రేపటితో ప్రజాప్రభుత్వానికి1000 రోజులు
ABN , Publish Date - Aug 31 , 2026 | 06:00 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం మంగళవారంతో (సెప్టెంబర్ 1నాటికి) వెయ్యి రోజుల మైలురాయిని పూర్తిచేసుకుంటోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందించడం, సంక్షేమానికి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం.. రైతు, యువజన, మహిళా శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తూ.. రాష్ట్ర సంపదను పెంచడమే లక్ష్యంగా ప్రజాపాలన దూసుకుపోతోందని ప్రభుత్వం ప్రకటించింది
ఈ మూడేళ్లలో సంక్షేమం, ప్రగతి పరుగులు
రైతుల సంక్షేమానికి రూ.1.68 లక్షల కోట్లు
ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో మహిళలకు 11వేల కోట్ల ఆదా
72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు
ఆరోగ్యానికి ప్రాధాన్యం.. రూ.10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంపు
ప్రభుత్వరంగంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు
ప్రత్యేక విభాగాలతో డ్రగ్స్, ఆహార కల్తీపై ఉక్కుపాదం
టీజీ-ఐపాస్ ద్వారా రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడులు
పెట్టుబడులకు ప్రపంచ స్థాయి కేంద్రంగా తెలంగాణరేపటితో ప్రజాప్రభుత్వానికి వెయ్యిరోజులు
ఈ మూడేళ్లలో సంక్షేమం, ప్రగతి పరుగులు.. పాలన ప్రగతిని వివరించిన రేవంత్ సర్కారు
2034 నాటికి ట్రిలియన్, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ప్రకటన
హైదరాబాద్, ఆగస్టు30 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం మంగళవారంతో (సెప్టెంబర్ 1నాటికి) వెయ్యి రోజుల మైలురాయిని పూర్తిచేసుకుంటోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందించడం, సంక్షేమానికి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం.. రైతు, యువజన, మహిళా శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తూ.. రాష్ట్ర సంపదను పెంచడమే లక్ష్యంగా ప్రజాపాలన దూసుకుపోతోందని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకుని రావడంలో, ప్రపంచస్ధాయి మౌలిక సదుపాయాలు నిర్మించడంలో ఈ వెయ్యి రోజుల పాలన కొత్త అధ్యాయాన్ని నమోదు చేసిందని ఆదివారం ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. సంక్షేమ పథకాల అమలుతో పాటు వ్యవసాయం, మహిళా సాధికారత, విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన, సామాజిక న్యాయం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై ఈ కాలంలో ప్రధానంగా దృష్టి సారించినట్టు ప్రకటించింది. 2025-26లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, ఇది దేశ తలసరి ఆదాయం కంటే దాదాపు 91 శాతం అధికమని వెల్లడించింది. వెయ్యి రోజుల ప్రజాపాలనలో సాధించిన ప్రగతి, ఇతర లక్ష్యాల వివరాలను గణాంకాల సహితంగా ప్రభుత్వం వెల్లడించింది.
రైతు సంక్షేమానికి పెద్దపీట..
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రైతుల సంక్షేమం కోసం రూ.1,68,000 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీతో 25 లక్షల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం కలిగింది. రైతు భరోసా కింద రైతులకు నేరుగా రూ.36 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం లభించింది. సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోన్‌సతోపాటు.. గత యాసంగిలో 81.12 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు వాటా కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
మహిళలకు మహాలక్ష్మి
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 335 కోట్లకుపైగా ఉచిత ప్రయాణాలు కొనసాగించారు. దీని ద్వారా మహిళలకు దాదాపు రూ.11 వేల కోట్ల మేరకు ఆదా అయింది. గృహజ్యోతి ద్వారా 53 లక్షలకుపైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తోంది. 4.54 లక్షల మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.60,487 కోట్ల రుణాలు అందించడంతో పాటు రూ.1,900కోట్ల వడ్డీ రాయితీ కల్పించారు. పాఠశాల విద్యార్ధులకు యూనిఫామ్‌లు కుట్టేపని, చీరల తయారీ, పెట్రోల్ బంకుల నిర్వహణ.. ఆర్టీసీ బస్సుల యాజమాన్యాన్ని మహిళా సంఘాలకు కేటాయించి, వారి సాధికారతకు కృషిచేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పేదలకు 15 లక్షలకుపైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతోపాటు.. మొత్తం 3.38 కోట్ల మందికిపైగా ఆహార భద్రత కల్పిస్తూ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. పేదల సొంతింటి కల సాకారానికి వీలుగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టి.. అర్హత కలిగిన కుటుంబానికి రూ.5 లక్షల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. 2.25 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. మొత్తం 43 లక్షలకుపైగా లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు అందుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల వివరాల సేకరణకు సమగ్ర సర్వే నిర్వహించింది. ఎస్సీ వర్గీకరణను అమలు చేసింది. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లకు శాసనసభ ఆమోదం తెలిపింది. గిగ్ కార్మికులకు చట్టబద్ద గుర్తింపు, సంక్షేమ బోర్డు, సామాజిక భద్రత కల్పించే ప్రత్యేక చట్టాన్ని తీసుకుని వచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది.
విద్య-ఉపాధికి ప్రాధాన్యం..
ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు 105 స్కూళ్లను మంజూరు చేసింది. ప్రీ పైమరి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్ధులకు అల్పాహారం, పాలు, షోషకాహరం కోసం రూ.720కోట్లు కేటాయించింది. డైట్ ఛార్జీలు 40శాతం, కాస్మోటిక్ ఛార్జీలను 212శాతం పెంచింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1000 కోట్లు కేటాయించింది. 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టింది.
ప్రజారోగ్యం బలోపేతం
రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు ప్రభుత్వం వివరించింది. గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో 2 వేల పడకల కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తోంది. హైదరాబాద్ నలుదిక్కుల్లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, తొమ్మిది కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. సీఎంఆర్‌ఎఫ్ ద్వారా 5.18 లక్షల మందికి రూ.2,526కోట్ల సాయం అందించింది. నిమ్స్‌లో 2000 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. డ్రగ్స్‌పై పోరాటానికి ఈగల్‌ఫోర్స్‌ను.. ఆహార కల్తీ, డ్రగ్స్ నియంత్రణ కోసం టీజీ ేసఫ్‌ను ఏర్పాటు చేసింది. ప్రమాదాల నియంత్రణకు టీజీ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను ఏర్పాటు చేసింది. విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ అండ్‌సేఫ్టీ కమిటీల ఏర్పాటుపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది
రూ.లక్షల కోట్ల పెట్టుబడులు
టీజీ-ఐపాస్ ద్వారా 1.29 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయని, టీజీఐఐసీ భూముల్లో రూ.92,281 కోట్ల పెట్టుబడులతో 78 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలకు మార్గం ఏర్పడిందని తెలిపింది. హైదరాబాద్‌లో 355కు పైగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు ఉండగా, 2026లోనే మరో 40 కేంద్రాలు నగరాన్ని ఎంచుకున్నట్టు పేర్కొంది. 2025-26లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరగా, ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాల సంఖ్య 12.14 లక్షలకు చేరింది. హైదరాబాద్ చుట్టూ 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు, 6,092 కిలోమీటర్ల హ్యామ్ రోడ్లు, 122.9 కిలోమీటర్ల మెట్రో రెండో దశ, మూసీ పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్‌సిటీ, ఏఐ సిటీ వంటి ప్రాజెక్టులతో భవిష్యత్ తెలంగాణకు పునాదులు పడ్డాయి. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.