Share News

వందలోపు ఇద్దరు

ABN , Publish Date - Mar 07 , 2026 | 05:02 AM

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసిన సివిల్‌ సర్వీసెస్‌-2025 ఫలితాల్లో తెలుగు తేజాలు మెరిశారు. టాప్‌-100 లోపు ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు చోటు దక్కించుకోగా..

వందలోపు ఇద్దరు

  • సివిల్స్‌లో ఏపీకి చెందిన జీను శ్రీజశ్వంత్‌చంద్రకు 23వ ర్యాంకు

  • ప్రస్తుతం ఐపీఎస్‌ శిక్షణలో ఉన్న శ్రీజశ్వంత్‌

  • పెద్దపల్లి జిల్లా వాసి గూడెల్లి సృజనకు 55వ ర్యాంకు.. డీఎస్పీగా హైదరాబాద్‌లో శిక్షణ

  • 40 మందికిపైగా అర్హత.. వందలోపు ర్యాంకుల్లో ఇద్దరు

  • ‘రాజీవ్‌ సివిల్స్‌ అభయహస్తం’ అందుకున్న 20 మంది విజయం

  • తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఖాతాలో 2 ర్యాంకులు .. అభ్యర్థులకు సీఎం అభినందన

  • సివిల్స్‌-2025 ఫలితాలు విడుదల.. 958 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీ

  • రాజస్థాన్‌కు చెందిన అనూజ్‌ అగ్నిహోత్రికి జాతీయస్థాయిలో ఫస్ట్‌ర్యాంకు

  • రెండోస్థానంలో తమిళనాడుకు చెందిన రాజేశ్వరి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసిన సివిల్‌ సర్వీసెస్‌-2025 ఫలితాల్లో తెలుగు తేజాలు మెరిశారు. టాప్‌-100 లోపు ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు చోటు దక్కించుకోగా.. ఓవరాల్‌ ఫలితాల్లో 40 మందికి పైగా మంచి ర్యాంకులను సొంతం చేసుకున్నారు. ఏపీలో కాకినాడకు చెందిన జీను శ్రీజశ్వంత్‌చంద్ర 23వ ర్యాంకులో నిలవగా, తెలంగాణలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరుకు చెందిన గూడెల్లి సృజన 55వ ర్యాంకును సాధించారు. వీరిద్దరూ ప్రస్తుతం హైదరాబాద్‌లో పోలీసు శిక్షణలో ఉండటం గమనార్హం. శ్రీజశ్వంత్‌చంద్ర ఐపీఎస్‌ శిక్షణలో ఉండగా, సృజన డీఎస్పీకి ఎంపికై శిక్షణ తీసుకుంటున్నారు. హనుమకొండ జిల్లా కాజిపేటకు చెందిన అట్లా అరుణ్‌తేజ్‌ 123వ ర్యాంకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన బానోత్‌ లక్ష్మీరచన 178వ ర్యాంకు సాధించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్‌ సివిల్స్‌ అభయహస్తం పథకం కింద సహకారం అందుకున్న 20 మంది అభ్యర్థులు సత్తా చాటారు. విజేతలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. కాగా, యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయిలో ఫస్ట్‌ర్యాంకును రాజస్థాన్‌కు చెందిన అనూజ్‌ అగ్నిహోత్రి కైవసం చేసుకున్నారు. జోధ్‌పూర్‌ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన అనూజ్‌.. మెడికల్‌ సైన్స్‌ ఆప్షనల్‌ సబ్జెక్టుతో సివిల్స్‌లో అగ్రస్థానాన్ని కొల్లగొట్టారు. తమిళనాడుకు చెందిన రాజేశ్వరి సువే రెండో ర్యాంకు సాధించారు. చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఈమె సివిల్స్‌లో సోషియాలజీని ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. టాప్‌ 25 మంది ర్యాంకర్లలో 11 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు.

