Share News

మళ్లీ అవకాశమిస్తే.. బీఆర్‌ఎస్‌ అవినీతి ఏ స్థాయిలో ఉంటుందో!

ABN , Publish Date - Aug 28 , 2026 | 05:25 AM

అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ పార్టీకి మళ్లీ అధికారమిస్తే అవినీతి ఏ స్థాయిలో ఉంటుందో ప్రజలే ఆలోచించుకోవాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

మళ్లీ అవకాశమిస్తే.. బీఆర్‌ఎస్‌ అవినీతి ఏ స్థాయిలో ఉంటుందో!
Kavitha

  • వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన పార్టీకి మళ్లీ అధికారమా?

  • అధికారం తమదేనంటున్నా క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి వేరు

  • ఆంధ్రుల చేతిలో బందీగా సీఎం రేవంత్‌ రెడ్డి

  • తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ పార్టీకి మళ్లీ అధికారమిస్తే అవినీతి ఏ స్థాయిలో ఉంటుందో ప్రజలే ఆలోచించుకోవాలని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నేరాలను వ్యవస్థీకృతంగా చేసిన బీఆర్‌ఎ్‌సకు మళ్లీ అవకాశం ఇద్దామా? అని ప్రశ్నించారు. తామే అధికారంలోకి వస్తున్నామని బీఆర్‌ఎస్‌ పార్టీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌ పార్టీ అరాచకాలను ప్రశ్నించాల్సిన బీఆర్‌ఎస్‌ ఆంధ్రా దోస్తులు, వ్యాపారుల కోసం ప్రశ్నించడం లేదని కవిత ఆరోపించారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడంలో అధికార కాంగ్రెస్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే బలంగా పోరాడాల్సిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నామమాత్రంగా వ్యవహరిస్తూ తన బాధ్యతను విస్మరిస్తోందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ చాలా విషయాల్లో ప్రజలను ఇప్పటికీ మోసం చేస్తూనే ఉన్నాయని, అలాంటి పార్టీలకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వకూడదని ప్రజలను కవిత కోరారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి అవకాశమిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో కేటీఆర్‌ రియల్‌ ఎస్టేట్‌, హరీశ్‌రావు పాల వ్యాపారాలతో రూ.వేల కోట్లు గడించారని ఆరోపించారు.


ఆంధ్రావారి చేతిలో రేవంత్‌ బందీ....!

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆంధ్రుల చేతిలో బందీ అయ్యారని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ఆంధ్రా ఏజెంట్‌గా పనిచేస్తున్నారని కవిత ఆరోపించారు. ఇప్పటికీ కాంట్రాక్టులన్నీ ఆంధ్రావారికే ఇస్తున్నారని విమర్శించారు. రెడ్‌కో చైర్మన్‌, సీఎంవో కీలక విభాగాల్లో, అటు విద్యుత్‌, ఇరిగేషన్‌ శాఖల్లో ఆంధ్రా పెత్తనమే ఉందని ఆరోపించారు. బ్రాహ్మణ పరిషత్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా ఆంధ్రా వారిని నియమించారని, అటు యాదగిరిగుట్ట బోర్డు మెంబర్లలో ఆంధ్రా సినీ హీరో భార్యకు పదవి కట్టబెట్టారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించిన గుడిలో ఆంధ్రావాళ్లకు పెత్తనం ఎలా ఇస్తారని నిలదీశారు. ఇటీవల సీఎం అమెరికా టూర్‌కు కేంద్రం అనుమతి ఇవ్వకపోతే ఆయనకు తెలంగాణ గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే బ్రాహ్మణ పరిషత్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లుగా తెలంగాణ వారిని నియమించాలని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలను కూడా చదవండి

సస్పెన్షన్‌లోనే పీఎస్ఆర్‌ రిటైర్మెంట్‌!

‘జగనన్న కనెక్ట్స్‌'కు ఎదురు దెబ్బ

Updated Date - Aug 28 , 2026 | 05:41 AM