అల్లుడి హత్య.. అత్తింటి వారికి జీవిత ఖైదు!
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:19 AM
తమ కూతురితో పాటు తమను వేధింపులకు గురిచేస్తున్న అల్లుడిని హత్య చేసిన కేసులో పది మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ వరంగల్ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి వీబీ నిర్మల గీతాంబ సంచలన తీర్పు వెలువరించారు.
కూతురిని వేధిస్తున్నాడని హత్య.. 10 మందికి యావజ్జీవం
వరంగల్ లీగల్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): తమ కూతురితో పాటు తమను వేధింపులకు గురిచేస్తున్న అల్లుడిని హత్య చేసిన కేసులో పది మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ వరంగల్ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి వీబీ నిర్మల గీతాంబ సంచలన తీర్పు వెలువరించారు. కోపంతో క్షణికావేశంలో చేసిన నేరానికి అత్తింటి కుటుంబమంతా జైలు పాలైంది. కేసు వివరాల్లోకి వెళ్తే.. 2015లో రంగంపేటకు చెందిన దుట్ట శ్రీనివాస్ తో రంగశాయిపేటకు చెందిన బజ్జూరి రమేశ్ కుమార్తె రమ్యశ్రీకి వివాహం జరిగింది. అయితే ఏడాది తర్వాత శ్రీనివాస్ రమ్యశ్రీని శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. పలుమార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయితీలు జరిగినప్పటికీ ఎటువంటి మార్పు రాలేదు. దీంతో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. శ్రీనివాస్‌కు పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించి చివరికి క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. అయినా కూడా శ్రీనివా్సలో మార్పు రాలేదు. వేధింపులు భరించలేక రమ్యశ్రీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోగా.. అక్కడికి కూడా వచ్చి వారందరినీ తిట్టడంతో పాటు రమ్యశ్రీని కొట్టే వాడు. దీంతో తల్లిదండ్రులు రమ్యశ్రీని హైదరాబాద్‌కు పంపించారు. అయితే 2024 ఫిబ్రవరిలో రంగశాయిపేటలో బొడ్రాయి పండుగ సందర్భంగా రమ్యశ్రీ అక్కడికి చేరుకుంది. విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రంగశాయిపేటలోని రమ్యశ్రీ ఇంటికి వచ్చి.. ఆమెతో పాటు అక్కడి వారినీ చంపేస్తానంటూ బూతులు తిడుతూ బెదిరించాడు. అంతేకాకుండా వారిపై దాడి చేయడానికి యత్నించాడు.
దీంతో బజ్జూరి రమేశ్, అతడి కుమార్తె రమ్యశ్రీ, కుమారుడు అఖిల్, భార్య విజయ, తమ్ముడు సుధాకర్, తమ్ముడి కుమారుడు శశి, అక్కలు ఆకుతోట అనసూర్య, తోట మల్లికాంబ, పొరుగింటి వ్యక్తి నీరటి సాంబయ్య, రమ్యశ్రీ స్నేహితురాలు మేకల అలేఖ్య.. అందరూ కలిసి శ్రీనివాస్‌పై దాడికి దిగారు. అతడి కళ్లల్లో కారం చల్లి, రోకలి బండతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు మిల్స్‌కాలనీ పోలీసులు.. పది మంది నిందితులపై హత్యా నేరం నమోదు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో నేరం రుజువు అవ్వడంతోనిందితులకు యావజ్జీవ శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎల్‌నినో ప్రభావం.. నీటిని పొదుపుగా వినియోగించండి: సీఎస్
విదేశీ బొగ్గు దిగుమతితో సింగరేణికి మరణశాసనం రాస్తున్న సీఎం రేవంత్: కేటీఆర్