1.jpg


రాజీవ్‌ సివిల్స్‌ అభయహస్తం

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్‌) కింద సింగరేణి సంస్థ నిధులతో ‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ పథకాన్ని రెండేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తోంది. పేద విద్యార్థులు యూపీఎస్సీ సివిల్స్‌లో ప్రిలిమ్స్‌కు ఉత్తీర్ణులై.. మెయిన్స్‌కు అర్హత సాధిస్తే ఈ పథకం కింద రూ.లక్ష, మెయిన్స్‌లో ఉత్తీర్ణులై... ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తే మరో రూ.లక్ష సహాయంగా అందజేస్తున్నారు. ఈ దఫా సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఇందులో 51 మంది ఇంటర్వ్యూకు సెలెక్ట్‌ కాగా... వీరిలో 20 మంది తుది ఫలితాల్లో మంచి ర్యాంకులతో విజయం సాధించారు. మరోవైపు, తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు కూడా ఫలితాల్లో ప్రతిభను చాటారు. వరంగల్‌ జిల్లాకు చెందిన ఎ.ఆశిష్‌ జాతీయ స్థాయిలో 676 ర్యాంకు సాధించగా... ములుగు జిల్లాకు చెందిన డి.ప్రవీణ్‌కుమార్‌ 793 ర్యాంకు సాధించారు. వీరికి ఐపీఎస్‌ వచ్చే అవకాశం ఉంది. వీరికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు.

దేశవ్యాప్తంగా 958 మంది అర్హత

యూపీఎస్సీ మొత్తం 1087 ఖాళీల భర్తీలకుగాను నోటిఫికేషన్‌ విడుదల చేయగా 958 మంది అర్హత సాధించారు. వీరిలో 659 మంది పురుషులు, 299 మంది మహిళలు ఉన్నారు. జనరల్‌ క్యాటగిరీ నుంచి 317, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 104, ఓబీసీ నుంచి 306, ఎస్సీ నుంచి 158, ఎస్టీ క్యాటగిరీ నుంచి 73 మంది ఎంపికయ్యారు. ఐఏఎస్‌కు 180 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 55, ఐఏఎస్‌కు 150, గ్రూప్‌ ఏ కేంద్ర సర్వీసులకు 507, గ్రూప్‌ బి సర్వీసులకు 195 మంది ఎంపికయ్యారు. 42 మంది దివ్యాంగులు సివిల్స్‌ ఫలితాల్లో విజేతలుగా నిలిచారు. అభ్యర్థులు సాధించిన మార్కులను 15 రోజుల్లో అందుబాటులో ఉంచుతామని యూపీఎస్సీ తెలిపింది. కాగా, సివిల్స్‌కు మొత్తం 9,37,876 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది మే 25న నిర్వహించిన సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు 5,76,793 మంది అభ్యర్థులు హాజరయ్యారు. గత ఆగస్టులో నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షకు 14,161 మంది అర్హత సాధించారు. వీరిలో 2,736 మంది అభ్యర్థులు సివిల్స్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యారు.


ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి..

మొదటి 25 స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు ఐఐటీ, ఎన్‌ఎల్‌యు, ఎయిమ్స్‌, డీటీయూ, అన్నా యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ వంటి దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి ఇంజనీరింగ్‌, హ్యుమానిటీస్‌, సైన్స్‌, కామర్స్‌, లా, మెడికల్‌ సైన్స్‌, మాస్‌ మీడియా విభాగాల్లో విద్యనభ్యసించారు. టాప్‌ 25 అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షలో ఆంత్రోపాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌, హిస్టరీ, ఫిలాసఫీ, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి వివిధ సబ్జెక్టులను ఆప్షనల్స్‌గా ఎంచుకున్నారు.

ఐదోసారి ప్రయత్నంలో విజయం

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని సెంటినరీకాలనీకి చెందిన గూడెల్లి సృజన సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో 55వ ర్యాంక్‌ సాధించారు. ఆమె తన 5వ ప్రయత్నంలో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో విజయం సాధించారు. సృజన తండ్రి గూడెల్లి రాజేశం సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్‌ పరిధిలోని ఓసీపీ-1లో జనరల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. సృజన సెంటినరీకాలనీలోని స్థానిక వాణి పాఠశాలలో పదో తరగతి వరకూ చదివారు. హైదరాబాద్‌ శ్రీచైతన్యలో ఇంటర్‌ పూర్తి చేసిన అనంతరం సెంటినరీకాలనీలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో సీఎస్సీ (కంప్యూటర్‌) విభాగంలో 2019లో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. రాష్ట్ర గ్రూప్‌-1 పరీక్షల్లో 35వ ర్యాంక్‌ సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.


