Share News

మండలంలో అన్ని శాఖలకూ ఎంపీడీవోనే బాస్‌!

ABN , Publish Date - Aug 04 , 2026 | 07:39 AM

గ్రామీణ పరిపాలనను సమర్థంగా నిర్వహించి, ప్రజలకు వేగంగా సేవలు అందించి, స్థానిక సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించడం వంటి లక్ష్యాలతో మండల పరిషత్‌ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

మండలంలో అన్ని శాఖలకూ ఎంపీడీవోనే బాస్‌!
Telangana MPDO

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): గ్రామీణ పరిపాలనను సమర్థంగా నిర్వహించి, ప్రజలకు వేగంగా సేవలు అందించి, స్థానిక సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించడం వంటి లక్ష్యాలతో మండల పరిషత్‌ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకునేలా.. మండల పరిషత్‌ వ్యవస్థను పటిష్ఠం చేయాలని ఇటీవల ఓ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఎంపీడీవో (మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి)ల పర్యవేక్షణలో మండల స్థాయిలోని అన్ని విభాగాలు పనిచేసే విధంగా ఒక ప్రతిపాదన తేవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు వారు విధి విధానాలను రూపొందించే పనిలో పడ్డారు.


గతంలో బ్లాక్‌ ఆఫీసులున్నపుడు బీడీవో (బ్లాక్‌ అభివృద్ధి అధికారి) పరిధిలోనే అన్ని ప్రభుత్వ శాఖలు పనిచేసేవని.. ఆ సమయంలో ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు, ప్రస్తుత మార్పులకు అనుగుణంగా ఏ విధంగా శాఖల మధ్య సమన్వయం తేవచ్చనే దానిపై పీఆర్‌ శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. అయితే సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఎంపీడీవో కేంద్రంగా ప్రభుత్వ విభాగాలు పనిచేసేలా చేస్తే.. వేర్వేరు శాఖలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల మధ్య సమన్వయం పెరుగుతుందని.. నిధుల వినియోగం మెరుగుపడే అవకాశం ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంలో కూడా ఈ విధానం ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు.


పాత విధానాల పరిశీలన

అన్ని ప్రభుత్వ శాఖలు ఎంపీడీవో పర్యవేక్షణలో కొనసాగేలా చేయాలన్న రాష్ట్ర సర్కారు ప్రతిపాదనకు అనుగుణంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పాత విధానాలను పరిశీలిస్తున్నారు. అందులోని విధి విధానాలను ఆఽధారంగా చేసుకొని కొత్త ప్రతిపాదనలను రూపొందించే పనిలో నిమగ్నమవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1980 నుంచి మండల పరిషత్‌ వ్యవస్థ గ్రామీణ పాలనలో కీలక పాత్ర పోషించింది. వ్యవసాయం, పశుసంవర్ధక, విద్య, వైద్యం, మహిళా శిశు సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్‌, ఉపాధి, ఇతర అభివృద్ధి శాఖల అధికారులు మండల స్థాయిలో ఒకే వేదికపై సమావేశమై స్థానిక సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు.


ఎంపీడీవో కార్యాలయం సమన్వయ కేంద్రంగా పనిచేయడంతో అభివృద్ధి పనుల్లో వేగం కనిపించేది. అయితే రాష్ట్ర విభజనకు ముందు నుంచే వివిధ ప్రభుత్వ శాఖలు స్వతంత్ర పరిపాలనా విధానాలను అనుసరించడం ప్రారంభించాయి. ప్రతి శాఖ నేరుగా జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు నివేదికలు సమర్పించే విధా నం పెరగడంతో మండల పరిషత్‌ సమావేశాల ప్రభావం క్రమంగా తగ్గిపోయింది. ఫలితంగా స్థానిక సమస్యల పరిష్కారంలో ఆలస్యం, శాఖల మధ్య సమన్వయం లోపించడం, ప్రజలు ఒక్క సమస్య పరిష్కారానికి అనేక కార్యాలయాలు తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.


ప్రభుత్వ ప్రతిపాదనలిలా..

ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతిపాదన మేరకు మండల స్థాయిలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను ఒక సమన్వయ వ్యవస్థ కిందకు తెచ్చి ఎంపీడీవో ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించే విధానాన్ని రూపొందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రతిశాఖ తన అధికారాలను కొనసాగించినప్పటికీ, మండల స్థాయిలో ప్రణాళికలు, పనుల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో ఉమ్మడి సమన్వయం ఉండేలా వ్యవస్థను రూపొందించే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్యశాఖ, వైద్యం, విద్య, ఐసీడీఎస్‌, పంచాయతీ రాజ్‌, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ, సంక్షేమ శాఖల అధికారులు మండల స్థాయిలో క్రమం తప్పకుండా సమావేశమై అభివృద్ధి పనులపై సమీక్షించే అవకాశముంటుంది.


దీంతో సమస్యలు ప్రారంభ దశలోనే గుర్తించి త్వరగా పరిష్కరించవచ్చని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల మధ్య తిరిగే అవసరం కొంతవరకు తగ్గే అవకాశముంది. వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను ఒకే వేదికపై వినిపించే వీలుంటుంది. ఇటు.. మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో ప్రజా ప్రతినిఽధులకు ప్రాధాన్యం పెరిగే అవకాశముంది. మండల పరిషత్‌ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు గ్రామాల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరేందుకు వీలవుతుంది.


ఇవి కూడా చదవండి

170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో అమరే చీర.. సిరిసిల్లలో చేనేత కళాకారుడి ప్రతిభ

భర్త, అత్తకు భోజనంలో విషం!

Updated Date - Aug 04 , 2026 | 07:44 AM