Share News

‘జగనన్న కనెక్ట్స్‌'కు ఎదురు దెబ్బ

ABN , Publish Date - Aug 26 , 2026 | 05:43 AM

సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. సోషల్‌ మీడియా పోస్టుల తొలగింపు వ్యవహారంపై విచారించేందుకు కోర్టు నిరాకరించింది. ఏపీ ప్రభుత్వం తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలైన..

‘జగనన్న కనెక్ట్స్‌'కు ఎదురు దెబ్బ

  • సోషల్‌ మీడియా పోస్టుల తొలగింపుపై పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

  • దీనిపై జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం

  • వైసీపీకి దక్కని ఊరట

న్యూఢిల్లీ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. సోషల్‌ మీడియా పోస్టుల తొలగింపు వ్యవహారంపై విచారించేందుకు కోర్టు నిరాకరించింది. ఏపీ ప్రభుత్వం తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలైన ‘జగనన్న కనెక్ట్స్‌’(ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, ఎక్స్‌) నుంచి పోస్టులను తొలగించడం, బ్లాక్‌ చేయడాన్ని సవాలు చేస్తూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. శ్రేయ సింఘాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(2014) కేసు తీర్పు నిబంధనలకు విరుద్ధంగా, రాష్ట్ర ప్రభుత్వం తమ అధికారిక ఖాతాల నుంచి సోషల్‌ మీడియా పోస్టులను తొలగించేలా చేస్తోందని పేర్కొంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 కింద వైసీపీతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కర్నూలులో మద్యం బెల్ట్‌ షాపుల వల్ల జరిగిన ఉదంతంపై 2025, అక్టోబరు 26న తమ ఎక్స్‌ ఖాతాలో ఒక పోస్ట్‌ చేశామని వైసీపీ తన పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా, ఏపీ సీఎంని అపహాస్యం చేసేలా పోస్టు పెట్టారని ఆరోపిస్తూ నేతలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని తెలిపింది. ఈ అంశంపై వరుసగా పోస్టులు పెడుతుండటంతో మరిన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని, ఆపై కర్నూలు రూరల్‌ సర్కిల్‌ ఇన్‌ స్పెక్టర్‌ జనవరి 27న ఎక్స్‌కు నోటీసు ఇచ్చి యూఆర్‌ఎల్‌లను తొలగించాలని కోరారని వైసీపీ తెలిపింది. ఈ సెన్సార్‌షి్‌పను ప్రశ్నిస్తూ మరోసారి ఎక్స్‌లో పోస్టు చేయగా, ఐటీ చట్టంలోని సెక్షన్‌ 79(3)(బీ) ఆధారంగా నోటీసు ఇచ్చి, 36 గంటల్లోగా ఆ ఖాతాలు, పోస్టులను తొలగించకపోతే ఐటీ చట్టం కింద లభించే రక్షణ(సేఫ్‌ హార్బర్‌ు) ఉపసంహరించుకుంటామని హెచ్చరించారని ఆరోపించింది.


శ్రేయ సింఘాల్‌ కేసులో తీర్పు ప్రకారం.. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69(ఏ) కింద కేంద్ర ప్రభుత్వ అధికారి లేదా తగిన న్యాయస్థానం(కోర్టు) ఆదేశాల ద్వారా మాత్రమే కంటెంట్‌ను బ్లాక్‌ చేయడానికి లేదా తొలగించడానికి అవకాశం ఉందని తెలిపింది. తమకు ఆ విధమైన ఆదేశాలు అందలేదని వైసీపీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, ఎక్స్‌ సంస్థ, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, గూగుల్‌ ఎల్‌ఎల్‌సీలను ప్రతివాదులుగా చేర్చింది. ఆ పిటిషన్‌ మంగళవారం జస్టిస్‌ దీపంకర్‌ దత్తా, జస్టిస్‌ శీల్‌ నాగులతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే, ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, వైసీపీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌. నిరంజన్‌ రెడ్డి హాజరై హైకోర్టును ఆశ్రయించడానికి అనుమతి ఇవ్వాలని కోరగా.. ధర్మాసనం అంగీకరించింది. రిట్‌ పిటిషన్‌ను ‘డిస్మి్‌సడ్‌ యాస్‌ విత్‌ డ్రా’గా పేర్కొంటూ విచారణను ముగించింది.

Updated Date - Aug 26 , 2026 | 06:04 AM