నాంపల్లి అగ్నిప్రమాదం కేసు.. ఫర్నిచర్ షాపు యజమాని అరెస్ట్
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:48 PM
బచ్చాస్ ఫర్నిచర్ షాపు కేసుకు సంబంధించి షాపు యజమాని సతీష్ బచాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సతీష్.. సెల్లార్‌లో ఫర్నిచర్ షాపు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్, జనవరి 25: నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో నిన్న (శనివారం) అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నాలుగు అంతస్తుల భవనంలోని సెల్లార్‌లో ఉన్న ఫర్నిచర్ షాపులో అగ్నిప్రమాదం జరిగింది. దుకాణంలో పని చేస్తున్న సుభాన్‌పుర నివాసి మహ్మద్ ఇంతియాజ్, శాస్త్రిపురం ప్రాంతానికి చెందిన సయ్యద్ హబీబ్‌లతోపాటు సెల్లార్‌లో చిక్కుకున్న ప్రవీణ్, అఖిల్, బీబీలు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫర్నిచర్ షాపు యజమాని సతీష్ బచాస్‌ను అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సతీష్ సెల్లార్‌లో ఫర్నిచర్ షాపు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సతీష్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని నిర్థారించారు. నిందితుడిని అబిడ్స్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
నాంపల్లి స్టేషన్ రోడ్డులోని హిందీ ప్రచార్‌సభ భవనం పక్కన సాయి విశ్వాస్ ఛాంబర్స్ అనే ఐదంతస్తుల భవనం ఉంది. భవనం సెల్లార్‌లో బచ్చాస్ ఫర్నిచర్ దుకాణం ఉంది. దుకాణంలో సుమారు 22మంది పని చేస్తున్నారు. యాదయ్య అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ప్రణీత్(11), అఖిల్(7)తో కలిసి సెల్లార్‌లోనే నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి కంటైనర్‌లో చైనా నుంచి భారీగా ఫర్నిచర్ వచ్చింది. ఫర్నిచర్‌ను రెండు సెల్లార్లలో భద్రపరిచారు.
శనివారం ప్రణీత్, అఖిల్‌లు స్కూలుకు వెళ్లకుండా ఇంటిలోనే ఉండిపోయారు. తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళుతూ.. సెల్లార్‌లోనే ఆడుకోమని వారికి చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రెండు సెల్లార్లలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొగలు రావటం గమనించిన కొంతమంది ఫర్నిచర్ షాపు సిబ్బంది బయటకు పరుగులు తీశారు. మహ్మద్ ఇంతియాజ్, సయ్యద్ హబీబ్, బీబీ అనే వృద్ధురాలు లోపల చిక్కుకుపోయారు. బీబీని కాపాడ్డానికి ప్రణీత్, అఖిల్ లోపలికి వెళ్లారు. మళ్లీ తిరిగిరాలేదు. మంటల్లో కాలి ఐదుగురు చనిపోయారు.
ఇవి కూడా చదవండి
బిగ్ బాష్ లీగ్.. ఛాంపియన్‌గా నిలిచిన పెర్త్ స్కార్చర్స్
జనవరి 26న దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన