Share News

ప్రియుడితో పెళ్లి వద్దంటున్నారని..తల్లిదండ్రుల హత్య

ABN , Publish Date - Jan 29 , 2026 | 04:58 AM

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడిన ఓ యువతి.. తనను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల ప్రేమను మరచిపోయింది.

ప్రియుడితో పెళ్లి వద్దంటున్నారని..తల్లిదండ్రుల హత్య

  • మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలు తీసిన కూతురు

  • నర్సుగా తాను పనిచేస్తున్న ఆస్పత్రి నుంచి ఇంజక్షన్లు

  • ఖాళీ సిరంజీలతో బయటపడ్డ ఘోరం

  • వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలంలో ఘటన

వికారాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమలో పడిన ఓ యువతి.. తనను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల ప్రేమను మరచిపోయింది. వేరే కులానికి చెందిన ఆ యువకుడిని పెళ్లి చేసుకుంటానంటే చచ్చినా అంగీకరించమన్న తల్లిదండ్రులను చంపేసింది. ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న ఆ యువతి.. దొంగతనంగా తెచ్చిన మత్తు ఇంజెక్షన్లను మాయమాటలతో అమ్మానాన్నలకు మోతాదుకి మించి ఇచ్చి వాళ్ల ఉసురు తీసింది. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కల సురేఖ అనే యువతి ఈ ఘాతుకానికి పాల్పడింది. ఇందుకు సంబంధించి వికారాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

యాచారం గ్రామానికి చెందిన నక్కల దశరథ్‌(58), లక్ష్మి(54) దంపతులకు ఓ కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో చిన్న కూతురు సురేఖ బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. గతేడాది ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన ఓ యువకుడితో సురేఖ ప్రేమలో పడింది. వారిద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. అతడు వేరే కులానికి చెందిన వ్యక్తి కావడంతో అతనితో వివాహానికి సురేఖ తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ విషయంలో ఇంట్లో పలుమార్లు గొడవలు జరిగాయి. అయితే, ప్రియుడిని ఎలాగైనా పెళ్లాడాలని నిశ్చయించుకున్న సురేఖ.. తన తల్లిదండ్రుల హత్యకు పథకం రచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే మత్తు ఇంజెక్షన్లను తాను పని చేస్తున్న ఆస్పత్రి నుంచి గుట్టుగా సేకరించింది. ఈ నెల 24(శనివారం)న విధులకు సెలవు పెట్టి స్వగ్రామానికి వచ్చింది. ఆ రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన తర్వాత ప్రియుడితో వివాహంపై చర్చించింది. ప్రేమ వివాహానికి చచ్చినా ఒప్పుకోం అని తల్లిదండ్రులు చెప్పడంతో ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ వెంటనే ఒళ్లు నొప్పులు తగ్గించడానికి మందు తెచ్చానంటూ రాత్రి 10 గంటల సమయంలో తల్లికి అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చింది.


ఆ ఇంజెక్షన్‌ ప్రభావంతో తల్లి లక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలిపోగా నిద్రపోతున్నట్లుగా ఆమెను పడుకోబెట్టింది. కాసేపటి తర్వాత బయట నుంచి ఇంటికి తిరిగొచ్చిన తండ్రి ధశరథ్‌కు.. నాన్నా నీ నడుము నొప్పి తగ్గేందుకు ఇంజక్షన్‌ ఇస్తానని చెప్పి.. ఆయనకు అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్‌ ఇచ్చింది. ఆ వెంటనే అతను కూడా కుప్పకూలిపోయాడు. ఆపై, ఈ హత్యలను సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు సురేఖ తన అన్న అశోక్‌కు ఫోన్‌ చేసి నాటకమాడింది. అమ్మానాన్న స్పృహా తప్పిపడిపోయారు భయంగా ఉందంటూ పిలిపించింది. నాన్న మాట్లాడుతూ కుప్పకూలిపోయారని, అది చూసి షాక్‌తో అమ్మ కూడా కిందపడిపోయిందని చెప్పింది. ఇరువురికి సీపీఆర్‌ కూడా చేశానని ఫలితం లేకపోయిందని తెలిపింది.


ఖాళీ సిరంజిలతో బయటపడ్డ నిజం

సురేఖ మాటలు తొలుత విశ్వసించిన కుటుంబసభ్యులు, గ్రామ ప్రజలు.. దశరథ్‌ దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని తొలుత భావించారు. అయితే, సంఘటనా స్థలంలో రెండు వాడిన సిరంజిలు, రక్తపు చుక్కలు కనిపించడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఇంటి నుంచి ఖాళీ ఇంజెక్షన్‌ బాటిళ్లు, వాడిన సిరంజిలను స్వాధీనం చేసుకున్న పోలీసులు సురేఖను విచారించగా అసలు నిజం బయటపెట్టింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు సురేఖను రిమాండ్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నాపై దుష్ప్రచారం చేస్తున్నారు

ఉల్లాసంగా.. ఉత్సాహంగా!

Updated Date - Jan 29 , 2026 | 07:31 AM