Share News

22ఏ వివాదాన్ని నెలలో పరిష్కరిస్తాం

ABN , Publish Date - Sep 17 , 2026 | 03:43 AM

22ఏ వివాదాన్ని నెల రోజుల్లో పరిష్కరిస్తామని, పేదవారికి ఒక గుంట భూమిగానీ, పైసా నష్టంగానీ జరగకుండా చూస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 22ఏ వివాదం పరిష్కారం కోసం సీసీఎల్‌ఏ కమిషనర్‌, స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ, న్యాయశాఖ కార్యదర్శితో ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నామని తెలిపారు

22ఏ వివాదాన్ని నెలలో పరిష్కరిస్తాం
CM Revanth Reddy

  • ఉన్నత స్థాయి కమిటీ.. ప్రజలకు నష్టం లేకుండా చర్యలు

  • యూఎల్‌సీ భూములపై కొత్త మార్గదర్శకాలు

  • హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ లేఅవుట్ల

దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ

  • ధరణితో 7 లక్షలకుపైగా ఎకరాలు నిషేధిత జాబితాలో

  • వీటిని 3 లక్షల ఎకరాలకు తగ్గించాం: సీఎం రేవంత్‌

  • ఉన్నత స్థాయి కమిటీకి బాధ్యతల అప్పగింత.. ప్రజలకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటాం

  • 22 ఏ మేం తెచ్చింది కాదు..

1999లో తీసుకొచ్చారు

  • లే అవుట్ల దరఖాస్తుల

పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ

  • నిజాం, ఇనాం రికార్డుల్లో అస్పష్టతే కారణం

  • ధరణితో బీఆర్‌ఎస్‌ భూ దోపిడీ

  • లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడ్డారు..

  • శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): 22ఏ వివాదాన్ని నెల రోజుల్లో పరిష్కరిస్తామని, పేదవారికి ఒక గుంట భూమిగానీ, పైసా నష్టంగానీ జరగకుండా చూస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 22ఏ వివాదం పరిష్కారం కోసం సీసీఎల్‌ఏ కమిషనర్‌, స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ, న్యాయశాఖ కార్యదర్శితో ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నామని తెలిపారు. నిషేధిత భూముల (22ఏ) వివాదం, ప్రతిపక్షం తీరుపై సీఎం రేవంత్‌ అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. 22ఏ చట్టాన్ని తాము తీసుకురాలేదని, ఉమ్మడి ఏపీలో 1999లోనే దీనిని తీసుకొచ్చారని గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2025లో కలెక్టర్ల నుంచి 22ఏ జాబితాలు తెప్పించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ధరణిలో 7 లక్షలకుపైగా ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండగా ప్రస్తుతానికి దానిని 3 లక్షల ఎకరాలకు తగ్గించామని తెలిపారు. ఇకపై ఆర్డీవో, సబ్‌ కలెక్టర్‌ సర్వే నంబర్ల వారీగా విచారణ జరుపుతారని, వార్డు, బ్లాక్‌ నంబరు, డోర్‌ నంబర్ల వారీ వివరాలు, దేవాదాయ, వక్ఫ్‌ భూములు, అటవీ క్యాటగిరిలో ఉంటే ఆ వివరాలపై స్పష్టత ఇస్తూ.. భూమి స్థితిని తెలియజేస్తామని సీఎం వెల్లడించారు. ఒక సర్వే నంబరులో కొంత భాగం మాత్రమే 22ఏలో ఉంటే.. దానివరకే పరిమితం చేసి 22ఏలో పెడతామన్నారు.


బాధితులకు నోటీసు జారీ చేసి.. వారి వివరణ పరిశీలించి.. అభ్యంతరాలు చట్టబద్ధంగా ఉన్నాయా లేవా అనేది చూశాక తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. 22ఏ జాబితాలో ఉన్న భూమిని తొలగించాలన్నా ఒక నిర్దిష్ట ప్రక్రియ పాటించేలా మార్పులు చేస్తామని తెలిపారు. బ్యాంకు రుణం చెల్లించాక కూడా 22ఏలో ఉన్న భూములు, అప్పు కట్టలేని కారణంగా 22ఏలో పెట్టిన భూములు, మార్కెట్‌ విలువ చెల్లించి కొనుగోలు చేసిన భూములు, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, పంచాయతీరాజ్‌ అనుమతులు ఉన్న లేఅవుట్లలో కొనుగోలు చేసిన భూములు, ప్రభుత్వ సంస్థల వేలంలో కొనుగోలు చేసిన భూములు 22ఏలో ఉంటే.. సరైన ఆధారాల పరిశీలన అనంతరం వాటిని క్లియర్‌ చేస్తామన్నారు. వీటి మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 60 రోజుల వ్యవధిలో ఆర్డీవో వద్ద, 90 రోజుల వ్యవధిలో జేసీ వద్ద రివిజన్‌ పిటిషన్‌ వేసుకునే అవకాశం కల్పిస్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌పై విధివిధానాలు

