Share News

సినిమా పైరసీ కేసు.. జైలు నుంచి విడుదలైన ‘ఐబొమ్మ’ రవి..

ABN , Publish Date - Feb 18 , 2026 | 08:00 PM

సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ రవికి మంగళవారం తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు బుధవారం అతడు చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు.

సినిమా పైరసీ కేసు.. జైలు నుంచి విడుదలైన ‘ఐబొమ్మ’ రవి..
iBomma Ravi

ఇంటర్‌నెట్ డెస్క్: సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ రవి అలియాస్ ఇమంది రవికి నిన్న(మంగళవారం) తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు (బుధవారం) అతడు చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు. నిన్న కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఆర్డర్ కాపీలో ఏముందంటే..


‘హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదు. సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి చర్యలకు పాల్పడరాదు. వ్యక్తిగత బాండ్‌, పూచీకత్తులు సమర్పించాలి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు సైబర్‌ క్రైం పోలీస్ స్టేషన్ (సీసీఎస్)లో హాజరుకావాలి. అనుమతి లేకుండా కాపీరైట్ కంటెంట్ అప్‌లోడ్, షేర్ చేసే వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లతో సంబంధం ఉండరాదు. వీపీఎన్, ప్రాక్సీ వంటి ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్ ఫామ్‌‌లు ఉపయోగించరాదు. అవసరమైతే డిజిటల్ పరికరాల ఫోరెన్సిక్ పరీక్షకు సహకరించాలి. షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేసి ప్రాసిక్యూషన్‌ చేసేందుకు స్వేచ్ఛ ఇస్తాము’ అని నిందితుడు ఐ బొమ్మ రవికి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.




కాగా, సినిమా పైరసీ, కాపీ రైట్‌, ఐటీ యాక్ట్‌తో పాటు మనీ లాండరింగ్‌ సహా.. మొత్తం ఐదు కేసుల్లో ఇమంది రవి నిందితుడిగా ఉన్నాడు. అతడు రెండు రకాలుగా సినిమా ప్రింట్‌‌లను కొనుగోలు చేసేవాడు. నార్మల్ ప్రింట్‌కు 100 డాలర్లు, హెచ్‌డీ ప్రింట్‌కు 200 డాలర్లు చెల్లించేవాడు. అతడికి సంబంధించిన ఏడు ఖాతాలను పోలీసులు గుర్తించారు. వాటిలో రూ.13.40 కోట్ల నగదు ఉన్నట్లు కనుగొన్నారు. బెట్టింగ్ యాడ్‌ల ద్వారా రూ.1.78 కోట్లు కూడబెట్టినట్లు గుర్తించారు. ఇక ఐబొమ్మ రవి సోదరి చంద్రికకు రూ. 90 లక్షల నగదు పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.


ఇవి కూడా చదవండి

పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ఇండియా ఏఐ సమ్మిట్‌కు అద్భుతమైన రెస్పాన్స్.. మరో రోజు పొడిగింపు..

Updated Date - Feb 18 , 2026 | 09:09 PM