వెదర్ అప్‌డేట్ .. రాగల 3 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
ABN , Publish Date - Mar 30 , 2026 | 07:03 AM
రాబోయే మూడు గంటల్లో ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
అమరావతి, మార్చి 30: దేశ వ్యాప్తంగా ఎండలు రోజురోజుకూ పెరుగుతూపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం పూట వడగాడ్పులు జనాల్ని భయపెడుతున్నాయి. బయట తిరగాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లోనూ భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. 10 తర్వాత పరిస్థితి దారుణంగా ఉంటోంది. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 మధ్య నమోదవుతున్నాయి.
ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు..
రాష్ట్ర ప్రజలకు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. రాగల మూడు గంటల్లో ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంది. పిడుగులు, వర్షం, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలి: విద్యాసాగర్
కరువు మండలాల విద్యార్థులకు డ్రై రేషన్