తెలుగు రాష్ట్రాల విజేతలు

యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో 40 మందికిపైగా వెయ్యిలోపు ర్యాంకులు సాధించారు. జీను శ్రీజశ్వంత్‌చంద్ర (23), గూడెల్లి సృజన(55), పోలవరపు ద్వానిష్‌(108), అట్ల తరుణ్‌ తేజ(123), శ్రీగిరిరాజు వీపీఎస్‌ సాయికృష్ణ(125), కొలిపాక శ్రీకృష్ణసాయి(150), బానోత్‌ లక్ష్మీ రచన(178), డీఎస్‌కే ప్రచేత్‌(193), ఎస్‌.వర్షిత్‌రెడ్డి(259), దొమ్మేటి వినయ్‌(282), మాసామ్మగారి పవన్‌కుమార్‌రెడ్డి(297), ఎం. వెంకటేష్‌ ప్రసాద్‌సాగర్‌(358), రాయలం జయశ్రీ(360), సునీత(364), మెరుగు కౌశిక్‌((399), అఖిలేష్‌ గుండు(464), రాపర్తి ప్రీతి(468), బేతి విక్రమ్‌(472), యశ్వంత్‌ ఎస్‌(475), విశాఖ కాదం(504), మేదర హర్షిత((520), వెలిమినేటి విక్రమ్‌ సింహారెడ్డి(541), కేశబోయిన అఖిల్‌సాయినాథ్‌ (566), శ్వేత గుమ్మల(573), పల్లి ప్రమోద్‌ విష్ణు(640), ఎ. సాగర్‌(641), ఆశిష్‌ అనిషెట్టి(676), వెలిమినేటి విజయ్‌సింహారెడ్డి(682), అంగరాజు నవీన్‌(715), కాదం సునీల్‌ సుభాష్‌(727), పోతుపురెడ్డి భార్గవ్‌(738), పుడారి రాహుల్‌(748), కుమ్మరి శ్రవణ్‌కుమార్‌(768), అనిరుధ్‌ కత్తిమాని(786), దాయినంపల్లి ప్రవీణ్‌(793), కోరపోతుల శ్రీకర్‌రాజ్‌((806), ఇస్లావత్‌ శ్రీరామ్‌ హర్ష(823), బానోత్‌ భరత్‌కుమార్‌(900), సిదార్థ్‌రావు గౌతమ్‌(906), కట్టా ప్రత్యూష(908), గోగుల రాజశేఖర్‌(920), జితేందర్‌నాయక్‌ గుగులోతు(939), దీపక్‌ శర్మ(951) తదితరులు ఉన్నారు.

4.jpg

తల్లిదండ్రులను కోల్పోయి.. పారిశుధ్య కార్మికురాలైన నాయనమ్మ వద్ద పెరిగి..

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేసే నాయనమ్మ వద్ద పెరిగిన వ్యక్తి కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు సివిల్స్‌లో విజయం సాధించారు. ఆయనే ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్‌. తాజాగా విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో ప్రవీణ్‌ 793వ ర్యాంక్‌ సాధించారు. గతంలో గ్రూప్‌-1 పరీక్షల్లో 105వ ర్యాంక్‌ సాధించి డీఎస్పీగా ఎంపికైనప్పటికీ.. సివిల్స్‌లో చేరాలన్న ఆశయంతో కృషి చేసి అనుకున్నది సాధించారు.


3.jpg

అన్నదమ్ముల విజయం

సివిల్స్‌లో నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన అన్నదమ్ములు విక్రమ్‌ సింహారెడ్డి, విజయ సింహారెడ్డి విజయం సాధించారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వీరిద్దరూ కష్టపడి చదివి ర్యాంకులు సాధించారు. విక్రమసింహారెడ్డికి 541 ర్యాంకు రాగా విజయసింహారెడ్డికి 682 ర్యాంకు లభించింది. అన్న విజయసింహారెడ్డి ప్రస్తుతం వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. తమ్ముడు విక్రమ సింహారెడ్డి ఇటీవలే రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్‌-1లో సెలెక్ట్‌ అయి శిక్షణ పొందుతున్నారు. వీరిద్దరూ సివిల్స్‌ 5వ ప్రయత్నంలో సివిల్స్‌ సాధించారు.

5.jpg

నాడు ఐపీఎస్‌.. నేడు ఐఏఎస్‌

యూపీఎస్‌సీ సివిల్స్‌ 2025 తుది ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ కుర్రోడు సత్తా చాటాడు. జీను శ్రీజశ్వంత్‌చంద్ర 23వ ర్యాంక్‌ సాధించారు. 2023 సివిల్స్‌ ఫలితాల్లో శ్రీజశ్వంత్‌చంద్ర 162వ ర్యాంక్‌ సాధించి ఐపీఎస్‌ ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌ ట్రైనింగ్‌లో ఉన్నారు. ఎలాగైనా ఐఏఎస్‌ సాధించాలనే తపనతో మళ్లీ సివిల్స్‌కి సిద్ధమై ఈసారి సత్తా చాటి కల సాకారం చేసుకున్నారు.

Updated Date - Mar 07 , 2026 | 05:02 AM