Share News

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎర్రగా మారిపోయిన భూగ్రహం

ABN , Publish Date - Oct 08 , 2026 | 03:17 PM

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఎల్‌ నినో ప్రభావం తీవ్రస్థాయికి చేరుకుంటోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్‌ నినో ఘటనల్లో ఒకటిగా ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ (WMO) దీనిని అంచనా వేసింది.

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎర్రగా మారిపోయిన భూగ్రహం
El Nino 2026

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఎల్‌ నినో ప్రభావం ఈ ఏడాది తీవ్రస్థాయికి చేరుకుంటోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్‌ నినో ఘటనల్లో ఒకటిగా ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ (WMO) దీనిని అంచనా వేసింది. దీని కారణంగా పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. వర్షపాతంలోనూ పెద్దఎత్తున మార్పులు సంభవించి కొన్ని ప్రాంతాల్లో కరవు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


‘గరిష్ఠ స్థాయిలో ఎల్‌ నినో’

అమెరికా వాతావరణ శాస్త్రవేత్త ర్యాన్ మౌయే ప్రపంచ ఉష్ణోగ్రతల పరిస్థితిని చూపించే మ్యాప్‌ను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పటంలో భూమిపై చాలా ప్రాంతాలు ఎరుపు రంగులో కనిపిస్తున్నాయని పేర్కొన్న ఆయన.. ఎల్‌ నినో శీతాకాలం వరకు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. అయితే అమెరికాలో మాత్రం ఇతర ప్రాంతాలతో పోలిస్తే భిన్నమైన ఉష్ణోగ్రత పరిస్థితులు ఉండొచ్చని తెలిపారు. ఎల్‌ నినో ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగవచ్చన్న డబ్ల్యూఎంఓ అంచనాను కూడా మౌయే సమర్థించారు.


రికార్డు స్థాయికి చేరుతుందా?

వాతావరణ శాస్త్రవేత్త జేక్ హౌస్‌ఫాదర్ ప్రకారం ఈ ఏడాది ఎల్‌ నినో పసిఫిక్‌లోని నినో 3.4 ప్రాంతంలో అసాధారణ స్థాయికి చేరుకుంటోంది. ఈ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే 3.4°C అధికంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరో వాతావరణ నిపుణుడు లియోన్ సిమన్స్ దీనిని ‘సూపర్-డూపర్ ఎల్‌ నినో’గా అభివర్ణించారు.

అక్టోబర్-డిసెంబర్‌లో మరింత వేడి..

2026 చివరి నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశముందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ముఖ్యంగా ఎల్‌ నినోకు కేంద్రంగా ఉన్న మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో అక్టోబర్- డిసెంబర్ మధ్య సాధారణం కంటే 3.7°C వరకు అధికంగా ఉష్ణోగ్రతలు ఉండొచ్చని అంచనా వేసింది.

లక్షలాది మరణాలకు కారణమవుతుందా?

మరోవైపు, చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ పరిశోధకుల అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది తీవ్రమైన ఎల్‌ నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా 4.51 లక్షల వరకు అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ మరణాలు 2026 జూన్ నుంచి 2027 ఫిబ్రవరి మధ్య జరగవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఇది ఒక పరిశోధనాత్మక అంచనా మాత్రమేనని, దానిని కచ్చితమైన మరణాల సంఖ్యగా పరిగణించకూడదని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ ఏడాది ఎల్‌ నినో ప్రపంచ వాతావరణంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఎలాన్ మస్క్, సత్య నాదెళ్లకు అమెరికా అత్యున్నత సైన్స్, టెక్నాలజీ పురస్కారాలు

సెన్సెక్స్ 1,100 పాయింట్లు పతనం.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి..

Updated Date - Oct 08 , 2026 | 03:46 PM