16 జిల్లాలకు ఎల్లో అలర్ట్..
ABN , Publish Date - Jul 29 , 2026 | 07:55 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటినప్పటికీ, దాని ప్రభావం ఇంకా బలంగానే కొనసాగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల దంచికొట్టిన వాన
ఏటూరునాగారంలో 9.6 సెం.మీ. వర్షపాతం
భాగ్యనగరంలో రహదారులు జలమయం
వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు
వర్షాలపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ సమీక్ష
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరాన్ని దాటినప్పటికీ, దాని ప్రభావం ఇంకా బలంగానే కొనసాగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, గంటకు 30-40కి.మీ వేగం తో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
విస్తారంగా వర్షాలు
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరు మండలాల్లో భారీ వర్షం పడగా, 159 మండలాల్లో 1.5 నుంచి 6 సెంటీమీటర్ల మధ్య వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో అత్యధికంగా 9.64 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెంకటాపురం మండలంలో 7.02, మంగపేట మండంలో 6, వాజేడు మండలంలో 5.28, కన్నాయిగూడెం మండలంలో 4.22, తాడ్వాయి మండలంలో 3.36 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే మెదక్ జిల్లా చేగుంటలో 8.1, పాపన్నపేటలో 6.8, శంకరంపేటలో 6.7, మెదక్‌లో 7.6, భూపాలపల్లి జిల్లా పలిమెలలో 6.9, భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 2.45, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 6.1, దుమ్ముగూడెంలో 2.53, పాల్వంచలో 2.23, చర్లలో 2.15, ఆళ్లపల్లిలో 2.10, గుండాలలో 2, భద్రాచలం, మణుగూరులో 1.6, సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండంలో 5.5, యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం హన్మాపురంలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల ఈదురు గాలులకు చెట్లుకూలి రహదారులపై పడడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి..
భారీ వర్ష సూచనతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సచివాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు.
హైవేలపై 13 చోట్ల దిద్దుబాటు చర్యలు
వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ప్రమాదకరంగా ఉన్న 13 ప్రాంతాల్లో మరమ్మతులు, పునరుద్ధరణ పనులను ‘జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)’ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం చేపట్టింది. ఇప్పటికే 8ప్రాంతాల్లో పనులు చివరిదశకు రాగా... మిగతా 5 ప్రాంతాల్లో శరవేగంగా సాగుతున్నా యి. ప్రధానంగా మహబూబ్‌నగర్, మంచిర్యాల, కామారెడ్డి, ఖమ్మం జిల్లాతో పాటు సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రాంతాల్లో ప్రమాదకర, సమస్యాత్మక బ్లాక్ స్పాట్లను గుర్తించిన ఎన్‌హెచ్‌ఏఐ దిద్దుబా టు చర్యలు చేపట్టింది. రహదారుల కింద వరద నీటి డ్రెయిన్లను రీయిన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్‌తో నిర్మించడం, దెబ్బతిన్న బ్రిడ్జిలను పునరుద్ధరించడం, గుంతలకు మరమ్మతు వంటి పనులను చేపడుతోంది. భారీ వర్షాల సమయంలో సాయం కోసం ప్రయాణికులు టోల్ ఫ్రీ నెంబర్ 1033కు సమాచారం ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఏఐ సూచించింది.
హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన..
భారీవర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. మంగళవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు కురిసిన వర్షంతో ప్రధాన రహదారులపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ముషీరాబాద్‌లో అత్యధికంగా 5, బౌద్ధనగర్‌లో 4.9 సెం.మీ వర్షం కురిసింది. యూసు్‌ఫగూడ కృష్ణానగర్ ప్రధాన రహదారిని వరదనీరు ముంచెత్తింది. ముషీరాబాద్ బౌద్ధనగర్, గోల్కొండ, బన్సిలాల్‌పేట, షేక్‌పేట్, ఉప్పల్ ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్లలోతు నీరు నిలిచిపోయింది. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో భారీవర్షం కురవడంతో.. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, చాదర్‌ఘట్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఐకియా, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతా ల్లో కిలోమీటర్ల కొద్ది వాహనాలు భారులు తీరాయి. వరదనీరు తొలగించేందుకు హైడ్రా, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.