Share News

నెల రోజుల్లో ప్రభుత్వాస్పత్రుల్లో సేఫ్టీ ఆడిట్లు.. మంత్రి దామోదర కీలక ఆదేశాలు

ABN , Publish Date - Sep 24 , 2026 | 09:14 PM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. ఆస్పత్రుల్లో సేఫ్టీ ఆడిట్లతో పాటు ఫైర్‌, ఎలక్ట్రికల్‌, స్ట్రక్చరల్‌ భద్రతపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు.

నెల రోజుల్లో ప్రభుత్వాస్పత్రుల్లో సేఫ్టీ ఆడిట్లు.. మంత్రి దామోదర కీలక ఆదేశాలు
Telangana Government Hospitals

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెల రోజుల్లో సేఫ్టీ ఆడిట్లు పూర్తి చేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు, విద్యుత్‌ లోపాలు, భవన నిర్మాణ భద్రతకు సంబంధించిన అంశాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫైర్‌ సేఫ్టీ, ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ఆడిట్లు నిర్వహించాలని, ఏడాదికి ఒకసారి స్ట్రక్చరల్‌ సేఫ్టీ ఆడిట్‌ చేపట్టాలని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు రోగులు, వారి సహాయకులను సురక్షితంగా బయటకు తరలించేందుకు ప్రత్యేక ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్‌ ప్లాన్‌లు సిద్ధం చేయడంతో పాటు క్రమం తప్పకుండా మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలని అధికారులకు సూచించారు.


ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా పర్యవేక్షణ పెంచాలని మంత్రి దామోదర ఆదేశించారు. అగ్నిమాపక పరికరాలు, విద్యుత్‌ భద్రతా పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. పరికరాల నిర్వహణ, మరమ్మతులు, భద్రతా చర్యలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉండేలా ఫైర్‌, ఎలక్ట్రికల్‌ సేఫ్టీ పరికరాల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని తెలిపారు. ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

బిహార్‌లో దారుణం.. మరో బాలికపై లైంగిక వేధింపులు..

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసు.. వెలుగులోకి సీసీటీవీ దృశ్యాలు..

Updated Date - Sep 24 , 2026 | 09:31 PM