Share News

అక్టోబరులోనూ వేసవి తీవ్రత

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:43 AM

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వేసవిలో మాదిరిగా ఎండలు మండిపోతున్నాయి. జనం విలవిల్లాడుతున్నారు. ఖరీఫ్‌లో ఆలస్యంగా వేసిన వరి నాట్లు కొన్నిచోట్ల ఎండిపోతున్నాయి.

అక్టోబరులోనూ వేసవి తీవ్రత

  • వేడి వాతావరణంతో ప్రజలు విలవిల

  • 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వేసవిలో మాదిరిగా ఎండలు మండిపోతున్నాయి. జనం విలవిల్లాడుతున్నారు. ఖరీఫ్‌లో ఆలస్యంగా వేసిన వరి నాట్లు కొన్నిచోట్ల ఎండిపోతున్నాయి. మెట్ట పైర్ల పరిస్థితీ అలాగే ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసిఫిక్‌ మహా సముద్రంలో ఉపరితల జలాలతోపాటు ఉపరితలం నుంచి ఐదారు మీటర్ల లోతు వరకు జలాలు వేడెక్కుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ముంబైకు వడగాడ్పుల హెచ్చరిక జారీ చేశారని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేకపోయినా మే నెల మాదిరిగా ఎండ ప్రభావం ఉందన్నారు. శుక్రవారం కడప జిల్లా కలాసపాడులో 39.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత ప్రభావానికి వాతావరణ అనిశ్చితి నెలకొని అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిశాయి. రానున్న రెండు మూడు రోజుల్లో ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం?

ఈ నెల 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నదని వాతావరణ శాఖ పేర్కొంది. ఆతర్వాత 3-4 రోజుల్లో అల్పపీడనం బలపడి, ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదిలే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ఈ నెల 14న వాయుగుండంగా మారే అవకాశం ఉందని కొన్ని వాతావరణ మోడల్స్‌ అంచనా వేయగా, మరికొన్ని అల్పపీడనంగానే కొనసాగుతుందని సూచించినట్లు తెలిపింది. దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 05:43 AM