తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ పి.సామ్ కోషీ
ABN , Publish Date - Oct 06 , 2026 | 02:44 AM
కొత్త చీఫ్ జస్టిస్‌ను నియమించే వరకు తెలంగాణ హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పి.సామ్ కోషీని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించారు
హైదరాబాద్/న్యూఢిల్లీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్.. సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందడంతో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ పదవికి ఖాళీ ఏర్పడింది. కొత్త చీఫ్ జస్టిస్‌ను నియమించే వరకు హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పి.సామ్ కోషీని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించారు. ఈ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన జస్టిస్ సామ్ కోషీ 1967 ఏప్రిల్ 30న జన్మించారు. 1987లో డిగ్రీ, 1990లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకకుని 1991లో న్యాయవాదిగా నమోదు చేసుకుని మధ్యప్రదేశ్ హైకోర్టు (జబల్‌పూర్ బెంచ్)లో 2000 సంవత్సరం వరకు ప్రాక్టీస్ చేశారు. 2000లోఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో 2013 వరకు ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. సివిల్, కాన్‌స్టిట్యూషనల్, లేబర్ విభాగాల్లో విస్తృతంగా కేసులు వాదించడంతోపాటు ప్రభుత్వ న్యాయవాదిగా డిప్యూటీ అడ్వకేట్ జనరల్‌గా హిదయతుల్లా నేషనల్ లా కాలేజీ అకడమిక్ కౌన్సిల్, జనరల్ కౌన్సిల్ మెంబర్‌గా పనిచేశారు. 2013 సెప్టెంబరు 16న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2016లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. 2023లో తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. కాగా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్‌కు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో జస్టిస్ ఏకే సింగ్‌ను సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్ కుమార్ కలిసి అభినందనలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.
ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్