కోస్తాకు వాయు‘గండం’..!
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:37 AM
ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించక ముందే కోస్తాను వాయుగుండం/తుఫాను తాకనున్నది. వీటి ప్రభావంతో ఈ నెల 15 తరువాత కోస్తాలో వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
తుఫానుగా మారే అవకాశం..
15 నుంచి వర్షాలు... 21న ఈశాన్య రుతుపవనాలు రాక
విశాఖపట్నం, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించక ముందే కోస్తాను వాయుగుండం/తుఫాను తాకనున్నది. వీటి ప్రభావంతో ఈ నెల 15 తరువాత కోస్తాలో వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే పదిహేను రోజులకు సంబంధించి భారత వాతావరణ శాఖ గురువారం దీర్ఘకాల బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం 13వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. అది తరువాత నాలుగు రోజుల్లో వాయువ్య దిశగా పయనించే క్రమంలో బలపడి దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరం దిశగా వస్తుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
దీని ప్రభావంతో తూర్పు గాలులు బలంగా మారి కోస్తాంధ్ర, ఒడిశాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఈనెల 15 తరువాత వర్షాలు ప్రారంభమై కొన్నిచోట్ల భారీగా కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో దక్షిణ భారతంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గురువారం రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని ఎండ తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు