మహానగర పాలనకు కొత్త వ్యవస్థ
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:10 AM
హైదరాబాద్ మహానగర ప్రాంత పాలనను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
విధాన నిర్ణయాలకు అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్..
పర్యవేక్షణకు ఎగ్జిక్యూటివ్ కమిటీ
కౌన్సిల్ ఎక్స్అఫీషియో చైర్‌పర్సన్‌గా సీఎం
రెండు కీలక కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహానగర ప్రాంత పాలనను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) చట్టం-2026 అమల్లో భాగంగా క్యూర్ పరిధిలో అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ గురువారం రెండు (జీవో 251, 252) ఉత్తర్వులిచ్చింది. అక్టోబరు 2 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ద్వారా 1955 నాటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చట్టాన్ని రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ విధాన నిర్ణయాలకు కీలకం కానుంది. ముఖ్యమంత్రి ఈ కౌన్సిల్‌కు ఎక్స్అఫీషియో ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. పురపాలక శాఖ మంత్రి సభ్యుడిగా, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు. చర్చించే అంశాలను బట్టి సంబంధిత శాఖల మంత్రులను ప్రత్యేక సభ్యులుగా, ఇతర శాఖల అధికారులను ప్రత్యేక ఆహ్వానితులుగా చైర్పర్సన్ ఆహ్వానించవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కౌన్సిల్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి లేదా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ కమిటీ చైర్‌పర్సన్‌గా, హెచ్ఎండీ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కమిటీలో క్యూర్ పరిధిలోని అన్ని కార్పొరేషన్ల కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు పోలీసు కమిషనర్లు, సంబంధిత జిల్లా కలెక్టర్లు, టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ, వాటర్ బోర్డు ఎండీ, మెట్రో రైల్ ఎండీ, ఆర్టీసీ ఎండీ, హైడ్రా కమిషనర్ సభ్యులుగా కొనసాగుతారు.
ఈ కమిటీ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ నిర్ణయాలకు అవసరమైన అంశాలను గుర్తించి ప్రతిపాదిస్తుంది. క్యూర్ పరిధిలో అభివృద్ధి ప్రణాళికలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనలో శాఖల మధ్య సమన్వయానికి ఈ కౌన్సిల్, కమిటీ కీలకం కానున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ధరణి, భూభారతిలో లక్షల ఎకరాల దోపిడీ: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి