Share News

తెలంగాణలో రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ కొరడా

ABN , Publish Date - Aug 20 , 2026 | 02:07 PM

తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం బకాయిలను చెల్లించకుండా తప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వానికి భారీగా బకాయిపడిన 20 మంది మిల్లర్ల జాబితాను ఈడీకి అందజేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ కొరడా
Telangana Rice Millers

హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం బకాయిలను భారీగా ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ చర్యలకు సిద్ధమవుతోంది. ప్రభుత్వానికి భారీ మొత్తంలో బకాయిపడిన 20 మంది రైస్ మిల్లర్ల జాబితాను సివిల్ సప్లయ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ)కి అందజేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను మిల్లర్లు ఉద్దేశపూర్వకంగా నిలిపివేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా, ధాన్యం లావాదేవీల్లో అక్రమ మార్గాల్లో నిధులు సమీకరించడం.. హవాలా రూపంలో డబ్బులు సంపాదించడం వంటి ఆరోపణలు కూడా మిల్లర్లపై ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా మిల్లర్ల ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు, ధాన్యం కొనుగోళ్లు–మిల్లింగ్‌కు సంబంధించిన రికార్డులపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఈడీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.


9 మంది మిల్లర్లపై పీడీ యాక్ట్‌కు రంగం సిద్ధం..

ప్రభుత్వ ధాన్యం బకాయిలను చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లర్లపై కఠిన చర్యలకు పోలీస్ శాఖ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 9 మంది రైస్ మిల్లర్లపై పీడీ యాక్ట్‌ ప్రయోగించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల విషయంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం, బకాయిలను భారీగా పెండింగ్‌లో ఉంచడం, ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు అనుమానాలు ఉండటంతో ఈ చర్యలకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Updated Date - Aug 20 , 2026 | 02:22 PM