Share News

వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు పార్ట్‌టైమ్‌ బీటెక్‌

ABN , Publish Date - Mar 12 , 2026 | 05:02 AM

డిప్లొమో పూర్తి చేసి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు పార్ట్‌టైమ్‌ బీటెక్‌ కోర్సులు అభ్యసించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు పార్ట్‌టైమ్‌ బీటెక్‌

  • రాష్ట్రంలోని 12 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలకు అనుమతి

హైదరాబాద్‌ సిటీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): డిప్లొమో పూర్తి చేసి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు పార్ట్‌టైమ్‌ బీటెక్‌ కోర్సులు అభ్యసించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి పార్ట్‌టైమ్‌ బీటెక్‌ కోర్సుల నిర్వహణకు రాష్ట్రంలోని 12 ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలకు అనుమతి ఇచ్చింది. అనుమతులు పొందిన వాటిల్లో జేఎన్‌టీయూ అఫిలియేటెడ్‌ కళాశాలలు 7, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్‌ కళాశాలలు 5 ఉన్నాయి. ఈ పార్ట్‌ టైమ్‌ కోర్సులకు సాయంత్రం వేళల్లో తరగతులు జరుగుతాయి. కాగా, ్ల పార్ట్‌టైమ్‌ బీటెక్‌ కోర్సుల నిర్వహణకు ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలు ఓ వైపు పోటీపడుతుండగా, జేఎన్‌టీయూ, ఉస్మానియా ఇంజనీరింగ్‌ కళాశాలల ఉన్నతాధికారులు మాత్రం అసక్తి కనబరచడం లేదు. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో తక్కువ ఫీజులతో చదువుకునే అవకాశం లేక చిరుద్యోగులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు కళాశాలల్లో చేరుతున్నారు.

ఉస్మానియా, జేఎన్‌టీయూ కళాశాలల్లో వార్షిక ట్యూషన్‌ ఫీజు రూ.50వేలు ఉండగా, ప్రైవేటు కాలేజీల్లో ఏడాదికి రూ.లక్ష నుంచి 1.85లక్షల చొప్పున ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సి వస్తోందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పార్ట్‌టైమ్‌ కోర్సుల నిర్వహణకు బోధనా సిబ్బంది కొరతను సాకుగా చూపుతున్న ఆయా యూనివర్సిటీల ఉన్నతాధికారులు.. ఒకరిద్దరు ఆచార్యులే ఉన్న కెమికల్‌ ఇంజనీరింగ్‌, జియో ఇన్ఫర్మాటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ తదితర విభాగాలను ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. క్యాంపస్‌ కళాశాలలో పార్ట్‌టైమ్‌ బీటెక్‌ కోర్సుల నిర్వహణ విషయమైౖ జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావును వివరణ కోరగా ప్రిన్సిపాల్‌తో సంప్రదించి అవసరమైన చర్యలు చేపడతామన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 09:25 AM