Share News

అసెంబ్లీని స్తంభింపజేస్తాం

ABN , Publish Date - Aug 28 , 2026 | 04:16 AM

రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యుత్‌ ఉద్యోగులు, రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్లపైకి వచ్చే పరిస్థితి కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శించారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులపై ఇటీవల జరిగిన లాఠీచార్జిపై ఇంకా విచారణ జరపలేదని, దీనికి డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు

అసెంబ్లీని స్తంభింపజేస్తాం
Harish Rao

  • పాలిటెక్నిక్‌ విద్యార్థుల తరఫున పోరాడతాం

  • స్కిల్స్‌ యూనివర్సిటీ పేరుతో వారి జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం

  • లాఠీచార్జిపై ఇంతవరకు విచారణ జరపలేదు

  • విద్యార్థుల కోసం రాహుల్‌ గాంధీ తెలంగాణలో ఎందుకు పోరాడరు?ఢిల్లీకో నీతి.. ఇక్కడో నీతా?

  • ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం

  • బీఆర్‌ఎస్‌ నేత తన్నీరు హరీశ్‌రావు విమర్శ

  • పాలిటెక్నిక్‌ విద్యార్థులకు మద్దతిచ్చేందుకు వరంగల్‌ వెళ్లిన హరీశ్‌ రావు అరెస్టు.. ఉద్రిక్తత

వరంగల్‌/హనుమకొండ టౌన్‌/నార్సింగ్‌, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యుత్‌ ఉద్యోగులు, రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్లపైకి వచ్చే పరిస్థితి కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు విమర్శించారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులపై ఇటీవల జరిగిన లాఠీచార్జిపై ఇంకా విచారణ జరపలేదని, దీనికి డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్కిల్స్‌ యూనివర్సిటీ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, పాలిటెక్నిక్‌ విద్యార్థుల తరఫున అసెంబ్లీని స్థంభింపజేస్తామని చెప్పారు. పాలిటెక్నిక్‌ విద్యను స్కిల్స్‌ వర్సిటీలో కలిపేందుకు తెచ్చిన జీవో నంబర్‌ 97ను అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు రద్దు చేయాలన్నారు. గురువారం వరంగల్‌ పాలిటెక్నిక్‌ విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన హరీశ్‌రావును హనుమకొండలో పోలీసులు ఆరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులను వాహనంలో సుబేదారి స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారు. బీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎ్‌సవీ నేతలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం, ఉద్రిక్తత నెలకొంది. దీంతో హరీశ్‌రావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాలినడకన స్టేషన్‌కు చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆయన్ను, నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ గంటపాటు పోలీసు స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. విడుదలై మీడియాతో మాట్లాడిన తర్వాత హరీశ్‌రావును పోలీసు వాహనంలో పంపించారు. దీనికి ముందు సైబరాబాద్‌ పోలీసులు ఆయనను హైదరాబాద్‌లోని కోకాపేటలో గృహ నిర్బంధం చేశారు.


కొన్ని గంటల పాటు ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. అయితే బీఆర్‌ఎస్‌ కార్యాలయానికి వెళతానని చెప్పి బయటకొచ్చిన ఆయన వరంగల్‌ వచ్చారు. హనుమకొండ కలెక్టరేట్‌ వద్ద టీఎన్‌జీవోలను కలిసి మద్దతు ప్రకటించారు. ఆపై పాలిటెక్నిక్‌ కాలేజీకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ పాలిటెక్నిక్‌ విద్యను స్కిల్స్‌ యూనివర్సిటీలో కలపొద్దని, తమ భవిష్యత్తు నాశనం చేయొద్దని విద్యార్థులు పోరాటం చేస్తుంటే, విద్యా శాఖను అంటిపెట్టుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఏవో సమస్యలపై ఢిల్లీ, బిహార్‌లో పోరాటాలు చేస్తున్నారని, మరి తెలంగాణకు ఎందుకు రావట్లేదన్నారు. సమస్యకు పరిష్కారం లభించకపోతే పాలిటెక్నిక్‌ విద్యార్థులతో ఢిల్లీకి తరలివెళ్లి ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దేశంలో ఆరు డీఏలను పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్‌ రెడ్డిదేనని విమర్శించారు. అస్పత్రులతో ఎలాంటి ఒప్పందం లేకుండానే నాలుగు నెలలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగుల జీతాల నుంచి ఈహెచ్‌ఎ్‌సకు డబ్బులు కట్‌ చేస్తోందన్నారు. సచివాలయంలోకి ఫోన్‌ను కూడా తీసుకెళ్లనివ్వకుండా ఉద్యోగులను అవమానిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్‌, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ కవిత తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలను కూడా చదవండి

ప్రత్యేక టెట్‌లో మార్పులు చేయాలి

బెయిల్‌పై వచ్చి.. బెంబేలెత్తించి

Updated Date - Aug 28 , 2026 | 06:27 AM