ధాన్యం కొనేదెప్పుడు?
ABN , Publish Date - May 28 , 2026 | 03:26 AM
రుతుపవనాలు తరుముకొస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాలు కూడా మొదలయ్యాయి. ఈ సమయంలో మామూలుగా అయితే రైతుల్లో ఆనందం కనిపించాలి. కానీ, అన్నదాత కళ్లల్లో ఆందోళన కనిపిస్తోంది.
వర్షాలు పడుతుండటంతో రైతుల్లో ఆందోళన.. వెంటనే కొనుగోలు చేయాలని నిరసనలు
కాంటా వేసినా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు
వాటిని లారీల్లో తరలించే వరకు రైతులకు రాని రసీదులు
రసీదు వచ్చేవరకు ధాన్యం బాధ్యత అన్నదాతలదే
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రుతుపవనాలు తరుముకొస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాలు కూడా మొదలయ్యాయి. ఈ సమయంలో మామూలుగా అయితే రైతుల్లో ఆనందం కనిపించాలి. కానీ, అన్నదాత కళ్లల్లో ఆందోళన కనిపిస్తోంది. యాసంగి పంట కొనుగోళ్లు పూర్తికాకపోవటంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎక్కడ మట్టిపాలవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని తమ పంటను వెంటనే కొనుగోలు చేయాలని నిరసనలకు దిగుతున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మంబాపూర్, జనగాం, మన్‌సాన్‌పల్లి గ్రామాల్లో డీసీఎమ్మెస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనగాం కొనుగోలు కేంద్రం నుంచి ఇప్పటివరకు మూడు లారీల ధాన్యం మాత్రమే తరలించారు. దాదాపు రెండువేల బస్తాల ధాన్యం కాంటా వేసి వారాలు గడుస్తున్నా.. అక్కడి నుంచి తరలించలేదు. కాంటా వేసినా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నుంచి తరలిస్తేనే అధికారులు రైతులకు రసీదులు ఇస్తున్నారు. అప్పటివరకు ధాన్యం బాధ్య త కూడా రైతులదే. మంగళవారం రాత్రి కురిసిన వానకు వడ్లు తడిసిపోవటంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. బుధవారం తాండూరు-హైదరాబాద్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. డీసీఎమ్మెస్ అధికారులు వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టడంతో అప్పటికప్పుడు డీసీఎమ్మెస్ అధికారిని మంబాపూర్‌కు పిలిపించి రైతులకు హామీ ఇప్పించారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్‌లో రైతులు ధాన్యం బస్తాలను రోడ్డుపై వేసి నిప్పంటించారు. ఎప్పటికప్పుడు లారీలు పంపి కాంటా వేసిన బస్తాలను తరలించాలని డిమాండ్ చేశారు.
బొక్క్‌సగామ్ పీఏసీఎస్ వద్ద ఉద్రిక్తత
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం బొక్క్‌సగామ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సొసైటీ చైర్మన్, కార్యదర్శి అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై విచారణ నిర్వహించేందుకు వచ్చిన నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతిని రైతులు అడ్డుకున్నారు. పీఏసీఎ్‌సను కాదని ఐకేపీ ద్వారా ధాన్యం, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ ద్వారానే కొనుగోళ్లు జరపాలని విన్నవించారు. అయి తే, విచారణ పూర్తయ్యేవరకు ఐకేపీ ద్వారానే కొనుగోళ్లు జరుగుతాయని సబ్ కలెక్టర్ స్పష్టంచేయటంతో ఆగ్రహించిన రైతులు ఆమె కారును అడ్డుకున్నారు. పోలీసులు రైతులను చెదరగొట్టి సబ్ కలెక్టర్ వాహనాన్ని అక్కడి నుంచి పంపించారు. సబ్ కలెక్టర్ వెళ్లిన తర్వాత అక్రమాలపై ఫిర్యాదు చేసిన రైతులపై, మరో వర్గం రైతులు దాడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మొక్కజొన్న డబ్బుల కోసం రైతుల ఎదురుచూపు
యాసంగి సీజన్‌లో మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ రెండో వారం నుంచి మొక్కజొన్న పంట కొనుగోలు చేయగా, ప్రభుత్వం ఇప్పటివరకు తమ ఖాతాల్లో డబ్బు జమ చేయలేదని రైతులు తెలిపారు. మక్కల కొనుగోళ్ల కోసం ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు బ్యాంకు గ్యారంటీ ఇచ్చినప్పటికీ, రుణం విడుదల కాకపోవడంతో రైతులకు చెల్లింపులు నిలిచిపోయాయి. మరోవైపు కొనుగోలు చేసిన మొక్కజొన్నను నిల్వ చేసేందుకు సరిపడా గోదాములు లేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో యాసంగి సీజన్‌లో 7,141 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. మక్కల కొనుగోలు కోసం జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్, వేమనపల్లి మండలాల్లో ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఈ నెల 26వ తేదీ వరకు 1,648 మంది రైతుల నుంచి 83,775 క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేశారు. కానీ, ఇప్పటివరకు రైతులకు డబ్బు చెల్లించలేదు. మొక్కజొన్న క్వింటాలుకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) రూ.2,400 ఉంది. ఆ లెక్కన జిల్లాలో రైతులకు రూ.34.90 కోట్లు జమ చేయాల్సి ఉంది.
మక్క రైతులకు 1,173 కోట్లు విడుదల:తుమ్మల
యాసంగి సీజన్‌లో మార్క్‌ఫెడ్‌కు మొక్కజొన్నలు అమ్మిన రైతులకు రూ. 1,173 కోట్లు విడుదలచేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సుమారు లక్ష మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమచేస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యాసంగిలో రికార్డు స్థాయిలో రైతులు 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారని, 338 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 13.42 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలుచేసినట్లు వెల్లడించారు. 2.42 లక్షల మంది రైతుల నుంచి మక్కలు కొనుగోలుచేయగా... లక్ష మందికి రూ.1,173 కోట్లు విడుదలచేసినట్లు వివరించారు. మక్కల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3,757 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మక్కల కొనుగోళ్లపై వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, మార్క్ ఫెడ్ ఎండీ రాహుల్ రాజ్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపితో మంత్రి సమీక్ష నిర్వహించారు.
తడిసిన ధాన్యం కూడా కొంటాం: మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కొనుగోలుచేసిన తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు, పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో బుధవారం ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటివరకు అకాల వర్షాలకు తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేసి రైస్‌మిల్లులకు తరలించినట్లు తెలిపారు. ఇసుక లారీలను కూడా ధాన్యం రవాణాకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుచేసి, 8.15 లక్షల మంది రైతులకు రూ.10,097 కోట్లు చెల్లించినట్లు వివరించారు. 75లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యంలో 44.67 లక్షల టన్ను లు దొడ్డు రకాలు, 12.33 లక్షల టన్నులు సన్నరకాలు ఉన్నట్లు మంత్రి చెప్పారు.