Share News

కుల సమాఖ్యలకు చైర్మన్ల ఖరారు

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:45 AM

బ్రాహ్మణ, కమ్మ, రజక తదితర 17 కులాల అభివృద్ధికి సంబంధించిన కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్మన్ల నియామకం ఖరారైంది. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌...

కుల సమాఖ్యలకు చైర్మన్ల ఖరారు

  • 17 కులాల అభివృద్ధికి సంబంధించిన కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు నియామకం

  • రెండు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు!.. సీఎం రేవంత్‌ రెడ్డితో మహేశ్‌ గౌడ్‌, మీనాక్షి భేటీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): బ్రాహ్మణ, కమ్మ, రజక తదితర 17 కులాల అభివృద్ధికి సంబంధించిన కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్మన్ల నియామకం ఖరారైంది. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ల భేటీలో ఈ నియామకాలు ఖరారయ్యాయి. చైర్మన్లకు సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నిర్మాణం, నామినేటెడ్‌ పదవులు, ఇతర అంశాలపైనా చర్చించేందుకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డితో ఆయన నివాసంలో మీనాక్షీ నటరాజన్‌, మహేశ్‌గౌడ్‌ భేటీ అయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. పార్టీ నిర్మాణం, నామినేటెడ్‌ పదవుల అంశాలపైనా ఈ భేటీలో చర్చించారు. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా ఉన్న వారి పనితీరునూ సమీక్షించారు. పనితీరు బాగాలేని వారిని, డీసీసీ అధ్యక్షులు.. ఇతర పదవుల్లో ఉన్నవారిని తొలగించి కొత్తవారిని నియమించాలన్నదానిపై సమీక్షించారు. బూత్‌ స్థాయి నుంచి పార్టీ నిర్మాణంపైనా చర్చించారు. ముఖ్యంగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్‌, కోశాధికారి తదితర నియామకాలపైన సమీక్షించారు. రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మహిళ వర్గాల నుంచి కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించాలనుకున్నారు. కార్యనిర్వాహక అధ్యక్షులతో పాటుగా ప్రచార కమిటీ చైర్మన్‌, కోశాధికారి, ఇతర పదవుల్లో నియామకాలకు సంబంధించి పేర్లను షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఆమోదం కోసం అధిష్ఠానానికి పంపాలని నిర్ణయించారు. నియోజకవర్గ పునర్‌ విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు, అందులో భాగంగా తెలంగాణకు అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలన్నదానిపైనా నేతలు చర్చించుకున్నారు. ఇటీవలి కాలంలో పలువురు మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలపైనా సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షీ నటరాజన్‌లు సమీక్ష చేసినట్లు సమాచారం. మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ, పార్టీ ప్రక్షాళనకు మే నెలలో అధిష్ఠానం ముహూర్తం పెట్టిందన్న వార్తల నేపథ్యంలో సీఎం రేవంత్‌, మీనాక్షి, మహేశ్‌ గౌడ్‌ సుదీర్ఘంగా భేటీ అవ్వడం ఆసక్తికరంగా మారింది.

Updated Date - Apr 16 , 2026 | 03:45 AM