24 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం!
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:50 AM
బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఈ నెల చివరి వారంలో వేర్వేరుగా అల్పపీడనాలు ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ, ఇతర వాతావరణ సంస్థలు అంచనా వేశాయి.
ఆ తర్వాత రెండ్రోజుల్లో అరేబియాలో మరొకటి..
నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు
విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఈ నెల చివరి వారంలో వేర్వేరుగా అల్పపీడనాలు ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ, ఇతర వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. ఈనెల 22నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించనుంది. దాని ప్రభావంతో 24కల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. 23 నాటికి ఆగ్నేయ అరేబియా సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఆవరించనుంది. దాని ప్రభావంతో 25 లేదా 26నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. అదే సమయంలో బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు ఉపరితలద్రోణి ఏర్పడనుందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడనున్న రెండు అల్పపీడనాల్లో ఒకటి బలపడి వాయుగుండం లేదా తుఫాన్గా మారుతుందని వాతావరణ నిపుణుడొకరు పేర్కొన్నారు. అయితే ఏది అనేది ఇప్పుడే చెప్పలేమని, వచ్చే వారం ప్రారంభం నాటిని ఒక అంచనాకు రావచ్చునని పేర్కొన్నారు.
డిసెంబరు నాటికి మరింత వేడి వాతావరణం
భూమధ్యరేఖకు ఆనుకుని పశ్చిమ, మధ్య పసిఫిక్ సముద్రంలో సముద్ర ఉపరితల ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఈ ఏడాది డిసెంబరు నాటికి మరింత వేడిగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణుడు తెలిపారు. దాంతో శక్తివంతమైన ఎల్నినోగా బలపడనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు
కోస్తా, రాయలసీమల్లో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించడంతో రెండు రోజుల నుంచి పలుప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాయలసీమ, కోస్తాల్లో శుక్రవారం అక్కడక్కడా వర్షాలు కురిశాయి. తిరుపతి జిల్లా రేణిగుంటలో 86.25 మి.మీ., ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 81.69, శ్రీసత్యసాయి జిల్లాలో కొక్కంటి, అన్నమయ్య జిల్లా అమ్మచెరువులో 66.05 మి.మీ. వర్షపాతం నమోదైంది. రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు