Share News

సర్కారీ దవాఖానాల్లో విదేశీ రోగులకు చికిత్స

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:07 AM

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి రోగులు చికిత్స కోసం హైదరాబాద్‌ వస్తుంటారు. అలా వచ్చే వారందరి గమ్యం కార్పొరేట్‌ ఆస్పత్రులే! అలా కాకుండా..

సర్కారీ దవాఖానాల్లో విదేశీ రోగులకు చికిత్స

  • ప్రత్యేక విధానం రూపొందిస్తున్న ప్రభుత్వం

  • మూడు టిమ్స్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేక విభాగాలు

  • ఒక్కో చోటా 50 పడకల కేటాయింపు

  • విదేశాలతో అవగాహన ఒప్పందాలకు సిద్ధం

  • కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి రోగులు చికిత్స కోసం హైదరాబాద్‌ వస్తుంటారు. అలా వచ్చే వారందరి గమ్యం కార్పొరేట్‌ ఆస్పత్రులే! అలా కాకుండా.. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా సర్కారీ దవాఖానాల్లో వారికి వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక పాలసీని తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందు కోసం ‘జీ టు జీ’ ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అంటే ఆయా దేశాల ప్రభుత్వాలతో నేరుగా అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) చేసుకోనుంది. కొత్తగా నిర్మిస్తున్న సనత్‌నగర్‌ టిమ్స్‌తో పాటు అల్వాల్‌, ఎల్బీనగర్‌ టిమ్స్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని.. ఒక్కోచోటా 50 పడకలను విదేశీయులకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాటికి సనత్‌నగర్‌, అల్వాల్‌ టిమ్స్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రం ఏర్పాటైన 2014లో 75,000 మంది విదేశీ రోగులు ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందగా.. 2024 నాటికి ఆ సంఖ్య 1,55,131కు చేరుకుంది. ముఖ్యంగా ఆఫ్రికా, అరబ్‌ దేశాల నుంచి ఎక్కువగా పేషంట్లు చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తుంటారు. అమెరికా, బ్రిటన్‌, రష్యా వంటి దేశాలవారూ వస్తుంటారు. దీంతో, కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు వారి కోసం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు సర్కారీ ఆస్పత్రుల్లోనూ అటువంటి వ్యవస్థనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విదేశీ రోగులను ఆకర్షించడానికి.. టిమ్స్‌ ఆస్పత్రుల్లో శానిటేషన్‌, డైట్‌, వార్డుల నిర్వహణ విషయంలో కార్పొరేట్‌ సంస్థలకు ఏ మాత్రం తీసిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే.. విదేశీయులకు భాష సమస్య కాకుండా ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతులను కల్పిస్తున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల కన్నా మెరుగైన వైద్య సేవలను తక్కువ ఖర్చులో అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యంగా.. అవయవాల మార్పిడి, గుండె శస్త్రచికిత్సలు, క్యాన్సర్‌ వంటి క్లిష్టమైన వ్యాధులకు సమర్థమైన చికిత్సలను టిమ్స్‌లో అందించాలని నిర్ణయించినట్లు వైద్యశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. విదేశీ పేషంట్ల రాకతో ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం రూపంలో ఆదాయం పెరుగుతుందని.. స్థానిక పేద ప్రజలకు సైతం ఈ ఏర్పాట్లు వరంగా మారుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - Apr 06 , 2026 | 07:10 AM