తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
ABN , Publish Date - May 16 , 2026 | 10:58 AM
ఎండలతో అల్లాడుతున్న జనానికి భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి నైరుతి రుతు పవనాలు ముందుగానే రాబోతున్నాయని ఐఎండీ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి నైరుతి రుతు పవనాలు ముందుగానే రాబోతున్నాయని ఐఎండీ తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే పలు చోట్ల వడగాల్పులకు తోడు అకాల వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు శనివారం నాటికి అండమాన్ నికోబార్ దీవులను, అండమాన్ సముద్రాన్ని తాకినట్లు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. ఇవి చురుగ్గా కదులుతూ ఈ నెల 23 నుంచి 30వ తేదీల మధ్య.. ముఖ్యంగా మే 26వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నెల 19వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒక వైపు చల్లని వాతావరణం ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పోలవరం, ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు చేరవచ్చని ఐఎండీ తెలిపింది.
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన..
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోని సంగారెడ్డి, నల్గొండ, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉదయం నుంచే వర్షాలు పడేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ వర్షాలతో పాటు ఆయా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఉపశమనం కలిగించేలా వర్షాలు పడుతున్నప్పటికీ.. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని, ఎండల పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.