Share News

కల్వర్టును ఢీకొట్టిన వాహనం

ABN , Publish Date - Feb 15 , 2026 | 07:11 AM

మహా శివరాత్రి సందర్భంగా కర్ణాటక నుంచి శ్రీశైలం బయలుదేరిన ఓ బృందం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.

కల్వర్టును ఢీకొట్టిన వాహనం

  • కర్ణాటకకు చెందిన దంపతులు సహా ముగ్గురి మృతి

ఊర్కొండ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మహా శివరాత్రి సందర్భంగా కర్ణాటక నుంచి శ్రీశైలం బయలుదేరిన ఓ బృందం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న తుపాన్‌ వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలంలో జడ్చర్ల-కోదాడ 167 నెంబరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా కలికిరి గ్రామానికి చెందిన ఓ కుటుంబం, వారి బంధుమిత్రులు కలిసి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తమ స్వగ్రామం నుంచి రెండు తుపాన్‌ వాహనాల్లో శ్రీశైలం బయలుదేరారు. మహాశివరాత్రి రోజున శ్రీశైలంలో మల్లికార్జునస్వామిని దర్శించుకోవాలని అనుకున్నారు. అయితే, ఈ బృందానికి చెందిన వాహనాల్లో ఓ వాహనం ఊర్కొండ మండలంలోని రేవల్లి ఽగ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంలో ఉన్న రాంరెడ్డి దేశాయి(50), మేఘ దేశాయి(45) అనే దంపతులు, మహాదేవి(65) అనే మహిళ అక్కడికక్కడే మరణించారు. బసన్నగౌడ, మల్లమ్మ, శివమన్యం, రాములుగౌడ, నీలమ్మ, బసప్ప, డ్రైవర్‌ రాము తీవ్రంగా గాయపడ్డారు.

Updated Date - Feb 15 , 2026 | 07:11 AM