తల్లిదండ్రులకు సర్కారు భరోసా
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:07 AM
జన్మనిచ్చిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురి కాకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
బిల్లు పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులూ
వృద్ధాప్యంలో నిరాదరణకు గురికాకుండా రక్షణ
‘తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్- 2026’ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతం నుంచి 15 శాతం లేదా
రూ.10 వేలు కోత.. ప్రభుత్వమే వసూలు చేసి ఇచ్చేలా నిబంధన
కుమారులు లేని పక్షంలో ఉద్యోగం చేసే కుమార్తె పోషించాల్సిందే
కొడుకు మరణిస్తే అత్తమామల బాధ్యత కోడలిదే..
మరో మూడు కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం
మెట్రో స్వాధీనానికి చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయం
కుల సర్వేపై నిపుణల కమిటీ ఇచ్చిన నివేదిక అధ్యయనానికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): జన్మనిచ్చిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురి కాకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కన్న బిడ్డలే విధిగా తమ తల్లిదండ్రుల ఆలనా పాలనా చూసే విధంగా రూపొందించిన బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది. తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి నెలకు 15 శాతం లేదా రూ.10 వేలు.. వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని వారి తల్లిదండ్రులకు అందజేసే ‘తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్- 2026’ బిల్లును ఆమోదించింది. సోమవారం సాయంత్రం అసెంబ్లీలోని కమిటీ హాలు-1లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 4 కీలక బిల్లులకు ఆమోదం లభించింది. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో కుల వివక్ష నిర్మూలనకు ఉద్దేశించిన ‘రోహిత్ వేముల’ చట్టం విధివిధానాల రూపకల్పన కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సబ్ కమిటీలో మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటంపై క్యాబినెట్‌లో చర్చించారు. అలాగే సామాజిక, ఆర్థిక, కుల సర్వే నివేదికను పరిశీలించేందుకు క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని గిగ్, ఫ్లాట్‌పామ్ కార్మికుల (క్యాబ్ డ్రైవర్లు, ఈ-కామర్స్ సంస్థల్లో పనిచేసే డెలివరీ బాయ్స్ తదితరులు) సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్) చట్టం-2026’ బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. న్యాయవాదులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ‘తెలంగాణ అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్-2026’ బిల్లుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ముదిమి వయసులో కష్టాలు పడకుండా..
జీవితంలో మంచిగా స్థిరపడిన బిడ్డలు కూడా తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తల్లిదండ్రుల భద్రత బిల్లును తెచ్చింది. అస్సాంలో అమలులో ఉన్న ప్రణామ్ చట్టం స్ఫూర్తితో దీనిని రూపొందించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ బిల్లును సిద్ధం చేసింది. ఈ బిల్లు పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతోపాటు ప్రజా ప్రతినిధులను కూడా తీసుకురావటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షేమం, నిర్వహణ చట్టం-2007 ప్రకారం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలు.. నెలకు రూ.10 వేల వరకు తల్లిదండ్రులకు కనీస అవసరాల కింద చెల్లించాలని చెల్లించాలని ఆదేశించే అధికారం ట్రిబ్యునళ్లకు ఉంది. అయితే, ట్రిబ్యునళ్లు అలాంటి ఆదేశాలిచ్చినా.. వాటి అమలు కోసం వృద్ధాప్యంలో అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లును రూపొందించింది. పిల్లలను తమ వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి వేతనాల నుంచి ప్రతి నెలా 15 శాతం లేదా రూ.10 వేలు.. ఇందులో ఏది తక్కువ అయితే ఆ మోత్తం నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాకు మళ్లించే అధికారం ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్రంలోని దాదాపు 10.50 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. రాష్ట్రంలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా బిల్లు పరిధిలోకి తెచ్చారు. ప్రజాప్రతినిధులు కూడా దీని పరిధిలోకి వస్తారు. దంపతులకు కుమారుడు లేకపోతే ఉద్యోగం చేస్తున్న కుమార్తెలు వారిని పోషించాల్సి ఉంటుంది. కుమారుడు మరణిస్తే ఉద్యోగి అయిన కోడలు పోషించాల్సి ఉంటుంది. కోడలు ఉద్యోగి కాని పక్షంలో కుమారుడికి వచ్చే పెన్షన్ నుంచి అత్తమామలకు కొంత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చట్టం అమలు కూడా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోనుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు దీనిని అమలు చేస్తారు. అక్కడ న్యాయం జరగకపోతే రాష్ట్రస్థాయిలో ఉండే కమిషన్‌కు బాధితులు అప్పీల్ చేసుకోవచ్చు. ఈ కమిషన్‌కు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చైర్మన్‌గా ఉంటారు. బాధ్యతారహితంగా వ్యహరించే కలెక్టర్లకు సమన్లు జారీచేసే అధికారం కూడా ఈ కమిషన్‌కు ఉంటుంది. ఈ కమిషన్‌కు కొన్ని న్యాయాధికారాలు కూడా కల్పించారు.
విద్వేష ప్రసంగాలు ఇక చెల్లవ్
రాష్ట్రంలో విద్వేష ప్రసంగాలను నిరోధించే ‘విద్వేష ప్రసంగాలు, నేరాల నిరోధక బిల్లు (తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ యాక్ట్)- 2026 బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. సోషల్ మీడియాలో మత సామరస్యానికి భంగం కలిగించే పోస్టులు పెట్టడం.. ఘర్షణలకు ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. దీని ప్రకారం తొలిసారి విద్వేష ప్రసంగం చేసేవారికి ఏడేళ్ల జైలు, 50 వేల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి అదే నేరం చేస్తే పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తారు.
మెట్రో స్వాధీనానికి చర్యలు వేగవంతం
హైదరాబాద్‌లో ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర ఉన్న మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను ఎల్ అండ్ టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకునే చర్యలను వేగవంతం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. మెట్రోపై ఉన్న రుణభారం సహా మొత్తం రూ.15 వేల కోట్లు ప్రభుత్వం ఎల్ అండ్ టీకి చెల్లించి స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వం తరఫున ఈ నిధుల చెల్లింపులు, లావాదేవీలు నిర్వర్తించే బాధ్యతను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు అప్పగించగా, దీనిని నోడల్ ఏజెన్సీగా నియమించేందుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నిర్వహించిన కుల సర్వే నివేదికను అధ్యయనం చేయడానికి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2024 నవంబర్ 6 నుంచి డిసెంబరు 25 వరకు 50 రోజులపాటు కుల సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, నిపుణల కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేసింది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వాకిటి శ్రీహరి సభ్యులుగా ఉన్నారు.