Share News

రైతుల మరణాల నమోదుకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Sep 09 , 2026 | 02:06 AM

రైతు బీమా పథకం ఆగస్టు 13వ తేదీకి ముగిసిన నేపథ్యంలో.. ఆగస్టు 14 నుంచి రైతు మరణాల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు.. మంగళవారం (సెప్టెంబరు 8 వ తేదీ) నుంచి రైతుబీమా పోర్టల్‌ను తిరిగి తెరిచింది

రైతుల మరణాల నమోదుకు గ్రీన్‌సిగ్నల్‌
tg land

  • రైతుబీమా పోర్టల్‌ను మళ్లీ తెరిచిన రాష్ట్ర ప్రభుత్వం

  • ఆగస్టు 14 నుంచి మరణాల నమోదుకు ఆదేశాలు

  • పరిహారం ఎలా చెల్లిస్తారనేది తర్వాత నిర్ణయం

  • ఇప్పటివరకైతే రెన్యువల్‌ ప్రీమియం చెల్లించని ప్రభుత్వం

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రైతు బీమా పథకం ఆగస్టు 13వ తేదీకి ముగిసిన నేపథ్యంలో.. ఆగస్టు 14 నుంచి రైతు మరణాల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు.. మంగళవారం (సెప్టెంబరు 8 వ తేదీ) నుంచి రైతుబీమా పోర్టల్‌ను తిరిగి తెరిచింది. క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో), మండల వ్యవసాయ అధికారుల(ఏవో)కు సర్క్యులర్‌ పంపించింది. ఈ నేపథ్యంలో.. ఏఈవోలు గతంలో మాదిరిగానే మరణించిన రైతుల వివరాలు నమోదు చేయనున్నారు. కేవలం రైతు కుటుంబాలకే కాక, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కుటుంబాలకూ సామూహిక బీమా పథకాన్ని అమలుచేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన విధివిధానాలేవీ ఇంతవరకూ ఖరారు కాలేదు. అయితే నవంబరు 19 తేదీ నుంచి అమలుచేస్తారనే చర్చ ప్రభుత్వవర్గాల్లో నడుస్తోంది. ఎలాగూ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుచేస్తే.. రైతు కుటుంబాలు కూడా అందులోనే కలుస్తాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని గత నెలలో నిలిపివేసింది. 2026-27 సంవత్సరానికి సంబంధించి రెన్యువల్‌ ప్రీమియంను సైతం చెల్లించలేదు. గత బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించలేదు. దీంతో ఆగస్టు 14 నుంచి రాష్ట్రంలో రైతుబీమా పథకం నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలులోకి తీసుకరాకముందే... రైతుబీమా పథకాన్ని నిలిపివేసిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆగస్టు 15న..‘రైతుబీమా బంద్‌’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అప్పటి నుంచి దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. .


ఈ నేపథ్యంలోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో రైతుబీమా పథకంలో ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా రైతు మరణాలను నమోదుచేయాలని మంగళవారం సూచించింది. మరణించిన రైతుకు 2025-26 పాలసీ సంవత్సరానికి చెల్లుబాటయ్యే ‘ఎల్‌ఐసీ- ఐడీ’ ఉండాలని.. 2026- 27 పాలసీ సంవత్సరానికి బీమా కవరేజీకి అర్హుడై ఉండాలని సూచించింది. అంటే సదరు రైతు 14 ఆగస్టు 1967 నుంచి 14 ఆగస్టు 2008 మధ్యకాలంలో జన్మించి ఉండాలి. అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్కుడై ఉండాలి. నమోదైనవివరాలను డివిజన్‌ స్థాయిలో, జిల్లాస్థాయిలో ప్రతిరోజు సమీక్షించాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు సూచించింది. జిల్లా వ్యవసాయ అధికారులు రైతుల మరణాల నమోదు పురోగతిని నిత్యం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీచేసింది.


చెల్లింపు ఎలా?

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎల్‌ఐసీతో ఒప్పందం కుదుర్చుకొని రైతుబీమా పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం చెల్లించింది. కానీ.. ఇప్పుడు ఎల్‌ఐసీతో అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు. వార్షిక బీమా ప్రీమియంగానీ, త్రైమాసిక ప్రీమియంగానీ చెల్లించలేదు. దీంతో పరిహారం ఎలా చెల్లిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుచేస్తే వీటిని అందులో కలిపేస్తారా? లేకపోతే రాష్ట్ర సాధరణ బడ్జెట్‌ నుంచి రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తారా? అనే చర్చ వ్యవసాయశాఖ వర్గాల్లో నడుస్తోంది.

Updated Date - Sep 09 , 2026 | 02:18 AM