Share News

భారీ వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే..

ABN , Publish Date - Jun 08 , 2026 | 07:08 PM

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు పేర్కొన్నారు.

భారీ వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే..
AP Weather Report

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడనున్నట్లు వెల్లడించారు.


అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే అల్లూరి సీతారామరాజు, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురవనున్నట్లు చెప్పారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయన్నారు. వర్షాలు, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడొద్దని హెచ్చరించారు. హోర్డింగ్స్ వంటి వాటి వద్ద ఆశ్రయం తీసుకోవద్దని సూచించారు. రైతులు, పశు కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములు వినిపించగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలన్నారు.


ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో మంగళవారం 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగనుందని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. బాపట్ల, పల్నాడు జిల్లాల్లోనూ ఎండ తీవ్రత కొనసాగనుందని అధికారులు చెప్పారు. కాగా, నేడు గూడూరులో 41.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. చిట్యాలలో 41.4, ఎస్.రాయవరంలో 41.2, పెదపారుపూడిలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయినట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

వివేకా కేసులో మరో కీలక మలుపు.. తదుపరి దర్యాప్తు కోరుతూ సునీతారెడ్డి పిటిషన్

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

Updated Date - Jun 08 , 2026 | 07:08 PM