Share News

అన్నదాతను ఎలా ఆదుకుందాం?

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:46 AM

ఎల్‌నినో దెబ్బకు కరువు పరిస్థితులు ఏర్పడటం, యాసంగి పంటలకు సాగునీటి భరోసా లేని నేపథ్యంలో రైతులను ఎలా ఆదుకోవాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది.

అన్నదాతను ఎలా ఆదుకుందాం?
karuvu

  • రైతుభరోసా వేద్దామా? కరువు సాయం చేద్దామా?.. ఆరుతడి పంటలకు ప్రోత్సాహం చెల్లిద్దామా!

  • పంటలు సాగుచేయకపోయినా పరిహారం ఇద్దామా?

  • కేంద్రం నుంచి ఏ మేరకు సహకారం అందుతుంది?

  • యాసంగి సీజన్‌ సాగుపై ప్రభుత్వంలో తర్జనభర్జన

హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో దెబ్బకు కరువు పరిస్థితులు ఏర్పడటం, యాసంగి పంటలకు సాగునీటి భరోసా లేని నేపథ్యంలో రైతులను ఎలా ఆదుకోవాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. రైతుభరోసా వేయాలా? కరువు సాయం అందించాలా? లేదంటే ఆరుతడి పంటలకు ప్రోత్సాహం ఇవ్వాలా? పంటలు సాగు చేయకపోయినా పరిహారం చెల్లంచాలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిపై ఇప్పటికిప్పుడు కాకపోయినా.. రాబోయే ఒకటి, రెండు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని, ఇందుకోసం ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కరువు నేపథ్యంలో.. రాష్ట్రంలో యాసంగి పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. చెరువులు, కుంటలు, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, వానాకాలంలో లోటు వర్షపాతం నమోదు కావడంతో.. వానాకాలం సాగు అతికష్టమ్మీద గట్టెక్కుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యాసంగిలో పంటలు సాగుచేసే అవకాశాలు కనిపించడంలేదు. అయితే బోర్లు, బావులు, నీటిలభ్యత ఎక్కువగా ఉన్న రైతులు మాత్రం ఎంతో కొంత పంటలు సాగుచేసేందుకు పూనుకుంటున్నారు. పూర్తిగా నీటి లభ్యత లేని రైతులు పంట విరామానికి సిద్ధమవుతున్నారు. కాగా, గతేడాది యాసంగిలో రాష్ట్రంలో 92.17 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేశారు. ఇందులో 65.42 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. వాస్తవానికి యాసంగిలో సాధారణ సాగు విస్తీర్ణం 68.67 లక్షల ఎకరాలు మాత్రమే. కానీ, గతేడాది 34 శాతం ఎక్కువగా సాగు చేశారు. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నైరుతి వర్షాల్లోనే 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 365 కరువు మండలాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో యాసంగిలో చాలా తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.


రైతుభరోసాపై ఏం చేద్దాం?

రాష్ట్రవ్యాప్తంగా 70.40 లక్షల మంది పట్టాదారులున్నారు. వీరికి వానాకాలం, యాసంగి సీజన్లలో రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద ఎకరానికి రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తోంది. ఇందులో భాగంగా గత వానాకాలం సీజన్‌లో సుమారు రూ.9 వేల కోట్లు పంపిణీ చేసింది. అయితే ఈ యాసంగిలో రైతుభరోసా చెల్లించాలా? వద్దా? అనే విషయంపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, సాగు భూముల్లో పంటలు పండిచే రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని.. పంటలు వేయకపోయినా ఎలా చెల్లిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఇంకా రెండు నెలల సమయం ఉండడంతో.. అప్పటివరకు మంత్రివర్గ సమావేశాల్లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే వీలుంది. ఒకవేళ రైతులు గతంలో సాగు చేసినంత కాకుండా... తక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తే వారికి రైతుభరోసా పంపిణీ చేయాల్సి వస్తుందా? లేకపోతే అందరు రైతులకూ మినహాయింపు ఇచ్చి పంటలు వేయకపోయినా రైతుభరోసా ఇద్దామా? అనే అంశం కూడా ప్రభుత్వంలో చర్చకు వస్తోంది. ఇలా కాకుండా రైతులకు కరువు సాయం చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాధారణంగా అతివృష్టితోనో, అనావృష్టితోనే రైతులు నష్టపోతే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది. గడిచిన మూడేళ్లలో పంట నష్టం ఎప్పుడు జరిగినా... ఎకరానికి రూ. 10 వేల చొప్పున పరిహారం పంపిణీ చేసింది. ఇప్పుడు పంటలు వేయటమే సాధ్యంకావటంలేదు. మరి అదే లెక్కన నష్టపరిహారం చెల్లిస్తుందా? లేదంటే ఎంతో కొంత పరిహారాన్ని ఖరారు చేసి ఇస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ కోటిన్నర ఎకరాలకు రూ.10వేల చొప్పున లెక్కేస్తే రూ.15వేల కోట్లు, రూ.5వేల చొప్పున లెక్కేస్తే... రూ.7,500కోట్లు అవసరమవుతాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని నష్టపరిహారం ఖరారుచేసే అవకాశాలుంటాయి.


ఆరుతడి పంటలకు ప్రోత్సాహం?

రాష్ట్రంలో వరి సాగువిస్తీర్ణం అసాధారణ స్థాయిలో పెరుగుతోంది. దీనిని వీలైనంత మేరకు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆరు తడి పంటలు సాగుచేయాలని రైతులకు సూచిస్తోంది. ఈసారి వానాకాలం సీజన్‌లో వరి విస్తీర్ణం కాస్త తగ్గి 56.80లక్షల ఎకరాలకే పరిమితమైంది. యాసంగిలో ఎట్టిపరిస్థితుల్లో వరి సాగుచేయొద్దని, ఏమాత్రం నీటి వసతి ఉన్నా ఆరుతడి పంటలు సాగుచేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. రైతులను ఆరుతడి పంటల సాగువైపు మళ్లించేందుకు ఆర్థికంగా ప్రోత్సహించాలనే ప్రతిపాదన కొంతకాలంగా ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలకు ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహం అందిస్తుందా? అనే చర్చ తెరపైకి వచ్చింది. ఆరుతడి పంటలు సాగుచేసే రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకం ఇస్తారా? లేకపోతే నీటివసతి ఉండి.. ఆరుతడి పంటలు సాగుచేసే రైతులకు రైతుభరోసా చెల్లిస్తారా? అనే అంశంపైనా చర్చ జరుగుతోంది. మరోవైపు వానాకాలం సీజన్‌లో జరిగిన నష్టాన్ని అధిగమించేందుకు కరువు ప్యాకేజీ కింద తెలంగాణకు రూ.20 వేల కోట్లు మంజూరుచేయాలని కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందన్నది చూడాల్సి ఉంది.

Updated Date - Oct 30 , 2026 | 06:08 AM