జహీరాబాద్-బీదర్ రహదారిపై రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు
ABN , Publish Date - Feb 02 , 2026 | 09:08 PM
సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం మామిడికి గ్రామం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేగంగా వచ్చిన ట్రక్కు ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను బలంగా ఢీకొట్టింది.
సంగారెడ్డి, ఫిబ్రవరి 2: తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో ఇవాళ (సోమవారం) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జహీరాబాద్-బీదర్ ప్రధాన రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే న్యాల్‌కల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆటోను ఢీకొట్టిన ట్రక్కు
మామిడిగి సమీపంలోని జహీరాబాద్-బీదర్ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ప్రయాణికులతో నిండిన ఆటోను ఎదురుగా వస్తున్న ఒక భారీ ట్రక్కు ఢీకొట్టింది. ఢీకొట్టిన ధాటికి ఆటో నుజ్జునుజ్జయ్యింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వీరిలో కమల (40) వడ్డీ గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ కాగా, అంబ్యానాయక్ (55) భోజ్యానాయక్ తండాకు చెందిన వ్యక్తి. ప్రమాద వార్త విని హుటాహుటీన ఘటనా స్థలానికి వచ్చిన మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విధి నిర్వహణకు వెళ్తున్న అంగన్వాడీ టీచర్ కమల మృతి చెందడం ఆ గ్రామంలో విషాద ఛాయలు నింపింది.
ప్రమాద సమయంలో ఆటోలో ఉన్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి జహీరాబాద్, బీదర్ ఆసుపత్రులకు తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ట్రక్కు అదుపు తప్పి ఆటోపైకి దూసుకెళ్లినట్లు చెబుతున్నారు.