విద్యార్థుల నుంచే ఫీజు వసూలు
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:46 AM
కాలేజీల్లో ఫీజుల వసూలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఫీజులను కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచే వసూలు చేసుకోవచ్చని......
2026-27 విద్యాసంవత్సరం నుంచి చేసుకోవచ్చు
హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు
పిటిషన్ వేసిన 15 కాలేజీలకే ఈ వెసులుబాటు
తుది తీర్పు భిన్నంగా ఉంటే ఫీజు వాపస్ ఇవ్వాలని స్పష్టీకరణ
కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్న మరిన్ని కాలేజీలు
రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ప్రైవేటు కాలేజీల పోరుబాట
హైదరాబాద్, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): కాలేజీల్లో ఫీజుల వసూలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై హైకోర్టు శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఫీజులను కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచే వసూలు చేసుకోవచ్చని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ప్రకటించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం సకాలంలో చెల్లించటం లేదని, అందువల్ల ఫీజులను విద్యార్థుల నుంచే వసూలు చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని 15 కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొత్తం ఫీజును విద్యార్థుల నుంచే వసూలు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పిటిషన్ వేసిన కాలేజీలకు మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టంచేసింది. అయితే, తుది తీర్పునకు లోబడి ఫీజుల వసూలు విధానం ఉంటుందని స్పష్టంచేసింది. తుదితీర్పు మధ్యంత ఉత్త్తర్వులకు భిన్నంగాఉంటే విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులను కాలేజీలు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అంతకు ముందు 15 ప్రైవేటు కాలేజీల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలలో ప్రభుత్వం విపరీత జాప్యం చేస్తుండటంతో కాలేజీలను నడపలేకపోతున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఉన్న నిబంధనల ప్రకారం కాలేజీలు విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు చేసుకోలేవని, ప్రభుత్వం ఇస్తేనే స్వీకరించాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఇలాగైతే కాలేజీల నిర్వహణ అసాధ్యమని అన్నారు. ప్రభుత్వం ఇవ్వకపోతే కాలేజీలకే నేరుగా వసూలు చేసుకొనే హక్కు ఇవ్వాలని, ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తే 18 శాతం వడ్డీ ఇవ్వాలని, ఆ మొత్తం ప్రభుత్వం నేరుగా విద్యార్థులకే చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనల అనంతరం పిటిషనర్లకు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకొనే అవకాశం ఇస్తూ ధర్మాసనం మధ్యంతర ఆదేశాలిచ్చింది.
ఫీజు బకాయిల కోసం మళ్లీ పోరుబాట
ఈ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర ప్రైవేటు కాలేజీ కూడా ఇదే విధమైన ఉత్తర్వుల కోసం హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాయి. దీనిపై యాజమాన్యాలు శుక్రవారం సమావేశమై నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఫీజు బకాయిల వసూలు కోసం మళ్లీ ఆందోళనలు చేపట్టాలని తెలంగాణ ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘాల సమాఖ్య (ఫాతీ) నిర్ణయించింది. శుక్రవారం నగరంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఫాతీ చైౖర్మన్ రమేశ్ బాబు తదితరులు పాల్గొని గతంలో మంత్రులు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిల కమిటీతో వెంటనే భేటీ కావాలని ఫాతీ నిర్ణయించింది. వారినుంచి సానుకూల నిర్ణయం రాకుంటే 11న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి తదుపరి కార్యచరణ ప్రకటించాలని సమావేశంలో తీర్మానించారు.