజ్యసభ ఇప్పుడు ఓ పార్కింగ్ లాట్‌గా మారిపోయిందన్నారు. ‘‘ఇక రాజ్యసభ ఈ దేశానికి అవసరమా? కాదా? అనే అంశాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2022-06-02T22:42:46+05:30 IST