నా తల్లిని అన్నారు ఆవేశం నాకుంటుంది.. నీకెట్ల ఉంటది?
ABN , Publish Date - Sep 09 , 2026 | 04:03 AM
శాసనసభ స్పీకర్‌గా ఎప్పుడూ శాంతంగా వ్యవహరించే ప్రసాద్‌కుమార్.. మంగళవారం ఉగ్రరూపం ప్రదర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉపనేత హరీశ్‌రావుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీశ్‌రావుపై స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఆగ్రహం
సభలో లొల్లి చేస్తే భయపడనంటూ హెచ్చరిక
స్పీకర్‌ను బెదిరించేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నం
దళిత వర్గాలపై దాడి చేస్తారా?: శ్రీధర్‌బాబు
మహిళా సభ్యులను ముందుకు తోసిందెవరు?
మహిళా పోలీసుపై చేయి వేసిన కేటీఆర్: సీతక్క
కౌరవులకు పట్టిన గతే రేవంత్‌కూ: హరీశ్‌రావు
రెండోరోజూ రణరంగమే.. ప్రశ్నోత్తరాలు రద్దు
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): శాసనసభ స్పీకర్‌గా ఎప్పుడూ శాంతంగా వ్యవహరించే ప్రసాద్‌కుమార్.. మంగళవారం ఉగ్రరూపం ప్రదర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉపనేత హరీశ్‌రావుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా నల్లబ్యాడ్జీలు ధరించి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ గారు అటే చూస్తారా? ఇటు చూడరా? మహిళా శాసనసభ్యులపై దాడి జరిగితే స్పందించరా? అంటూ హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్ సభ్యులు ప్రశ్నించారు. మహిళా సభ్యుల చీరలు లాగితే.. దుర్యోధనుడి వలే వ్యవహరిస్తే స్పందించరా? అంటూ
నినాదాలు చేశారు. దీంతో స్పీక ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆవేశం నాకు ఉండాలి.. నీకు కాదు. నీ తల్లిని అనలేదు.. నా తల్లిని అన్నారు. నాకుంటుంది ఆవేశం.. నీకు ఎట్లుంటది? నా మాటలు విను. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి అన్నా నాకు గౌరవం. నాకు 8 మంది అక్కాచెల్లెళ్లు. గేటు దగ్గర సంఘటన జరిగిందని సమాచారం రాగానే విచారణకు ఆదేశించాను. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం. కానీ, ముందు నా సంగతేంటో చెప్పు’’ అంటూ హరీశ్ రావుపై స్పీకర్ మండిపడ్డారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ సభ్యులు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడి, మరికొందరు పోడియంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించగా ‘మీరు లొల్లి పెట్టినంత మాత్రాన నేను భయపడను’ అని స్పీకర్ అన్నారు. మరోవైపు 22ఏపై విచారణ జరిపించాలంటూ బీజేపీ సభ్యులు సభలో బైఠాయించారు. దీంతో సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు.

క్షమాపణలు చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా?
బీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్‌ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ‘‘స్పీకర్‌ను దుర్భాషలాడిన విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంటే.. అందుకు క్షమాపణలు చెప్పకుండా.. ‘తిట్టారనుకుంటే, అలా భావిస్తే’ అనే మాటలేంటి? స్పీకర్‌ను దుర్భాషలాడిన విషయాన్ని పక్కనపెట్టాలా? దళిత వర్గాలను గౌరవించడానికి సభాపతిగా కూర్చోపెడితే.. దాడి చేస్తారా? అని ఆక్షేపించారు. ఇక సీనియర్ ఎమ్మెల్యేలపై ఏం జరిగిందో పూర్తి స్థాయిలో సమాచారం తీసుకుంటున్నామని, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి విషయాల్లోనూ పోలీసు యంత్రాంగం నుంచి వివరాలు కోరామని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల తప్పులు జరిగితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ వెంటనే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుడు స్పీకర్‌గా ఉన్నందువల్లే కేసీఆర్ సభకు రావడం లేదన్నారు. ‘‘స్పీకర్ తల్లిని తిడితే క్షమాపణలు చెప్పరా? కేటీఆర్ పోలీసుల గల్లా పట్టుకుంటే.. హరీశ్‌రావు మహిళల ముందే షర్ట్ విప్పారు. క్షమాపణలు కచ్చితంగా చెప్పాల్సిందే’’ అని లక్ష్మణ్‌కుమార్ అన్నారు. గతంలో ఇదే సభలో ఏం తప్పు చేశారని సంపత్‌కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల సభ్యత్వం రద్దు చేశారని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలను తోసిందెవరు?: సీతక్క
ఉద్రిక్త వాతావరణం ఉన్న సమయంలో మహిళా ఎమ్మెల్యేలను ముందుకు తోసిందెవరని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మహిళా పోలీసుపై కేటీఆర్ చేయి వేశారని, పోలీసులను తిట్టారని అన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా ప్రవ ర్తిస్తే శిక్షించాలన్నారు. అయితే చీరలాగారని, కొట్టారని చెప్పేముందు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. హరీశ్‌రావును కవిత ఏమన్నారని ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారని ప్రశ్నించారు. కాగా, బీఆర్‌ఎస్ సభ్యులు ఫాంహౌస్ డైరెక్షన్‌లో నిరసనలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ రాంచందర్‌నాయక్ అన్నారు. మహిళా ఎమ్మెల్యేలను సుధీర్‌రెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి కావాలనే ముందుపెట్టారని అన్నారు. సొంత చెల్లెళ్లను బయటకు వెళ్లగొట్టి వీళ్లతో నాటాకాలాడుతున్నారని మండిపడ్డారు.
కౌరవ సభగా మారినగౌరవసభ
గౌరవసభ అయిన అసెంబ్లీ కౌరవసభగా మారిందని హరీశ్‌రావు ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డిపై దాడి చేసి గొంతు నులిమారని, సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారని, అయినా విచారణ జరగలేదని ఆక్షేపించారు. హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేస్తే బాధితులపైనే కేసులు పెట్టారని, న్యాయం చేయాలని పోలీసుస్టేషన్‌కు వెళితే తమపైనే కేసులు పెట్టారని తెలిపారు. స్పీకర్ తమను కాపాడాలన్నారు. స్పీకర్‌ను తాతా మధు ఏమీ అనకపోయినా.. విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారని అన్నారు. సభ్యుడు క్షమాపణలు చెప్పినా అరెస్ట్ చేశారని, ఒక్క తప్పునకు ఎన్ని కేసులు పెడతారో పెట్టండని సవాల్ చేశారు. కాగా, బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ 22ఏపై ఎప్పుడు చర్చిస్తారో చెప్పాలన్నారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు బదులిస్తూ 22ఏపై స్వల్పకాలిక చర్చ చేపట్టాలని ప్రభుత్వపరంగా తామే ముందుకొచ్చామన్నారు. మిత్రులను(బీఆర్‌ఎస్ ను ) కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
అసెంబ్లీలో విజయ్ సైగ.. స్టాలిన్‌ను ఉద్దేశించే చేశారంటూ డీఎంకే ఫైర్.
సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. 73 మందికి గాయాలు..