Share News

ఉద్యోగులకు ఆరోగ్య పథకం.. నేటి నుంచి అమలు

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:40 AM

రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులకు మంగళ వారం నుంచి గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో వైద్య సేవలందించేలా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు స్పష్టం చేశారు.

ఉద్యోగులకు ఆరోగ్య పథకం.. నేటి నుంచి అమలు

  • 2 రోజుల్లో ట్రస్టు ఏర్పాటు.. వారంలో మార్గదర్శకాల విడుదల

  • ఉద్యోగ సంఘాలతో చీఫ్‌ సెక్రటరీ కె.రామకృష్ణారావు సమావేశం

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులకు మంగళ వారం నుంచి గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో వైద్య సేవలందించేలా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు స్పష్టం చేశారు. హెల్త్‌ కేర్‌ ట్రస్టు ద్వారా ఇందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉద్యోగ సంఘాలకు తెలిపారు. రెండురోజుల్లో ట్రస్టు ఏర్పాటు చేస్తున్నామని, వారంలోగా విధివిధానాలు ఖరారు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా మూల వేతనం నుంచి 1.5 శాతం కోత విధించడంపై ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సభ్యులు, ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు, పింఛనుదారులు,వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ట్రస్టు స్వయంప్రతిపత్తితో, పారదర్శకంగా సేవలందిస్తుందన్నారు. ట్రస్టు కోసం ప్రత్యేక బ్యాంకుఖాతా తెరిచి అందులో ప్రభుత్వ, ఉద్యోగుల వాటాలను జమ చేయనున్నట్లు వివరించారు. ట్రస్టు నిర్వహణ, సేవలు, ఫిర్యాదుల వ్యవస్థ తదితర అంశాలపై ఉద్యోగులు సూచనలు చేశారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బెనహర్‌ మహేశ్‌, దానకిశోర్‌, ప్రధాన కార్యదర్శులు సందీప్‌కుమార్‌ సుల్తానియా, క్రిస్టినాజోంగ్తు, యోగితారాణా, రెవెన్యూ శాఖకార్యదర్శి లోకేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

రెండు, మూడు రోజుల్లో కమిటీ ఏర్పాటు

ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు, పర్యవేక్షణ కోసం రెండు, మూడు రోజుల్లో ప్రత్యేక ఈహెచ్‌ఎస్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపిందని ఐకాస ఛైర్మన్‌ మారంగ జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావు ఒక ప్రకటనలో తెలిపారు. సకాలంలో వైద్య సేవలను అందించేందుకే ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5 శాతం కోత విధించినట్లు సీఎస్‌ తెలిపారన్నారు. కాగా భార్య, భర్త ఉద్యోగులుగా ఉంటే ఒకరి వేతనం నుంచే కోత విధించాలని, పోలీసు, ఎక్సైజ్‌ శాఖల్లో వేర్వేరు పేర్లతో ఆరోగ్య పథకాలు అమలు చేస్తున్నారని, ప్రస్తుత ఈహెచ్‌ఎస్‌లో మినహాయింపు ఇస్తారా అని ఐకాసా ప్రశ్నించింది. ఆయుష్‌ ఆసుపత్రుల్లో అవకాశం కల్పించాలని, కుటుంబ సభ్యులను పరిగణించే క్రమంలో సోదరి, సోదరులను కూడా అనుమతించాలని, దంపతుల్లో ఒకరు ఉద్యోగి, ఒకరు పింఛనుదారుగా ఉంటే ఎవరి వేతనం నుంచి కోత ఉంటుందో స్పష్టత ఇవ్వాలని, ఏడాదికి ఒకసారి ఆరోగ్య పరీక్షలకు అవకాశం కల్పించాలని, అలాగే ఇతర రాష్ట్రాల్లో చికిత్సకు అనుమతిస్తారా లేదా స్పష్టత ఇవ్వాలని, చికిత్స ప్యాకేజీ పరిమితి ఎంతో తెలపాలని కోరారు. టీఎ్‌సయూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్‌... ఉద్యోగులకు సమాచారం ఇవ్వకుండా వేతనాల కోత విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - Jun 02 , 2026 | 04:40 AM