Share News

అకాల వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ హై అలర్ట్..

ABN , Publish Date - May 04 , 2026 | 07:45 PM

అకాల వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు ఎలాంటి నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.

అకాల వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ హై అలర్ట్..
Telangana Rains Alert

హైదరాబాద్, మే 04: అకాల వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ధాన్యం కొనుగోళ్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు.


ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 14.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.2001.96 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. రానున్న 3 నుంచి 4 రోజుల పాటు అకాల వర్షాలు పడే అవకాశం ఉంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఈదురుగాలులు, వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున నల్గొండ, నిజామాబాద్ జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైనన్ని తార్పాలిన్లు (పాలీథిన్ కవర్లు) సిద్ధంగా ఉంచాలి. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా ఉండేలా అధికారులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’ అని అన్నారు.

Updated Date - May 04 , 2026 | 07:47 PM