22ఏ నిషేధిత ఆస్తుల జాబితాలో వివిధ విభాగాల కింద ఉన్న భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకునే చర్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరించారు. పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం(యూఎల్‌సీ) కింద పాక్షికంగా క్రమబద్ధీకరించిన, అసలు క్రమబద్ధీకరించని కాలనీల గురించి ప్రస్తావిస్తూ.. క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులు, కొత్త దరఖాస్తుల క్రమబద్ధీకరణకు నూతన విధానం అమల్లోకి తెస్తామని ప్రకటించారు. భూముల రిజిస్ట్రేషన్‌, క్రమబద్ధీకరణ ప్రక్రియలను సమాంతరంగా ఏకకాలంలో చేపడతామన్నారు. ఇక హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ లేఅవుట్లలో పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్‌ దరఖాస్తులను పరిశీలించి వారం రోజుల్లో పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇలాంటి ఆస్తుల క్రమబద్ధీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తామని వెల్లడించారు.


సింగరేణి కోల్‌ బెల్ట్‌లో ఉన్న సమస్యను ప్రస్తావిస్తూ.. జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి పెండింగ్‌ దరఖాస్తులన్నింటికీ పరిష్కారం చూపుతామన్నారు. జీవో 59 సమస్యను పరిష్కరిస్తామన్నారు. హక్కు బదిలీ పత్రాలు జారీ చేసిన 1,22,280 మంది దరఖాస్తులను నిర్దేశిత అర్హతల ప్రాతిపదికన తుది పరిశీలన అనంతరం క్లియర్‌ చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో మిగిలి ఉన్న 18,590 పెండింగ్‌ దరఖాస్తులను నూతన క్రమబద్ధీకరణ విధానం కింద పరిష్కరిస్తామన్నారు. జీవో 118 కింద పెండింగ్‌లో ఉన్న 9,800 మంది బాధితుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ విధంగా పరిష్కరించిన కేసులన్నింటినీ తక్షణమే 22ఏ జాబితా నుంచి తొలగిస్తామన్నారు. అసైన్డ్‌ భూముల్లో నిర్మించుకున్న ఇళ్ల అంశంపై మాట్లాడుతూ.. ఈ భూములన్నీ తెలంగాణ అసైన్డ్‌ భూముల (బదిలీ నిషేధ) చట్టం, 1977 పరిధిలోకి వస్తున్నందున, సమగ్ర న్యాయ సమీక్ష చేసి, విస్తృత సంప్రదింపులు జరుపుతామన్నారు. నాలా రుసుం చెల్లించిన కారణంతో ప్రైవేటు భూములు 22ఏలో ఉంటే.. స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ రుసుముతో కలిపి నాలా చార్జీలను చెల్లిస్తే క్రయ విక్రయాలకు అనుమతిస్తామన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అనధికారిక లేఅవుట్ల సమస్యను నూతన క్రమబద్ధీకరణ పథకం పరిధిలోకి తీసుకొస్తామని సీఎం చెప్పారు. సికింద్రాబాద్‌ పరిధిలోని లీజ్‌హోల్డ్‌ ఆస్తుల ఫ్రీహోల్డ్‌, క్రమబద్ధీకరణ పరిష్కారానికి 30 రోజుల వ్యవధిలో కమిటీ వేస్తామన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల అసైన్డ్‌ భూముల, భూదాన్‌ భూముల సమస్యలపై స్పందిస్తూ.. పేద, బలహీనవర్గాల గృహ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ భూములను సమగ్ర ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలోకి తెస్తామన్నారు.


అలాగైతే పొంగులేటిని మంత్రిగా కొనసాగిస్తానా?

అధికారులు చేసిన తప్పిదాలు, క్లరికల్‌ మిస్టేక్‌ల వల్లనే కొన్ని ఆస్తులు 22ఏ జాబితాలో చేరాయని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. జూబ్లీహిల్స్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం ఇంటిని కూడా 22ఏలో పెట్టారని ప్రతిపక్ష నేతలు రాద్ధాంతం చేస్తున్నారని.. వారే మళ్లీ తొలగించారని కూడా చెబుతున్నారని.. ఇదంతా కావాలని జరిగింది కాదన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఉద్దేశపూర్వకంగా తన ఆస్తి జోలికి వస్తే మంత్రి వర్గంలో ఆయన కొనసాగుతారా, ఆయనను ఉండనిస్తానా? అధికారులను వదిలిపెడతానా? అని రేవంత్‌రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. ఒక సర్వే నంబరులో కొంత భాగం మాత్రమే 22ఏలో ఉంటే దాని వరకే నిషేధిత జాబితాలో పెట్టాల్సిన అధికారులు ఆ సర్వే నంబరులో ఉన్న మొత్తం భూమిని 22ఏలో పెట్టడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు.

