తమ అమ్మాయిని పెళ్లాడాడని ఇంటిని కూల్చేశారు
ABN , Publish Date - Sep 11 , 2026 | 03:33 AM
ప్రేమించడమే అతడు చేసిన తప్పయింది! వేరే కులం అమ్మాయిని ఇష్టపడి.. ఆమెకు ప్రపోజ్ చేసి.. ఆమె అంగీకారంతోనే వివాహం చేసుకోవడం అతడు చేసిన నేరమైంది
ట్రాక్టర్లు, గడ్డపారలతో యువకుడి
ఇంటిని నేలమట్టం చేసిన
యువతి కుటుంబ సభ్యులు
యువ జంట కులాంతర ప్రేమ పెళ్లి
ఇష్టపడే చేసుకున్నానన్న యువతి
ఆగ్రహంతో కుటుంబసభ్యుల దుశ్చర్య
తమ అమ్మాయిని పెళ్లాడాడనినిలువ నీడ లేకుండా చేశారు!
యువకుడి ఇంటిని ట్రాక్టర్లు, గడ్డపారలతో కూల్చేసిన యువతి కుటుంబసభ్యులు
యువ జంట కులాంతర ప్రేమ వివాహం
నేను మేజర్‌ను.. ఇష్టపూర్వకంగానే
పెళ్లి చేసుకున్నా.. స్పష్టం చేసిన యువతి
ఆగ్రహంతో యువతి కుటుంబసభ్యుల దుశ్చర్య
గద్వాల రూరల్ రేపల్లి గ్రామంలో ఘటన
గద్వాల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రేమించడమే అతడు చేసిన తప్పయింది! వేరే కులం అమ్మాయిని ఇష్టపడి.. ఆమెకు ప్రపోజ్ చేసి.. ఆమె అంగీకారంతోనే వివాహం చేసుకోవడం అతడు చేసిన నేరమైంది! వేరే కులం యువకుడు తమ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని యువతి కుటుంబసభ్యులు బంధువులతో మూకుమ్మడిగా వెళ్లి ఆ యువకుడి ఇంటిని కూల్చివేశారు. గద్వాల రూరల్ రేపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రేపల్లి గ్రామానికి చెందిన ప్రభుదాస్‌ది ఎస్సీ సామాజిక వర్గం! అదే గ్రామానికి చెందిన తుమ్మలపల్లి ఈరన్నది బోయ/ వాల్మీకి సామాజిక వర్గం. ప్రభుదాస్ కుమారుడు రంగముని (26), ఈరన్న కుమార్తె మహేశ్వరి (21) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రభుదాస్ కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడ రంగముని క్యాబ్ నడుపుతున్నాడు. మహేశ్వరి డిగ్రీ పూర్తిచేసింది. హైదరాబాద్‌లోనే ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. రంగముని, మహేశ్వరి బుధవారం పెళ్లి చేసుకొని రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రేపల్లి నుంచి యువతి తల్లిదండ్రులను పిలిపించారు. తాను మేజర్‌ను అని, ఇష్టపూర్వకంగానే రంగమునిని పెళ్లి చేసుకున్నానని.. తల్లిదండ్రుల వెంట వెళ్లేది లేదని మహేశ్వరి పోలీసుల ఎదుట తేల్చిచెప్పినట్లు సమాచారం.
అనంతరం యువతి తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ గ్రామానికి చేరుకున్న యువతి కుటుంబసభ్యులు.. తమ బంధువులు, కులస్థులను కూడగట్టుకున్నారు. ట్రాలీ, కల్టివేటర్‌లతో కూడిన ట్రాక్టర్లు.. గడ్డపారలను తీసుకెళ్లి గ్రామంలోని రంగముని ఇంటిని ప్రహరీ సహా కూల్చివేశారు. ఆ ప్రాంగణంలోనే ఉన్న రంగముని చిన్నాన్న ఇంటిని కూడా పడగొట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు బందోబస్తు కొనసాగిస్తామని సీఐ టంగుటూరు శ్రీను పేర్కొన్నారు. గ్రామ జనాభా దాదాపు 1200 దాకా ఉంటే వారిలో బోయ కులస్తులు 80శాతం దాకా ఉన్నారు. ఎస్సీల ఇళ్లు నాలుగైదే ఉన్నాయి. బాధిత కుటుంబ సభ్యులు, బాధితుడి చిన్నాన్న ఊర్లో ఉండటం లేదు. తాళాలు వేసి ఉన్న ఆ రెండు ఇళ్లను యువతి తరఫువారు కూల్చివేశారు. కాగా ఘటన అనంతరం నిందితుల్లో ముగ్గురు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది.