Share News

త్వరలో రాష్ట్రంలో 100 జీసీసీలు

ABN , Publish Date - Sep 11 , 2026 | 05:20 AM

రాష్ట్రంలో త్వరలో 100 గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గతేడాది తెలంగాణలో ఏర్పాటైన 75కుపైగా జీసీసీలకు ఇవి అదనమని పేర్కొన్నారు

త్వరలో రాష్ట్రంలో 100 జీసీసీలు
SRIDHARBABU

  • కొత్తగా 4 లక్షల ఉద్యోగ అవకాశాలు: మంత్రి శ్రీధర్‌బాబు

  • ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌ ప్రారంభోత్సవం

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో 100 గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గతేడాది తెలంగాణలో ఏర్పాటైన 75కుపైగా జీసీసీలకు ఇవి అదనమని పేర్కొన్నారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల ఉద్యోగ అవకాశాలు అభించే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ లైఫ్‌సైన్సెస్‌, టెక్నాలజీ హబ్‌ గా మరింత బలోపేతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్‌ హైటెక్‌సిటీలో ఎంఎఎస్‌డీ ఏర్పాటు చేసిన 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని కొత్త టెక్నాలజీ సెంటర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిజిటల్‌, డేటా, అనలిటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ రంగాల్లో అధునాతన సామర్థ్యాలను ఈ కేంద్రంలో సమీకరించనున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2వేలకు పైగా లైఫ్‌సైన్సెస్‌ కంపెనీలు ఉన్నాయని వెల్లడించారు. ఏపీఐలు, బల్క్‌ డ్రగ్స్‌, జనరిక్స్‌, సీడీఎంవోలు, వ్యాక్సిన్లు, పరిశోధన, డిస్కవరీ వంటి సదుపాయాలు గల పరిశ్రమలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచస్థాయి కేంద్రంగా ఎదిగిందని, అమెరికా వెలుపల అత్యధిక పొందిన తయారీ కేంద్రాల్లో ఒకటిగా హైదరాబాద్‌ ఉందన్నారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో 2,100 ఎకరాల లైఫ్‌సైన్సెస్‌ జోన్‌, 100 ఎకరాల అధునాతన బయోలాజిక్స్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఆవిష్కరణలు, విస్తరణను వేగవంతం చేసేందుకు అధునాతన బయో-ఫౌండ్రీ మౌలిక వసతులకు ప్లగ్‌-అండ్‌-ప్లే సదుపాయం కల్పించే ‘1బయో’ మోడల్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని శ్రీధర్‌బాబు తెలిపారు.

Updated Date - Sep 11 , 2026 | 05:30 AM