చారిత్రక కారణాలతోనే అస్పష్టత

22ఏ భూముల అంశంపై వివరించే క్రమంలో చారిత్రక నేపథ్యాలను కూడా సీఎం ప్రస్తావించారు. ఆంధ్రాలో బ్రిటిష్‌ పాలనలో రెవెన్యూ విధానం పక్కాగా ఉండగా.. తెలంగాణలో నిజాం పాలనకు సంబంధించిన విభిన్న రెవెన్యూ విధానం కొనసాగిందని గుర్తు చేశారు. బ్రిటిష్‌ పాలకులు శిస్తు వసూళ్ల కోసం రికార్డులను పక్కాగా నిర్వహించారన్నారు. తెలంగాణలో నిజాం కాలంలో సుమారు 60శాతం భూములు ‘దివానీ’ (రాజ్యానికి చెందినవి, రైతులు శిస్తు కట్టేవి) భూములుగా ఉండగా, మిగిలిన 40శాతం భూములు ‘నాన్‌-దివానీ భూములుగా (నిజాం, జాగీర్దార్ల ఆధీనంలో) ఉండేవని వివరించారు. 1948లో తెలంగాణ భారత్‌లో విలీనమైన తర్వాత భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ జరిగిందన్నారు. 1954ను కటాఫ్‌ డేట్‌గా తీసుకుని రూపొందించిన ‘కాస్రా పహణీలు’ ఇప్పటికీ అనేక భూములకు ఆధారం అయినప్పటికీ, నిజాం, జాగీర్దారీ, ఇనాం వ్యవస్థల రికార్డుల్లో స్పష్టత కొరవడటమే నేడు 22ఏ జాబితా జటిలం కావడానికి ప్రధాన కారణమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.


దొర కన్ను భూములపై పడింది

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌ వ్యవహారంపై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కాళేశ్వరంలో మంది ఎక్కువై మజ్జిగ పలచనైంది. ఆ మజ్జిగ రుచి దొరకు నచ్చలేదు. అప్పుడే ఆయన కన్ను భూములపై పడింది. దాని కోసం వాడిన అస్త్రమే ధరణి’ అంటూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ‘ధరణి చిట్టా అంతా సభలో బయటపెట్టాలని, కేసీఆర్‌ చేసిన దోపిడీని ప్రజల ముందుంచాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌కు పదేపదే చెప్పాను. కానీ, బబుల్‌ షూటర్‌.. కేసీఆర్‌ను సభకు రావద్దని చెప్పాడు. అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పే గుండెధైర్యం కేసీఆర్‌కు లేదు’ అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. భూ రికార్డుల సర్వనాశనానికి ధరణిని ఒక ఆయుధంగా వాడారని విమర్శించారు. 2010లోనే ఒరిస్సాలో తెచ్చిన ధరణి మోడల్‌ను నాడు కాగ్‌ తీవ్రంగా ఆక్షేపించిందని, అలాంటి విఫల విధానాన్ని తెచ్చిన కేసీఆర్‌ ‘నేనే నా మెదడును రంగరించి ధరణిని తెచ్చాను’ అంటూ ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులు, భూ యజమానుల సమగ్ర సమాచారాన్ని, ప్రభుత్వ భూముల లెక్కలను విదేశీ ప్రైవేట్‌ సంస్థల చేతిలో పెట్టి గత పాలకులు తీవ్రమైన ద్రోహానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్‌ నిర్వహణకు ఐదేళ్లకు రూ.58 కోట్లు అయితే.. దాన్ని రూ.1300 కోట్లకు ఎలా పెంచారో బీఆర్‌ఎస్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. భూదాన్‌ భూముల్లో కూడా కబ్జాలు జరిగాయని, వాటినీ బయటపెడతానన్నారు. ల్యాండ్‌ రికార్డులను అప్‌డేట్‌ పేరుతో పార్ట్‌-ఏ, పార్ట్‌-బీగా విభజించి... పార్ట్‌-బీ అంతా నిషేధిత జాబితాలో పెట్టారని, దీనివల్ల 21.93 లక్షల ఎకరాలు ఇబ్బందుల్లో పడ్డాయని పేర్కొన్నారు. రికార్డులను సరిచేయించుకునేందుకు రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతే, ఇదే అదనుగా బీఆర్‌ఎస్‌ వాళ్లు దళారులు, దోపిడీదారులుగా అవతారమెత్తి దోచుకున్నారని విమర్శించారు.

ఈ వార్తలు కూడా చదవండి

బీజేపీతో పొత్తుపై కేటీఆర్‌ క్లారిటీ.. ఏమన్నారంటే

వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థుల మృతి

Updated Date - Sep 17 , 2026 | 03:43 AM