Share News

2 రోజుల పాటు రాష్ట్రంలో వడగాడ్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

ABN , Publish Date - Mar 26 , 2026 | 06:49 PM

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ప్రజలు ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించింది.

2 రోజుల పాటు రాష్ట్రంలో వడగాడ్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Andhra Pradesh heatwave alert

అమరావతి, మార్చి 26: దేశ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. పలు రాష్ట్రాలలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోనూ రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో వడగాడ్పులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. శుక్రవారం(27-03-26) పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు..


కూనవరం, వరరామచంద్రాపురం, కాకినాడ జిల్లా జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ, ఎన్టీఆర్ జిల్లా జీ.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాల్పులు (09) ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. శుక్రవారం విజయనగరం జిల్లాలో 4 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 3 మండలాలు, పోలవరం జిల్లాలోని 3 మండలాలు, కాకినాడ జిల్లాలో ఒక మండలం, తూర్పుగోదావరిలో 2 మండలాలు, ఏలూరులో 4 మండలాలు, కృష్ణాలో 2 మండలాలు, ఎన్టీఆర్‌లో 7 మండలాలు, గుంటూరులో ఒక మండలం, పల్నాడు జిల్లాలోని 5 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని వెల్లడించారు.


శనివారం 90 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందన్నారు. నేడు కడప జిల్లాలోని కమలాపురంలో 40.7 డిగ్రీలు.. అనంతపురం జిల్లాలోని తెరన్నపల్లిలో 40.6 డిగ్రీలు, కృష్ణా జిల్లాలోని పెద్దపారుపూడిలో 40.5 డిగ్రీలు, నంద్యాల జిల్లాలోని కొత్తపల్లెలో 40.4 డిగ్రీలు, కర్నూలు జిల్లాలోని బస్తిపాడులో 40.3 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ప్రజలు ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి

ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. దాడిలో నేవీ చీఫ్ మృతి..

IPL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 26 , 2026 | 07:04 PM